అష్ట దిగ్బంధంలో సైబరాబాద్‌! | Hyderabad Traffic Problems | Sakshi
Sakshi News home page

అష్ట దిగ్బంధంలో సైబరాబాద్‌!

Published Sat, Aug 18 2018 11:08 AM | Last Updated on Thu, Sep 27 2018 3:58 PM

Hyderabad Traffic Problems - Sakshi

హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌ ఫ్లైఓవర్‌పై వాహన విస్తోటం

సాక్షి,సిటీబ్యూరో: ఐటీ కారిడార్‌ వాహనదారులకు నరకం చూపిస్తోంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు.. తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 9 వరకు ట్రాఫిక్‌తో సైబరాబాద్‌ అష్ట దిగ్బంధం (గ్రిడ్‌లాక్‌)లో చిక్కుకుంటోంది. ఐదు కిలోమీటర్ల దూరం కదలలాంటే గంటకు పైగా సమయం పడుతోంది. ఇక వీకెండ్‌ సాయంత్రాలు, చిరు జల్లుల కురిసిన  సమయాల్లోనైతే హడలెత్తిస్తోంది. కూకట్‌పల్లి నుంచి సైబర్‌ టవర్‌ రోడ్, మొహిదీపట్నం నుంచి బయోడైవర్సిటీ జంక్షన్‌ మీదుగా మాదాపూర్‌ రోడ్, ఆల్విన్‌ కాలనీ నుంచి కొత్తగూడ, శేరిలింగంపల్లి నుంచి ట్రిపుల్‌ ఐటీ రోడ్లు అత్యంత రద్దీతో నిండిపోతున్నాయి. సైబరాబాద్‌లో సుమారు మూడున్నర లక్షల మంది ఐటీ ఉద్యోగులకు తోడు వ్యాపార, వాణిజ్య సంస్థల కార్యకలాపాలన్నీ రోజుకు రోజుకు పెరుగుతున్నాయి.

దీంతో వాహన విస్పోటనానికి దారి తీస్తోంది. దీంతో ఐటీ కారిడార్‌లో వాహన వేగం ఘోరంగా పడిపోయి బయటకు వెళ్లాలంటనే హడలెత్తిపోయే పరిస్థితి కనిపిస్తోంది. జీహెచ్‌ఎంసీ ఓ ప్రైవేట్‌ ఎజెన్సీతో రెండేళ్ల క్రితం నిర్వహించిన సర్వేలో మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌లో రోజుకు 1.64 లక్షల వాహనాలు, బయోడైవర్సిటీ జంక్షన్‌లో 1.38 లక్షల వాహనాలు, రాజీవ్‌ గాంధీ జంక్షన్‌లో 1.17 లక్షల వాహనాలు,  గచ్చిబౌలి కూడలిలో 1,13,970 వాహనాలు రాకపోకలు సాగుస్తున్నాయని తేలింది. ఇటీవల చేసిన తాజా సర్వేలో వాటి సంఖ్య మరో 30 శాతానికి పెరిగినట్టు అంచనా. దీంతో పీక్‌ అవర్స్‌లో వాహన వేగం గంటకు 10 కిలోమీటర్లకు పడిపోయింది.
 
మున్ముందు మరింత రద్దీ  
ఇప్పటికే వాహనాల ట్రాఫిక్‌తో దిగ్బంధం కావడం, ఎస్సార్‌డీపీ పనులు మొత్తం పూర్తి కాకపోవడంతో ఐడీ కారిడార్‌లో మున్ముందు మరింత రద్దీ పెరిగనున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికి 500 ఐటీ పరిశ్రమలకు తోడు మాల్స్, అస్పత్రులు, విద్యా సంస్థలకు తోడు కొత్తగూడ జంక్షన్‌లో 20 లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో శరత్‌ కాపిటల్‌ మాల్, నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్టŠట్‌లో అమెజాన్, అమెరికన్‌ కాన్సులేట్, రాయదుర్గం సర్వే నెంబర్‌ 83లోని నాలెడ్జి సిటీలో అరబిందో, మెట్రో, మైహోమ్, ఆర్‌ఎంజెడ్, ఎస్‌బీహెచ్, ఎల్‌అండ్‌టీ మాల్‌ తదితర కంపెనీలు రానున్నాయి. నగరానికి నలువైపులా అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామన్న ప్రస్తుత ప్రభుత్వ హామీకి భిన్నంగా ఐటీ కారిడార్‌ కిక్కిరిసి పోతోంది. వాస్తవానికి ఈస్ట్‌ హైదరాబాద్‌లో పోచారం, ఆదిభట్ల ప్రాంతాల్లో ఐటీ ఆశించిన స్థాయిలో విస్తరించకపోవడం వల్ల సైబరాబాద్‌కు ఇబ్బందులు తెస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
 
ఆకాశ వంతెనలతో ఉపశమనం 

  • సైబరాబాద్‌.. డెవలప్‌మెంట్‌ అథారిటీ డిజైన్‌ చేసిందాని కంటే అధికంగా వాహనాలు, జనాలతో కిక్కిరిసి పోతుండడంతో ట్రాఫిక్‌తో పాటు ఇతర  మౌలిక సదుపాయాలకు ఇబ్బందులు తప్పేలాలేవు. ట్రాఫిక్‌కు సంబంధించి రద్దీ (ప్యాసింజర్‌ ఫర్‌ యూనిట్‌–పీసీయూ)ఇలా ఉంది.  
  • అయ్యప్పసొసైటీ అండర్‌ పాస్‌ పీసీయూ 8656గా ఉండగా రోజుకు 1,01,245 గా ఉంది. 
  • మైండ్‌స్పేస్‌ జంక్షన్‌లో గంటకు 14,393, రోజుకు 1,64,084  
  • బయోడైవర్సిటీ జంక్షన్‌లో 14,001 ఉండగా, రోజుకు 1,38,069 
  • రాజీవ్‌ గాంధీ జంక్షన్‌లో 14,073 ఉండగా, రోజుకు 1,17,891 
  • బొటానికల్‌ గార్డెన్‌ 6,617 ఉండగా, రోజుకు 74,133 గా ఉంది. 
  • కొత్తగూడ జంక్షన్‌లో 8,540, రోజుకు 1,13,970 
  • కొండాపూర్‌ జంక్షన్‌లో 5,017 ఉండగా, రోజుకు  53,655 
  • గచ్చిబౌలి జంక్షన్‌లో గంటకు 9,806 ఉండగా, రోజుకు 1,16,560 ఉన్నట్టు గుర్తించారు. 
  • బొటానికల్‌ గార్డెన్‌ జంక్షన్‌ దాటాలంటే 107 నుంచి 131 సెకన్లు, కొత్తగూడ జంక్షన్‌లో 140 నుంచి 250 సెకన్లు పడుతుంది. కొండాపూర్‌ జంక్షన్‌లో 110 సెకన్ల నుంచి 138 సెకన్ల సమయం పడుతోంది. 
  • గచ్చిబౌలి జంక్షన్‌ దాటేందుకు 220 సెకన్ల సమయం పడుతుంది. 
  • బైక్‌లు, కార్లు 75 శాతం నుంచి 85 శాతం ట్రాఫిక్‌ కారణమవుతున్నాయి. 
  • ప్రస్తుతం ఐటీ కారిడార్‌లో వాహనాల స్పీడ్‌ గంటకు 25 కిలోమీటర్లు ఉన్నట్లుగా జీహెచ్‌ఎంసీ సర్వేలో చెబుతున్నప్పటికీ గంటకు 14 కిలోమీటర్లు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఎస్‌ఆర్‌డీపీ ప్రణాళిక రూపొందించారు. వాస్తవానికి పీక్‌ అవర్‌లో గంటకు 10 కి.మీ మాత్రమే ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.


కొనసాగుతున్న ఎస్సార్‌డీపీ పనులు 
మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ అండర్‌ పాస్, మైండ్‌ స్పేస్‌ అండర్‌ పాస్‌ అందుబాటులోకి వచ్చాయి. మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌లో ఫ్లైఓవర్‌ కొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. బయోడైవర్సిటీ జంక్షన్‌లోని ఫ్లైఓవర్‌ వచ్చే మార్చి నాటికి సిద్ధం కానుంది. కూకట్‌పల్లి పరిధిలోని రాజీవ్‌ గాంధీ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ ఈ డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. రూ.184 కోట్లతో చేపడుతున్న దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి 2019 మార్చి నాటికి పూర్తి చేయనున్నారు. రూ.263.09 కోట్ల వ్యయంతో కొత్తగూడ జంక్షన్‌లో గ్రేటర్‌ సెపరేటర్స్‌ 2019 డిసెంబర్‌ నాటికి పూర్తి చేయా ల్సి ఉంది.

రూ.225 కోట్లతో సైబర్‌టవర్‌ ఎలివేటెడ్‌ రోటరీ ఏజెన్సీ అప్రూవ్డ్‌ చేయాల్సి ఉంది. రూ.330 కోట్లతో శిల్పా లేవుట్‌ నుంచి గచ్చిబౌలి అవుటర్‌ జంక్షన్‌ వరకు ఫ్లైఓవర్‌ టెండర్‌ దశలో ఉంది. రూ.875 కోట్లతో ఖాజాగూడ టన్నెల్, ఎలివేటెడ్‌ కారిడార్‌కు అనుమతులు రావాలి. ప్రస్తుతం నగరంలో చేపడుతున్న ఎస్సార్‌డీపీ పనులన్నీ 2035 నాటికి ట్రాఫిక్‌ రద్దీకి అనుగుణంగా రోడ్లను అభివృద్ధి చేస్తున్నా.. సైబరాబాద్‌లో వాహనాలు, జనాలు పెరుగుతున్న తీరు మాత్రం ఆందోళన కలిగిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement