పార్టీ మారను | i am not change congress party says t.nageswara rao | Sakshi
Sakshi News home page

పార్టీ మారను

Published Mon, Mar 17 2014 11:56 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

i am not change congress party says t.nageswara rao

సంగారెడ్డి మున్సిపాలిటీ న్యూస్‌లైన్: తాను బతికున్నంత వరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని పటాన్‌చెరు ఎమ్మెల్యే టి. నందీశ్వర్‌గౌడ్ స్పష్టం చేశారు. పార్టీలో తనను అవమానించడం వల్లే బయటకు వెళ్లాలనుకున్నానని తెలిపారు. సోమవారం ఆయన పట్టణంలోని ఇందిరాభవన్ ఆవరణలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. బలహీన వర్గానికి చెందిన తనను రాజకీయంగా అణచివేసేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు.


 2009 ఎన్నికల్లో భూపాల్‌రెడ్డి తన తరఫున ప్రచారం చేస్తూనే తెర వెనుక ఓడించేందుకు మహిపాల్‌రెడ్డిని ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దింపారని విమర్శించారు. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుని రావాలని భూపాల్‌రెడ్డిని ఆదేశించినా ఆయన పట్టించుకోలేదన్నారు. ఇటీవల అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఏఐసీసీ ప్రతినిధులు వచ్చిన సందర్భంగా నియోజకవర్గం నుంచి టిక్కెట్లు ఆశిస్తున్న వారి జాబితాలో నాలుగు పేర్లు ఇచ్చినప్పటికీ తన పేరు ఇవ్వకుండా వివక్ష చూపారన్నారు. పార్టీల్లో తనను అవమానించడం వల్లే పార్టీ మారాలనుకున్నానని తెలిపారు.

ఇందుకోసం కేసీఆర్ తనతో మాట్లాడి టిక్కెట్ ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ఈ విషయం రాహుల్‌గాంధీకి తెలియడంతో ఆయన స్వయంగా తనతో మాట్లాడారని పార్టీలో ఎలాంటి వివక్ష ఉండదని వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కచ్చితంగా అవకాశం ఉంటుందని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించడంతో తాను టీఅర్‌ఎస్‌లో చేరే ఆలోచనను విరమించుకున్నానని వివరించారు. వచ్చే ఎన్నికల్లో తాను పటాన్‌చెరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

 కలిసి పనిచేస్తే పది సీట్లు ఖాయం..
 వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనాయకులు కలిసి పనిచేస్తే పదికి పది స్థానాలు సాధించుకుంటామని నందీశ్వర్‌గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉన్నందున అభ్యర్థుల గెలుపు సులభం కాదని అందుకు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక చొరవ చూపాలన్నారు. అధిష్టానం ఎవ్వరికి టిక్కెట్ ఇచ్చినా తాను సామాన్య కార్యకర్తగా పనిచేస్తానని తెలిపారు. జిల్లాలో మాజీ మంత్రులు గీతారెడ్డి, సునీతా లకా్ష్మరెడ్డితో పాటు సీనియర్ ఎమ్మెల్యేలు గ్రూపు రాజకీయాలు లేకుండా ఐక్యంగా పనిచేసేందుకు కృషి చేయాలని సూచించారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ తరపున పోటీ చేసే ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు తానే పార్టీ బీ ఫారాలను అందజేయనున్నట్లు తెలిపారు. పార్టీకోసం పనిచేసిన వారికే అవకాశం ఇస్తానని నందీశ్వర్‌గౌడ్ స్పష్టం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement