నాన్న కల నెరవేర్చా | I Cleared Father Dream By Becoming Narayanpet Collector | Sakshi
Sakshi News home page

నాన్న కల నెరవేర్చా

Published Sun, Jun 23 2019 3:32 PM | Last Updated on Sun, Jun 23 2019 9:01 PM

I Cleared My Father Goal By Becoming Narayanpet  Collector  - Sakshi

భార్యతో కలిసి మాట్లాడుతున్న నారాయణపేట కలెక్టర్‌ ఎస్‌.వెంకట్‌రావు

మాది వ్యవసాయ, చిన్నపాటి వ్యాపార కుటుంబం. మా తాత వెంకటస్వామి కాలం నుంచి మాకు 30 ఎకరాల భూమి ఉంది. మా తల్లిదండ్రులు సరోజిని, కామరాజు ఎంతో కష్టపడి నన్ను చదివించారు. చదువుకుంటూనే రోజూ ఉదయం సాయంత్రం వేళ.. సెలవుల్లో సేద్యం చేసేందుకు పొలానికి వెళ్లేవాడిని. నేను డిగ్రీలో ఉన్నప్పుడే నాన్న మరణించారు. మా పెద్దనాన్న అప్పలరాజు నాన్నలేని లోటును తీర్చారు. అప్పటి నుంచి నా బాగోగులు ఆయనే చూశారు. మా అన్న చదవాలని తమ్ముళ్లు రాము, హరి ఎంతో ప్రోత్సహించారు. వారు ఇప్పుడు వ్యవసాయం, కుటుంబ వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. 1989లో డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగం వచ్చింది. మేనకోడలు రాజేశ్వరితో 1992లో వివాహమైంది. నా బలమంతా మా ఆవిడే. పిల్లల బాగోలు చూసుకుంటోంది. ఉద్యోగ విధుల్లో ఎంత ఆలస్యంగా ఇంటికి వచ్చినా.. ఏ అర్ధరాత్రి పనిపై బయటికి వెళ్లినా ఎంతో సంతోషంతో నన్ను పంపిస్తుందని అని అన్నారు. తన జీవిత విషయాలను నారాయణపేట  కలెక్టర్‌ ఎస్‌.వెంకట్‌రావుతో ‘సాక్షి’ పర్సనల్‌ టైం

సాక్షి, నారాయణపేట: నా బాల్యం అంత మా స్వగ్రామైన సాలూరులోనే కొనసాగింది. అప్పటికే అది నారాయణపేటలాగా మున్సిపాలిటియే. పట్టణమైనా గ్రామీణప్రాంతాన్ని తలపించేది. ఒకటి నుంచి పదో తరగతి వరకు వేద సమాజం సంస్కృత ఉన్నత పాఠశాలలో చదివాను. ఆ తర్వాత ఇంటర్మీడియెట్‌ ఎంపీసీని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదివి డిగ్రీ (బీకాం) ని బొబ్బిలిలోని ఆర్‌ఎ స్‌ఆర్‌కే కళాశాలలో చదివా. కేరళలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజమ్‌ంట్‌ కళాశాలలో ఎంబీఏ పూర్తి చేశా.నాన్న కలను నెరవేర్చాలనే తపనతో గ్రూప్స్‌కు ప్రిపరేషన్‌ మొదలు పెట్టా.

ఉద్యోగ ప్రస్థానం
1985 గ్రూప్‌–2 రాస్తే ఫలితాలు 1989లో వచ్చాయి. డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగం వచ్చింది. మొదటిసారిగా సొంత జిల్లాలోని మక్కావ మండలం డీటీగా విధులో చేరి పదోన్నతిలో అక్కడే తహసీల్దార్‌గా విధులు నిర్వహించా. 2002లో డిప్యూటీ కలెక్టర్‌గా విశాఖపట్నం, 2003లో టెక్కలి ఆర్డీఓగా, 2004లో నూజివీడు ఆర్డీఓగా, 2007లో గూంటూరు ఆర్డీఓగా పనిచేస్తూ 2009లో అప్పటి విద్యశాఖ మంత్రి పార్థసారథికి పర్సనల్‌ సెక్రటరీగా విధులు నిర్వహించా. ఆ తర్వాత 2010లో కాకినాడ డీఆర్వోగా, 2010–11లో విజయవాడలో సబ్‌ కలెక్టర్‌గా, 2013లో గూంటూరు అడిషనల్‌ జాయింట్‌ కలెక్టర్గా, 2014లో నల్లగొండ జిల్లా జెడ్పీ సీఈఓ, 2016లో అడిషనల్‌ జాయింట్‌ కలెక్టర్‌గా, 2016–17లో యదాద్రి డీఆర్‌డీఓగా,  2018లో మహబూబ్‌నగర్‌ జేసీగా, 2019 మార్చి 1న నారాయణపేట జిల్లా తొలి కలెక్టర్‌గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టా.

అభి‘రుచులు’     
చిన్నప్పటి నుంచి స్వీట్లు తినడం అంటే చాలా ఇష్టం. మా అమ్మ తిపి వంటలు బాగా చేసేది. మా సతీమణి నారుచులకు అనుగుణంగా వంటలను చేసిపెడుతుంది. తీరిక ఉంటే వారంలో ఒకసారి సెకండ్‌ షో సినిమాలకు ఫ్యామిలీతో కలిసి వెళ్తా. నాటి సినిమాల్లో దానవీరశూరకర్ణ, నేటి సినిమాల్లో శ్రీమంతుడు చాలా నచ్చాయి. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌నెహ్రూ, సుభాష్‌చంద్రబోస్‌ వంటి జాతీయ నేతలను ఆదర్శంగా తీసుకున్నాను. అల్లూరి సీతారామరాజు వేషధారణతో పాఠశాల, కళాశాల స్థాయిలో ప్రదర్శనలు, నాటకాలు చేశా. పుస్తకాలు, పత్రికలు చదవడంతో ఎంతో విజ్ఞానాన్ని పొందగలిగా. అవే నా సర్వీసులో ఎంతో ఉపయోగపడ్డాయి.

నాన్న మృతే చీకటి రోజు     
మా నాన్న కామరాజు గుండెపోటుతో నా కళ్ల ముందే ఒల్లో పడుకుని  కన్నుమూశారు. ఆయనకు గుండెపోటు వచ్చిన విషయం మాకు తెలియదు. ఊర్లో ఉన్న దవాఖానాకు తీసుకెళ్లాం. అక్కడ చూసిన జూనియర్‌ డాక్టర్‌  గుండెపోటు వచ్చిందని తెలిసి ట్రీట్‌మెంట్‌ కోసం పుస్తకం తీసి పేజీలు తిప్పడం మొదలుపెట్టారు. ఇక్కడ మించుకుపోతుంది సారూ అంటున్న క్షణంలోనే వైద్యం అందక మరణించారు. నాన్న మృతి కళ్లారా చూసి గుండె పగిలిపోయినట్లయింది. నా జీవితంలో విషాద సంఘటన ఇదే.

ఉద్యోగం వచ్చిన రోజున ఆనందపడ్డా
1989లో గ్రూప్‌–2 ఫలితాలు వెలువడ్డాయి. ఉదయాన్నే పది గంటలకు అమ్మ పాదాలకు నమస్కరించి ఇలా బయటికి వచ్చా. అప్పుడే పోస్ట్‌మెన్‌ లెటర్‌ తెచ్చారు. ఆ లెటర్‌లో డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగం వచ్చినట్లు అపాయింట్‌మెంట్‌ ఉంది. అదే ఏడాది జూలైలో డీటీగా ఉద్యోగం రావడంతో ఎంతో ఆనందపడ్డా. మా అమ్మ చాలా సంతోషిస్తూ మీ నాన్న ఉండి ఉంటే చాలా సంబరపడేవారు అంటూ అక్కున చేర్చుకుంది.

స్ఫూర్తి ప్రదాత రొనాల్డ్‌రోస్‌
మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ నాకు స్ఫూర్తి  ప్రధాత. ఆయన కాకినాడలో ఐఏఎస్‌ క్యాడర్‌లో ఉన్న సమయంలో నేను డీఆర్‌ఓగా ఉన్నాను. అప్పటి నుంచి నా ఉద్యోగ నిర్వహణలో చూపిస్తున్న సేవలను గుర్తిస్తూ ముందుకు తట్టి వస్తున్నారు. యాదాద్రిలో డీఆర్‌డీఓగా పనిచేస్తుంటే అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌ జిల్లా జేసీగా తీసుకొచ్చారు. ఆ తర్వాత నారాయణపేట కొత్త జిల్లాకు కలెక్టర్‌గా కావడం ఎంతో సంతోషంగా ఉంది. రొనాల్డ్‌రోస్‌ తీసుకొస్తున్న నూతన విధానాల మార్పులతో పాలన సౌలభ్యంగా సాగుతుంది. ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటూ నేడు కలెక్టర్‌ హోదాలో నారాయణపేట జిల్లాలో పరిపాలనను ఎంతో సులభంగా ప్రశాంతంగా నిర్వహిస్తున్నా.

పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లో..
నేను పుట్టింది మొదలు.. నా ఉద్యోగ జీవితం దాదాపు ఆంధ్రప్రదేశ్‌ అక్కడే కొనసాగింది. అక్కడ సాగునీటికి పెద్ద కొరత లేదు. తొలిసారిగా తెలంగాణలోని నల్ల గొండ జిల్లాలో 2014లో జెడ్పీ సీఈఓగా బాధ్యతలు చేపట్టా. ఆ ప్రాంతంలో సాగునీరు, తాగునీటికి చాలా ఇబ్బందులు.. ఆ తర్వాత పాలమూరు జిల్లాకు 2018లో జేసీగా వచ్చా. ఎక్కడ చూసినా బీడు భూములు కనిపించడంతో కన్నీళ్లు వచ్చాయి. అందులో నారాయణపేట ప్రాంతమైతే మరి సాగునీరు లేక రైతాంగం కష్టాల్లో ఉన్నట్లు కనిపించింది. త్వరలోనే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయి జిల్లా అంతా పచ్చబడితే చూడాలని ఉంది. 

‘పేట’ జిల్లా అభివృద్ధే ధ్యేయం
వెనుకబడిన నారాయణపేట కొత్త జిల్లాకు కలెక్టర్‌గా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. విద్య, వైద్యంతో పాటు వ్యవసాయ రంగానికి సాగునీరు అందించి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రజలకు చేరువేస్తూ ఉత్తమ పాలనను అందించాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నా. ఈ ప్రాంత ఎమ్మెల్యేలు రాంమోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి తదితరులు సాగునీరు సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు. వారికి నా వంతు తోడ్పాటునందిస్తా.

నా గురువు సత్యం మాస్టారు..
తల్లిదండ్రుల తర్వాత గురువే దైవం. ఆ గురువే మా సత్యం మాస్టారు. సాలూరు వేద సమాజం సంస్కృత ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివాను. అక్కడ నన్ను చాలా ప్రోత్సహించేవారు. తప్పుచేస్తే కోప్పడేవారు. నాలో ఉన్న ప్రతిభను గుర్తించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏ పోటీలు ఉన్నా నన్ను ఎంపిక చేసి పంపేవారు. ‘చదువులో రాణిస్తూ ఉన్నత శిఖరానికి ఎదిగే గొప్ప లక్ష్యం ఉన్న వాడివి నువ్వు..’ అంటూ ఆశీర్వదించేవారు. ఆయన చెప్పిన చదువుతో నేడు కలెక్టర్‌నయ్యాను.

మాతాత పేరే నాకు పెట్టారు
మా తాత పేరు వెంకటస్వామి. ఆయనపేరే మానాన్న నాకు పెట్టారు. మొదట్లో ఐదో తరగతి వరకు నా పేరు వెంకటస్వామిగానే పిలిచేవారు. వెంకటస్వామి ఈజ్‌ ఓల్డ్‌ నేమ్‌ మ్యాన్‌.. వెంకట్రావు ఈజ్‌ న్యూ నేమ్‌ దిస్‌ టైమ్‌ట్రెండ్‌.. అంటూ అప్పట్లో చదువు చేప్పే గురువులు వెంకటస్వామిని కాస్తా వెంకట్రావుగా పేరు మారుస్తూ పాఠశాలలో పేరు మార్చేశారు. ఇక మా నాన్న డిగ్రీలో ఉన్నప్పుడే గుండెపోటుతో మృతిచెందారు. అప్పటి నుంచి పెద్దనాన్న అప్పలరాజు నన్ను అన్ని విధాలా ప్రోత్సహించారు. నేను కలెక్టర్‌ కావాలనేది నాన్న కల. మాపెద్దనాన్న సైతం ఉన్నత స్థాయిలో ఉంటావంటూ ఆశీర్వదించేవారు. వారి కల నేరవేరింది. ఇంట్లో నేనే పెద్దోడిని. అప్పటికే నేను డిగ్రీ చదువుతున్నా. మధ్యలో ఆపెయ్యొద్దంటూ మా తమ్ముళ్లు రాము, హరి ఎంతో ప్రోత్సహించారు. నాన్న చేసే వ్యవసాయం.. చిన్నపాటి వ్యాపారాలను వారే చూసుకుంటున్నారు.  

ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్‌తో టచ్‌ 
చిన్ననాటి బాలస్నేహితులు లక్ష్మణ్‌రావు, రమేశ్, వాసు, వెంకటరాజు, శ్రీనివాస్, సత్యనారాయణ ఉన్నారు. ప్రస్తుతం వారు వివిధ రంగాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. వారితోపాటు బాల్యదశ నుంచి ఎంబీఏ వరకు చదివిన తోటి ఫ్రెండ్స్‌ అంతా ఫేస్‌బుక్‌లో టచ్‌లో ఉన్నారు. నేను కలెక్టర్‌ను అయ్యానని తెలిసి ఫ్రెండ్స్‌ నా ఫొటోను అందులో పెడుతూ అభినందించారు.

ప్రజాసేవకు జీవితం అంకితం
ఉద్యోగంలో ఉన్నా...పదవీ విరమణ పొందిన నా జీవితమంతా ప్రజాసేవకే అంకితం. 1989లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టి.. నేడు కలెక్టర్‌గా కొనసాగుతూ భవిష్యతులో మరో అడుగువేస్తే అడిషనల్‌ సెక్రటరీ వరకు వెళ్లొచ్చు. 2025లో పదవీ విరమణ ఉంది. అందరితో కలిసిమెలిసి ఉండాలంటే నాకెంతో ఇష్టం. ఐఏఎస్‌ను అయ్యాననే భావన నాలో లేదు. కిందిస్థాయి నుంచి వచ్చాను. నాకు ప్రజలతో అనుబంధం ఎక్కువ. వారికి కష్టం వచ్చినప్పుడు అండగా నిలవడం ఆయా సమస్యలకు పరిష్కార మార్గం చూపడంలోనే సంతృప్తినిస్తుంది. జీవితంలో ఆత్మతృప్తిని మించింది మరొకటి ఏముంటుంది.

‘ఆయన’ మా మేనమామ 
మా ఆయన నాకు వరుసకు మేనమామ. చిన్నప్పు డు ఆయన చదివిన స్కూళ్లోనే నేను చదివా. మా ఇద్దరిదీ ఒకటే ఊరు. మా చిన్న తాత పెద్దకొడుకు. వ్యక్తిగత జీవితం కంటే ఉద్యోగ నిర్వహణలో ప్రజాజీవితమే ముఖ్యం. చిన్నప్పటి నుంచి మామ మనస్సు నాకు తెలుసు. డీటీ నుంచి కలెక్టర్‌గా అయ్యారంటే చాలా ఆనందంగా ఉంది. 30ఏళ్లుగా ఉద్యోగిగా ఆయన గృహిణిగా నేను పిల్లలతో కలిసి చాలా సంతోషంగా ఉన్నాం. కాస్తా సమయం దొరికిందంటే చాలు మాతో చాలా ఆనందంగా కాలన్ని గడుపుతారు. ఎంత పని ఉన్నా తమను సినిమాలకు తీసుకెళ్లి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ చేస్తారు. మొక్కలు పెంచడమంటే చాలా ఇష్టం. ఇంటి ఆవరణలో సైతం మొక్కలు నాటి పెంచుతుంటాను. పూల మొక్కలనే ఎక్కువగా పెంచాను. – రాజేశ్వరి, కలెక్టర్‌ సతీమణి   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement