
'ఉత్తమ్‌కుమార్ రెడ్డికి సహకరించను'
టీపీసీసీ అధ్యక్షునిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డిని నియమించి రెండోసారి అధిష్టానం తప్పు చేసిందని మాజీమంత్రి నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షునిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డిని నియమించి రెండోసారి అధిష్టానం తప్పు చేసిందని మాజీమంత్రి నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఈ సంక్షోభ సమయంలో అందరినీ కలుపుకోగలిగే సమర్థవంతమైన నాయకుని కోసం అన్వేషించకుండా ఉత్తమ్ నియామకంపై అధిష్టానం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందన్నారు.
పార్టీ కార్యక్రమాల్లో ఉత్తమ్‌కుమార్ రెడ్డికి సహకరించబోనన్నారు. ముందుగా సీనియర్లతో చర్చించి ఉంటే ఇలాం టి తప్పుడు నిర్ణయం రెండోసారి జరిగేది కాదన్నారు. గత ఎన్నికల్లో పొన్నాలను నియమించి మొదటి తప్పు, ఈసారి ఉత్తమ్‌ను నియమించి రెండోసారి తప్పు చేసిందన్నారు. నల్లగొండ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు పైగా బత్తాయితోటలు నీరులేక ఎండిపోతున్నాయన్నారు. నీటి విడుదలకోసం మంత్రి హరీష్‌రావును కలిసినట్టుగా కోమటిరెడ్డి వెల్లడించారు.