సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాకు కేబినెట్‌లో పెద్ద పీట వేశారు. గురువారం కొలువుదీరిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేబినెట్‌లోకి ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్ నాయకులైన నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని తీసుకున్నారు. రేవంత్‌రెడ్డితో పాటు వారిద్దరూ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. త్వరలోనే వారికి ప్రభుత్వం శాఖలను కేటాయించనుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంలో నల్లగొండ జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. ఇప్పుడు 14 ఏళ్ల తరువాత ఇద్దరు అమాత్యులయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో కుందూరు జానారెడ్డి హోంమంత్రిగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు బీఆర్‌ఎస్ పార్టీ అధికారం చేపట్టింది.
ఆ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాకు ఒకే మంత్రి పదవి లభించింది. గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఒక్కరే రెండు ప్రభుత్వాల్లోనూ విద్యాశాఖ, విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో మళ్లీ జిల్లాకు పెద్దపీట వేశారు. సీనియర్ నేతలు ఇద్దరికి ప్రస్తుత కేబినెట్‌లో మంత్రులుగా అవకాశం దక్కింది.
త్యాగానికి దక్కిన గౌరవం
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో, యువత ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న తరుణంలో మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ‘బలిదానాలు చేసుకోవద్దు అవసరమైతే మా పదవులను త్యాగం చేసి ప్రభుత్వంపై పోరాడుతాం’ అని విద్యార్థుల్లో ధైర్యం నింపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకతను పలుమార్లు కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి, సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు.
ఆంధ్ర నేతలు అడ్డుపడుతూ తెలంగాణ ప్రక్రియను ముందుకుసాగనివ్వని పరిస్థితుల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అదే సమయంలో నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్‌లో 9 రోజులు నిరాహార దీక్ష చేశారు. ఆ తరువాత కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక తెలంగాణను ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు బీఆర్‌ఎస్ పార్టీ అధికారం చేపట్టింది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆనాడు తెలంగాణ కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మళ్లీ మంత్రి పదవి లభించింది. తెలంగాణ ఉద్యమమే కాదు.. 1999లో మొదటిసారి నల్లగొండ ఎమ్మెల్యేగా గెలుపొందినప్పుడు నల్లగొండ పట్టణానికి ఫ్లోరైడ్ రహిత నీరు అందించాలని 11 రోజులు నిరాహార దీక్ష చేశారు.
ఆ తరువాత ప్రభుత్వం కృష్ణా జలాల సరఫరా ప్రక్రియను ప్రారంభించింది. పానగల్ ఉదయ సముద్రం నుంచి నల్లగొండ పట్టణానికి తాగునీరు అందించే ప్రాజెక్టు మంజూరైంది. 2005లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని ఒప్పించి ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గాన్ని మంజూరు చేయించారు.
సేవకు గుర్తింపు
ఎయిర్ ఫోర్స్‌లో ఫ్రంట్‌లైన్ ఫైటర్ స్క్వాడ్రన్ వింగ్‌లో మిగ్–21, మిగ్–23 విమానాలను నడిపిన కెప్టెన్ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అనేక సంవత్సరాలు దేశానికి సేవలందించారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రతిష్టాత్మకమైన కంట్రోల్ ఆఫ్ సెక్యూరిటీ, ప్రొటోకాల్, అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగం చేశారు. 1994లో ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఆ తరువాత ఎమ్మెల్యేగా ఐదుసార్లు గెలిచారు. ఇప్పుడు ఆరోసారి విజయం సాధించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎక్స్‌సర్వీస్‌మెన్ సెల్ చైర్మన్‌గా, మాజీ సైనికుల పునరావాస కమిటీ సభ్యుడిగా సేవలందించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమస్యపై కేంద్ర హోంమంత్రి నిర్వహించిన అఖిలపక్ష సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించారు.
2019లో నల్లగొండ ఎంపీగా గెలుపొందారు. ఆయనతోపాటు ఆయన సతీమణి పద్మావతిరెడ్డి కూడా ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అందించిన సేవలకు ఫలితం దక్కింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసిన ఉత్తమ్‌ను మరోసారి మంత్రి పదవి వరించింది.
Comments
Please login to add a commentAdd a comment