రైతులు బాధల్లో ఉంటే.. అధికారుల‘బతుకమ్మ’లా..
హైదరాబాద్: ప్రజలచే పం డుగ చేయించాల్సింది పోయి అధికారులతో బతుకమ్మలు ఆడిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీరు విడ్డూరంగా ఉందని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో రైతులు సాయమందక అవస్థలు పడుతున్నారనీ, వ్యవసాయానికి కనీసం మూడుగంటల పాటు విద్యుత్తు కూడా అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. నాగం శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వమే బతుకమ్మ పండుగ చేసుకోవడమేమిటని ప్రశ్నించారు. రూ.4,250 కోట్ల రుణ మాఫీ అన్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రైతు బ్యాంక్ ఖాతాలో కూడా డబ్బు జమచేయలేదన్నారు. సెప్టెంబర్ 13 కల్లా ఖరీఫ్ ముగిసినప్పటికీ రుణమాఫీ డబ్బులు జమకాక రైతులు కలవర పడుతున్నారన్నారు. ఉద్యోగులంద రూ బతుకమ్మ ఆడుతుంటే రైతుల బతుకులు పట్టించుకునే వారెవరని నిలదీశారు.
బతుకమ్మ గురించి టీఆర్‌ఎస్ ప్రజలకు నేర్పించాల్సిన అవసరం లేదని ఇది సంప్రదాయ పండుగేనన్నారు. వెంటనే రుణమాఫీతోపాటు, ఇన్‌పుట్‌సబ్సిడీ వర్తించేలా చూడాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు తెలంగాణాలో కరెంట్‌కోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదన్నారు. కేసీఆర్ అరచేతిలో కైలాసాన్ని చూపిస్తూ ప్రజల తలపై శఠగోపాన్ని పెడుతున్నారన్నారు.