హే కృష్ణయ్యా...
తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ఆర్.కృష్ణయ్యే సీఎం!... ఏడాది కిందట ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన ఈ మాటలతో 40 ఏళ్ల బీసీ ఉద్యమాన్ని పక్కనబెట్టి తెలుగుదేశంలో చేరిండు కృష్ణయ్య. ఎల్.బి.నగర్ నుంచి పోటీ కూడా చేసి గెలిచిన ఆయనకు ఎన్నికల తరువాత జ్ఞానం బోధపడింది. ‘సీఎం క్యాండిడేట్‌ను కదా! 15 సీట్లు గెలుచుకున్న పార్టీకి టీడీఎల్‌పీ లీడర్‌ను నేనే అవుతా’ అనుకున్నాడాయన. అయితే సీను మారిపోయింది. కృష్ణయ్య అసెంబ్లీకి కొత్త. తెలంగాణలో పార్టీ బలపడాలంటే సీనియర్ ఎర్రబెల్లి దయాకర్ రావు బెస్ట్ అనుకున్నడు బాబు. సీఎం క్యాండెట్‌కు లేని అనుభవం శాసనసభలో లీడర్ కావాలంటే అవసరమా అని మధనపడ్డాడు కృష్ణయ్య. పక్కనబెట్టిన బీసీ ఉద్యమ కాడిని మళ్లీ భుజాన వేసుకున్నాడు.
పార్టీకి , ఎమ్మెల్యే పదవికి రాంరాం చెప్పాలనుకున్నాడు. కానీ హోదా, గన్‌మెన్‌లు, అలవెన్సులు... వదులుకోవడం ఎందుక నుకున్నాడో లేక చంద్రబాబు వద్దన్నాడో తెలియదు గానీ... పార్టీలనే ఉన్నడు. అయితే పార్టీ మీటింగ్‌లకు రానని తెగేసి చెప్పిండు. నేను ఎమ్మెల్యేగా ఉంట. పార్టీ కార్యక్రమాల కోసం ఇన్‌చార్జిని పెట్టుకోమని బాబుకు చెప్పిండు. ఎల్‌బీ నగర్‌కు పార్టీ ఇన్‌చార్జిగా వేరే నాయకుని పేరు కృష్ణయ్యే చెప్పిండు. మొన్న ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలిసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ ‘చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లపై తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, బాబు బీసీలను మోసం చేస్తున్నారు’ అని ప్రకటించిండు. స్వచ్ఛ హైదరాబాద్ అని సీఎం కేసీఆర్ అంటే ... హైదరాబాద్ కోసం సీఎం బాగా పనిచేస్తున్నడు అని కూడా అనౌన్స్ చేసిండు. టీడీపీ ఎమ్మెల్యేవు కదా... అని అంటే... బీసీలే నాకు ముఖ్యం. పార్టీ, ఎమ్మెల్యే పదవులు కాదు అని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇస్తున్నడు. అసలే గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు టీఆర్‌ఎస్‌ల చేరుతుంటే ఈ కృష్ణయ్య గొడవేంది ‘బాబూ’ అని తెలంగాణ టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నరు.