
ముత్తంగి, చిట్కుల్ పరిధిలో వివాదాస్పద అసైన్డ్ భూమిలో వెలసిన ఇళ్లు
సాక్షి, పటాన్‌చెరు: నియోజకవర్గంలో భూముల విలువ అమాంతంగా పెరిగిపోతుంది. దీంతో అక్రమార్కుల కన్ను అసైన్డ్ భూములపై పడింది. అధికారుల నిర్లక్ష్యంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. పటాన్‌చెరుమండలం పరిధిలోని చిట్కుల్, ముత్తంగి గ్రామాల శివారులోని అసైన్డ్ భూములను దర్జాగా కబ్జా చేసినా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు. రెండు గ్రామాల శివారులో ఉండటం మూలంగా కబ్జాదారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ముత్తంగి పరిధిలోని సర్వేనెంబర్ 540లో ఉన్న అసైన్డ్ భూమిని చిట్కుల్ పరిధిలోని ఓ వెంచర్‌లో కలుపుకొని దస్తావేజులను సృష్టించారు. ఇక ఆ దస్తావేజులతో ముత్తంగి పంచాయతీ నుంచి ఇంటి నెంబర్లు తీసుకుని రెండెకరాల భూమిని దర్జాగా కబ్జా చేశారు. ఆ భూముల క్రయవిక్రయాలు నిర్వహిస్తున్నారు.
దాదాపు ఆ స్థలం విలువ రూ.12 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ భూమిని కాపాడాలని ముత్తంగిలోని స్థానికులు కొందరు రెవెన్యూ, పంచాయతీ అధికారులను కోరినా ఫలితం లేకుండా పోయింది. ఇటీవలె ముత్తంగిలో నిర్వహించిన ఓ గ్రామ సభలో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. స్థానిక కార్యదర్శిని ప్రజలు నిలదీశారు. పట్టా భూములకే ఇంటి నిర్మాణాలకు అనుమతులు దొరకడం లేదని కాని అసైన్డ్ భూమికి ఇంటినెంబర్లు ఎలా వచ్చాయంటూ వారు నిలదీశారు. అయితే స్థానిక కార్యదర్శి మాత్రం తనకే సంబంధం లేదని చేతులెత్తేశారు. వాస్తవానికి గ్రామ హద్దురాళ్లు ఇతర ఆనవాళ్లను బట్టి ఆ భూమి ముత్తంగిదేనని స్థానిక గ్రామ పెద్దలు స్పష్టం చేస్తున్నారు. కానీ ఆ అసైన్డ్ భూమిని కబ్జా చేసిన వ్యక్తులు చిట్కుల్ నుంచి అనుమతులు పొందారని అధికారులు చెప్తున్నారు.
అధికారులు కూడా తమ ప్రైవేటు సంభాషణల్లో అసైన్డ్ భూమి అన్యాక్రాంతం అయ్యిందని ఒప్పుకుంటున్నారు. అయితే ఓ వెంచర్ నిర్వాహకులు ఆ భూమిని తమ పరిధిలోకి చేర్చుకొని దానికి ఇంటి నెంబర్ పొందారని చెప్తున్నారు. సర్వే నెంబర్ 540లో దుంపల్లి విఠలయ్య, పిచ్చకుంట్ల లక్ష్మయ్యకు దాదాపు రెండు ఎకరాల విస్తీర్ణం అసైన్డ్ భూములు ఉన్నాయి. దుంపల్లి విఠలయ్య మృతి చెందారు. ఆయన సతీమణి సుగుణమ్మ పేరు మీద నేటికీ పాస్‌బుక్‌లు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
రెండు గ్రామాల పరిధిలోని అసైన్డ్ భూమి ఉందనే అంశంపై సర్వే చేయించి తగిన చర్యలు తీసుకుంటాం. అసైన్డ్ భూములను అమ్ముకోవడం, కొనడం నేరం. పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకుంటాం.
– యాదగిరిరెడ్డి, తహసీల్దార్,పటాన్‌చెరు
ఇంటి నంబర్లు ఇవ్వలేదు
అసైన్డ్ భూమి ఏ గ్రామ పరిధిలో ఉందనేది తేల్చాల్సి ఉంది. ఆ భూమిలోని ఇళ్లకు ఈ పంచాయతీ నుంచి ఇంటి నంబర్ ఇవ్వలేదు. రెవెన్యూ అధికారులు ఆ భూమి ఏ పంచాయతీ పరిధిలోకి వస్తుందో తేల్చితే తప్ప చర్యలు తీసుకోలేం.
– కిషోర్, గ్రామ కార్యదర్శి, ముత్తంగి
అలాంటిది మా దృష్టికి రాలేదు
మా దృష్టికి అలాంటి అంశం రాలేదు. వివరాలు తెలుకొని చర్యలు తీసుకుంటాం. నా హయాంలో ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదు. గతంలో జరిగి ఉంటుందని భావిస్తున్నాం.
–సంజయ్, కార్యదర్శి చిట్కుల్
Comments
Please login to add a commentAdd a comment