అధ్యక్షా ఇదేం పని..?
► ఇసుక రవాణాలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు
► అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన ట్రాక్టర్
► తహశీల్దార్ కార్యాలయం నుంచి ఇంజిన్ మాయం
సిరిసిల్ల రూరల్ : కంచె చేను మేసిన చందంగా మారింది సిరిసిల్ల టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అంకారపు రవీందర్ తీరు. ఇసుకను అక్రమంగా రవాణా చేయడమే కాకుండా.. పట్టుబడిన తన ట్రాక్టర్‌ను విడిచిపెట్టాలని అధికారులపైనే జులుం ప్రదర్శించారు. సిరిసిల్ల ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాలో టీఆర్‌ఎస్ నాయకుల హస్తం ఉండడం, పార్టీకి చెడ్డపేరు రావడంతో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ నష్టనివారణ చర్యలు చేపట్టారు. మానేరు వాగు నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక తరలిపోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏ పార్టీ వారైనా వదిలిపెట్టొద్దని హెచ్చరించారు.
ఇందులో భాగంగా సోమవారం వేకువజామున ఆర్డీవో భిక్షానాయక్ వాగు వద్దకు వెళ్లారు. ఈయనను గమనించిన మూడు ట్రాక్టర్ల డ్రైవర్లు వాహనాలతో పారిపోయూరు. మరో ట్రాక్టర్ పట్టుబడింది. దీనిపై ఆరా తీయగా.. అది టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు, తంగళ్లిపల్లి మాజీ సర్పంచ్ అంకారపు రవీందర్‌గా తేలింది. ట్రాక్టర్‌ను ఆర్డీవో రెవెన్యూ కార్యాలయూనికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పది మంది ఇసుక స్మగ్లర్లు ఆర్డీవో వాహనాన్ని వెంబడించారు. కంగుతిన్న ఆర్డీవో విషయూన్ని పోలీసులకు సమాచారం అందించానని, తనను అడ్డుకుంటే క్రిమినల్ కేసులు పెడతానని హెచ్చరించడంతో వారు పారిపోయూరని సమాచారం.
ట్రాక్టర్ విడిపించేందుకు యత్నాలు
అధికార పార్టీ నేతదే ట్రాక్టర్ పట్టుబడటంతో పార్టీ పరువు పోతుందని భావించిన నాయకులు వాహనాన్ని విడిపించేందుకు పావులు కదుపుతున్నట్ల తెలిసింది. ట్రాక్టర్‌ను వదిలేయాలని ఓ నేత ఆర్డీవోపై ఒత్తిడి తెచ్చారని, దీనికి ఆయన ససేమిరా అన్నారని సమాచారం. మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే అక్రమ ఇసుక రవాణాపై దాడులు నిర్వహిస్తున్నామని కరాఖండిగా చెప్పడంతో అధికార పార్టీ నాయకులు ఆర్డీవోపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం.
ఇంజిన్ మాయం..
ఇసుక అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన అధికార పార్టీ మండల అధ్యక్షుడి ట్రాక్టర్‌ను తహసీల్దార్ కార్యాలయూనికి తరలించగా.. అక్కడినుంచి ఇంజిన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్లారు. ఈ విషయమై తహసీల్దార్ మధును వివరణ కోరగా.. తనకు తెలియదనడం అనుమానాలకు తావిస్తోంది.
చర్యలు తీసుకుంటాం
ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకుని తహసీల్దార్ కార్యాలయూనికి పంపించామని, ఆ వాహనం ఎవరిదో తెలియదని ఆర్డీవో భిక్షానాయక్ తెలిపారు. ఇంజిన్ లేదన్న విషయం తన దృష్టికి రాలేదన్నారు. ఇసుక రవాణా చేస్తే ఎవరినీ వదలబోమన్నారు.
నేనేమైనా దొంగతనం చేశానా..
‘నేనేమైనా దొంగతనం చేశానా..? తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న ట్రాక్టర్‌ను ఫొటో ఎందుకు తీశావ్..? సీసీ రోడ్డు నిర్మాణానికి ఇసుక అవసరమైతే తరలిస్తున్న. డంప్ చేసి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు కాదు. దీనిని మీడియూలో రానీయొద్దు..’ అంటూ అంకారపు రవీందర్ ‘సాక్షి’కి ఫోన్‌చేయడం గమనార్హం. ఇసుక అక్రమ రవాణాకాకుంటే అధికారులెందుకు పట్టుకుంటారో..?