సిద్దిపేట అర్బన్/ టౌన్: బియ్యం జిల్లా సరిహద్దు దాటాలంటే మార్కెట్ ఫీజు, వ్యాట్, సేల్ ట్యాక్స్ చెల్లించాలి. అలాగే బియ్యాన్ని విక్రయించాలన్నా అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలి. అందుకోసం తగిన రుసుము ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. కానీ రోజుకు 3,500 క్వింటాళ్ల వ్యాపారం జరిగే సిద్దిపేటలో మాత్రం ఇవేమీ అవసరం లేదు. అధికారులను మంచి చేసుకుంటే చాలు జీరో దందా జోరుగా సాగించుకోవచ్చు. తనిఖీల భయముండదు. చలాన్ల గొడవ అసలే ఉండదు.
మెరిపించి మెప్పిస్తారు
జిల్లాలోని సిద్దిపేట, మెదక్ తదితర ప్రాంతాల్లో ఆధునిక రైస్‌మిల్లులు లేవు. అందువల్ల ఇక్కడ దొరికే బియ్యం చూడడానికి మామూలుగా కనిపిస్తాయి. దీంతో వ్యాపారులు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ తదితర ప్రాంతాల్లో ఆధునిక రైస్ మిల్లుల్లో మర ఆడించి నాసిరకం ధాన్యాన్ని కూడా మెరిసే బియ్యంగా మార్చేస్తున్నారు. అక్కడి నుంచి బియ్యాన్ని అక్రమంగా సిద్దిపేట డివిజన్‌కు సరఫరా చేస్తున్నారు.
ప్రతి రోజు 30 లారీల బియ్యం రవాణా
నల్లగొండ జిల్లా నుంచి బియ్యం మెదక్ జిల్లాలోకి ప్రవేశించాలంటే బియ్యం విలువలో ఒకశాతం మార్కెట్ ఫీజును, ఆరు శాతం వ్యాట్, సేల్స్ ట్యాక్స్‌ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని సివిల్ సప్లయ్, మార్కెటింగ్ శాఖ, వాణిజ్య పన్నుల శాఖ నియంత్రించాల్సి ఉంటుంది. అయితే ఈ మూడు శాఖలు అధికారులు తగిన ప్రతిఫలం అందుకుని ఈ వ్యవహారాన్ని చూసి చూడనట్లు వదిలేస్తున్నాయి. దీంతో ఇతర జిల్లాల వ్యాపారులు బియ్యం లారీలను లోడింగ్ చేసి అర్ధరాత్రి వరకు సిద్దిపేట సమీపంలోని పొన్నాల దాబా తదితర ప్రాంతాల వద్దకు పంపిస్తారు. తెల్లవారు జామున ఈ బియ్యం లారీలు సిద్దిపేటలోనే పలు బియ్యం దుకాణాల వద్దకు చేరుకోవడం, వేగంగా దిగుమతి కావడం కొన్ని గంటల్లో గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతున్నాయి.
సర్కార్ ఖజానాకు గండి
సిద్దిపేట మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల కూడలి కావడంతో సుమారు 60 గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడనే బియ్యంను ఖరీదు చేస్తారు. ప్రతి రోజు 30 నుంచి 35 లారీల బియ్యం (3 వేల నుంచి 3,500 క్వింటాళ్ల) ఇక్కడ అమ్మకాలు సాగుతాయి. ఈ క్రమంలో సగటున ప్రతి రోజు 3 వేల క్వింటాళ్ల బియ్యం సిద్దిపేటకు అక్రమంగా దిగుమతి అవుతోంది. ఈ బియ్యం ఆకర్షణీయంగా ఉండడంతో మార్కెట్లో డిమాండ్ కూడా పెరుగుతోంది. దీంతో స్థానిక వ్యాపారులు, ఇతర జిల్లాల వ్యాపారులు ఒక పథకం ప్రకారం ఈ బియ్యం అక్రమ వ్యవహారాన్ని రహస్యంగా కొనసాగిస్తూ లక్షల రూపాయల్లో ఖజానాకు గండికొట్టేస్తున్నారు. ఈ బియ్యం ధర క్వింటాల్‌కు రూ. 3,500 నుంచి రూ. 4 వేల వరకు పలుకుతుంది. నెలకు సుమారు రూ. 32 కోట్ల విలువైన బియ్యం సిద్దిపేట ప్రాంతంలో అక్రమంగా దిగుమతి కావడంతో ఖజానాకు చేరాల్సిన సొమ్ము పక్కదారిపడుతోంది.
అనుమతులు లేకుండానే విక్రయాలు
మామూలుగా బియ్యం విక్రయించాలంటే దుకాణానికి అనుమతులు తప్పనిసరి. ఇందుకు చలానా రూపంలో సేల్‌ట్యాక్స్‌ను సంబంధిత శాఖకు చెల్లించాలి. ప్రతి సంవత్సరం దుకాణాల రెన్యూవల్ కోసం కొంత డబ్బు చెల్లించాలి. నెలకు 20 క్వింటాళ్ల నుంచి 50 క్వింటాళ్ల వరకు విక్రయించే రైస్ డిపోల నిర్వాహకులు తహశీల్దార్, 50 క్వింటాళ్లకు పైగా విక్రయించే దుకాణదారులు డీఎస్‌ఓ అధికారుల నుంచి అనుమతి పొందాలి. కానీ సిద్దిపేటలో మాత్రం ఇవేమీ అమలు కావడం లేదు. అధికారులను మంచి చేసుకుంటున్న వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా బియ్యాన్ని విక్రయిస్తున్నారు. ఎవరైనా , ఎప్పుడైనా తనిఖీల కొస్తే మాత్రం వ్యాపారులు 20 క్వింటాళ్లలోపే బియ్యం నిల్వలు చూపుతూ యథేచ్ఛగా విక్రయాలు కొనసాగిస్తున్నారు.
సిద్దిపేట పట్టణంలో వందల సంఖ్యలో రైస్ దుకాణాలు ఉన్నప్పటికీ అధికారుల లెక్కల ప్రకారం తహశీల్దార్ కార్యాలయం నుంచి అనుమతి పొందినవి 30. జిల్లా సివిల్ సప్లయ్ అధికారి నుంచి అనుమతి పొందినవి 4 మాత్రమే ఉండడం గమనార్హం. మిగతా దుకాణదారులంతా బియ్యాన్ని మరోచోట నిల్వ ఉంచి దుకాణాల్లో మాత్రం కేవలం 20 క్వింటాళ్ల కంటే తక్కువే చూపుతున్నారు. నాసిరకం బియ్యాన్ని సైతం రంగురంగుల బ్యాగుల్లో నింపి అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని వినియోగదారులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
సిద్దిపేటలో జోరుగా సాగుతున్న బియ్యం అక్రమ వ్యాపారం
Published Tue, Oct 28 2014 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 3:30 PM
Advertisement
Advertisement