- లారీ ఢీకొని ఒకరి మృతి
- డీసీఎంను ఢీకొన్న ఆటో: ఐదుగురికి గాయాలు
- ఆటో బోల్తా: ఇద్దరికి తీవ్రగాయాలు
- వేర్వేరు ఘటనలో గాయపడ్డ మరో తొమ్మిది మంది
అఫ్జల్‌గంజ్: గణేశ్ నిమజ్జనోత్సవంలో అపశ్రుతి. బొజ్జగణపయ్యను తరలిస్తున్న క్రమంలో నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా... 16 మంది గాయపడ్డారు. క్షతగాత్రులు నాంపల్లిలోని కేర్, ఉస్మానియా ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు.
జెండా రాడ్ ఊడిపడి...
దత్తాత్రేయనగర్ : వినాయకుడిని నిమజ్జనానికి తరలిం చేందుకు భారీ లారీని మండపం వద్దకు తీసుకొస్తుం డగా జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. టప్పాచబుత్ర పోలీసుల కథనం ప్రకారం...జాఫర్‌గూడ న్యూ సత్యనారాయణనగర్‌లో కొంతమంది యువకులు గణేశుడిని ప్రతిష్టించారు. ఆదివారం అర్ధరాత్రి వినాయకుడిని తరలించేందుకు భారీ లారీ (టస్కర్)ని సత్యనారాయణనగర్‌కు తీసుకొచ్చారు. లారీని రివర్స్ తీసుకుంటుండగా డ్రైవర్‌కు సైడ్ కనిపించక లారీ అక్కడే ఉన్న జెండా దిమ్మెను ఢీకొట్టింది. దీంతో జెండా దిమ్మెకు ఉన్న ఐరన్ రాడ్ ఊడిపోయి పక్కనే నిలబడి ఉన్న శ్రీకాంత్(30) అనే మెకానిక్‌పై పడింది. తీవ్రగాయాలకు గురైన శ్రీకాంత్‌ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు.
డీసీఎంను ఢీకొట్టిన ఆటో...
నిమజ్జనం సందర్భంగా ఖైరతాబాద్ గణనాథుడిపై హెలికాప్టర్ నుంచి పూలవర్షం కురిపిస్తారన్న ప్రచారం తో ఆ దృశ్యాలను తిలకించేందుకు రాయదుర్గంలోని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆటోలో బయలుదేరారు. ఆటో మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద అదుపు తప్పి ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టింది. ఈ ఘ టనలో సావిత్రి (40), రాయుడు అలియాస్ చిన్నా (35), ప్రసాద్(30), నగేష్(20), గణేష్(26) తీవ్రగాయాలకు గురయ్యారు. వీరందరినీ ఉస్మానియాకు తరలించారు. కాగా, వీరిలో సావిత్రి, ప్రసాద్, గణేష్‌లకు త గిలిన గాయాల తీవ్రత అధికంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఎంజె మార్కెట్ వ ద్ద ఆటో బోల్తా...
అఫ్జల్‌గంజ్‌కు చెందిన కొందరు బాలురు గణేశుడిని ట్రాలీ ఆటోలో నిమజ్జనానికి తరలిస్తుండగా ఎంజె మార్కెట్ చౌరస్తా వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఆటోలో 15 మంది ఉండగా వీరిలో రవీందర్ (11), మహిపాల్ (13)లకు తీవ్రగాయాలయ్యాయి. మిగతా వారికి స్పల్పగాయాలయ్యాయి. వీరిని నాంపల్లి కేర్ ఆసుపత్రికి తరలించారు. రవీందర్, మహిపాల్ కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.
నిమజ్జనం కోసం గణనాథుడిని వాహనంలో ఎక్కిస్తుండగా గోషామహల్‌కు చెందిన సాయి (25) ఎడమ చూపుడు వేలు తెగిపోయింది.
వినాయకుడిని వాహనంలో తరలిస్తుండగా జె.కృష్ణ(40), వై.నవీన్(16) అదుపు తప్పి పడిపోయారు. తలకు తీవ్రగాయాలైన వీరిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.
తోపులాటలో బాలికకు, యువతికి గాయాలు
గణేశ్ నిమజ్జనాన్ని తిలకించేందుకు వెళ్లిన ముగ్గురు బాలికలు, ఒక యువతి తోపులాటలో కిందపడి గాయపడ్డారు. వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు జరిగాయి. గాయపడ్డ బాలికలు అనుష్క(12), రిషిద(14), అని త(9), బబిత(18) ఉస్మానియాలో చికిత్సపొందుతు న్నారు. ఇదిలా ఉండగా.. జియాగూడకు చెందిన సోను (28) సోమవారం రాత్రి గణనాథుడిని తరలిస్తుం డగా.. బేగంబజార్‌లో అడ్డొచ్చిన విద్యుత్ తీగలను తప్పించేం దుకు వాహనం ఎక్కి ప్రమాదవశాత్తు కిందపడి గాయపడ్డాడు. ఇతడిని ఉస్మానియాకు తరలించారు. ఇదే విధంగా జరిగిన మరో ప్రమాదంలో వేణు (30) గాయపడ్డాడు. ఉస్మానియాలో చికిత్సపొందాడు.