మిషన్ భగీర థ పనుల్లో అపశ్రుతి
♦ పైపులు మీద పడి ఒకరు మృతి
♦ మరొకరికి తప్పిన ప్రమాదం
రేగోడ్: మిషన్ భగీరథ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. లారీలో నుంచి పైపులు కిందకు దింపుతున్నారు. ఈ క్రమంలో పైపులతోపాటు ఇద్దరు కూలీలు కిందపడ్డారు. ఒక కూలీ మీద పైపులు పడడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆగ్రహించిన గ్రామస్తులు రోడ్డుకు అడ్డంగా పైపులు పెట్టి ఆందోళన చేశారు. ఈ సంఘటన మండలంలోని టి.లింగంపల్లి గ్రామ సమీపంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రభుత్వం చేపడుతున్న వాటర్ గ్రిడ్ (మిషన్ భగీరథ) పనులు మండలంలోని టి.లింగంపల్లి గ్రామం మీదుగా జరుగుతున్నాయి. తీసిన కాలువల్లో పైపులు వేయడానికి మంగళవారం లారీలో పైపులు తెచ్చారు. లారీలో నుంచి కిందకు పైపులు దించుతుండగా అవి జారి కిందపడిపోయాయి.
పైపులతోపాటే ఖాదిరాబాద్ గ్రామానికి చెందిన వట్‌పల్లి సుభాష్ (20), శ్రీనివాస్‌లు సైతం పక్క చేలో కింద పడ్డారు. సుభాష్ మీద పైపులు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాస్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబీకులు, ఖాదిరాబాద్ గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం వద్ద కుటుంబీకులు బోరున విలపించారు. ఆగ్రహించిన ఖాదిరాబాద్ గ్రామస్తులు రోడ్డుకు అడ్డంగా పైపులు పెట్టి ఆందోళన చేపట్టారు. సుభాష్ కుటుంబానికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ మమత, మాజీ ఎంపీపీ పత్రివిఠల్, టీఆర్‌ఎస్ రైతు విభాగం మండల అధ్యక్షుడు ధర్మారెడ్డి, నితిన్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి తదితరులు ఘటనా స్థలికి చేరుకొని సుభాష్ కుటుంబీకులను పరామర్శించారు. స్థానిక ఎస్‌ఐ రాచకొండ రవీందర్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన వివరాలను తెలుసుకున్నారు. మృతుడి తండ్రి కిష్టమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.