
నెలరోజుల్లో ఇరిగేషన్ పాలసీ
- సీఎం ప్రకటిస్తారన్న భారీ నీటిపారుదల మంత్రి హరీష్‌రావు
- ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తాం.. రాష్ట్రం వైపు పారిశ్రామికవేత్తల చూపు
- 24 గంటలు విద్యుత్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే..
- రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి తన్నీరు హరీష్‌రావు
సత్తుపల్లి/ వేంసూరు:‘తెలంగాణలో విద్యుత్ లేకుం డా చేస్తే పంటలు ఎండిపోయి ప్రజలు ఇబ్బందులు పడతారనే కుట్రతో అర్ధరాత్రి అడ్డగోలుగా చంద్రబాబు తొమ్మిది మండలాలను ఆంధ్రాలో కలుపుకున్నారు. లోయర్ సిలేరును తెలంగాణకు కాకుండా చేసి.. ఇప్పుడు విభజనపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారు’ అని భారీ నీటి పారుదల శాఖామంత్రి తన్నీరు హరీష్‌రావు మండిపడ్డారు. బేతుపల్లి ప్రత్యామ్నాయ వరద కాలువకు బుధవారం రాత్రి నీరు విడుదల చేశారు. అనంతరం వేంసూరులో జరిగిన బహిరంగసభలో మాట్లాడారు.
చంద్రబాబునాయుడు లోయర్ సిలేరు ప్రాజెక్టు లేకుండా చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చారన్నారు. కేసీఆర్ పారిశ్రామిక పాలసీ ప్రకటించిన తరువాత పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి పరుగులు తీయటం బాబుకు మింగుడు పడటం లేదన్నారు. జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో జిల్లాకు ఇరిగేషన్ పాలసీని ముఖ్యమంత్రి కేసీఆర్ నెలరోజుల్లో ప్రకటిస్తారని తెలిపారు. దుమ్ముగూడెం వద్ద బ్యారెజ్ కట్టలేదు కానీ.. మోటార్లు తెప్పించి బిల్లులు మింగేశారని ఆరోపించారు.
జరిగిన ఖర్చు వృథాకాకుండా రిటైర్డ్ ఇంజనీర్లతో రీ-డిజైన్ చేయించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారన్నారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు లిఫ్ట్ సంఖ్యను తగ్గిస్తూ త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. మొదటి దశలో చెరువులన్నీ మిషన్ కాకతీయలో బాగు చేసుకుంటున్నామని.. మీడియం ఇరిగేషన్లను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా ముందుకు వెళ్తున్నామన్నారు. పత్రి మండల కేంద్రంలో గౌడౌన్ ఏర్పాటు కోసం రూ.85 కోట్లు మంజూరు చేశామన్నారు.
ఉక్కుఫ్యాక్టరీ నిర్మిస్తాం..
ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంపై కేంద్రప్రభుత్వంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి తెస్తున్నామని మంత్రి అన్నారు. జీ-4 దశలో ఐరన్ ఓర్ ఉందన్నారు. ఎక్స్‌ఫ్లోరేషన్ చేసి జీ-4 జీ-3 దశకు తెచ్చి తెలంగాణలో ఐరన్‌ఓర్ వెలికితీత పనులు సింగరేణికి అప్పగించామని.. సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మిస్తామన్నారు. పత్తి ైరె తుల మద్దతు ధర కోసం సీసీఐతో చర్చిస్తున్నామన్నారు. జిల్లాకు నాలుగేళ్లలో గోదావరి జలాలు తీసుకొస్తామని రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
బేతుపల్లి ప్రత్యామ్నాయ వరద కాలువ నీటి విడుదల చేయటం నా పూర్వ జన్మ సుకృతమన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, జిల్లా కలెక్టర్ ఇలంబరితి, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, జలగం వెంకటరావు, బాణోతు మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, వేంసూరు జెడ్పీటీసీ గుగులోత్ భాషా, ఎంపీపీ మోటపోతుల జగన్నాథం, సర్పంచ్ తక్కెళ్లపాటి గోపాలకృష్ణ పాల్గొన్నారు.