
ఇద్దరూ తోడు దొంగలే
ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, అడ్డదారిలో అందలం ఎక్కాలని చూడటంలో...
- బాబు, కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క
ఖమ్మం: ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, అడ్డదారిలో అందలం ఎక్కాలని చూడటంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలేనని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. గురువారం ఖమ్మం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం ఎమ్మెల్సీకి కోట్ల రూపాయలు ఎర చూపడం, మరొకరు బలం లేకపోయినా ఐదుగురిని బరిలో దింపడం, ఒక్క జడ్పీటీసీ స్థానాన్ని గెలువకపోయినా జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు దక్కించుకోవడం.. చూస్తే ఇద్దరు అడ్డదారిలోనే వెళ్తున్నారనే విషయం స్పష్టమవుతోందన్నారు.
ఒక వైపు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలు జరుగుతుంటే మరోవైపు బాబు, కేసీఆర్ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని అన్నారు. రేవంత్‌రెడ్డి రెడ్డిపై పెట్టిన కేసులనే చంద్రబాబు, కేసీఆర్‌లపై కూడా పెట్టాలని డిమాండ్ చేశారు. పాలేరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్, చంద్రబాబు విధానాలు చూసి ఇరు రాష్ట్రాల ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ సముద్రం వంటిదని, పార్టీ నుంచి ఒక్కరు పోతే.. వందమంది నాయకులు తయారవుతారని అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపిస్తామని చెప్పారు.
ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, టీఆర్‌ఎస్ నాయకులు భయపడి పోతున్నారని అన్నారు. జిల్లాపై రాష్ట్ర ముఖ్యమంత్రి సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. మంజూరైన స్మార్ట్ సిటీని కూడా జిల్లాకు రాకుండా చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని అన్నారు. 2019లో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఐతం సత్యం, నాయకులు పొన్నం వెంకటేశ్వర్లు, కొత్తా సీతారాములు, నున్నా మాధవరావు, కూల్‌హోం ప్రసాద్, జావీద్, యర్రం బాలగంగాదర్ తిలక్, నాగండ్ల దీపక్‌చౌదరి పాల్గొన్నారు.
కాంగ్రెస్ నుంచి పలువురి సస్పెన్షన్
పార్టీ వ్యతిరేక కార్యలకలాపాలకు పాల్పడుతున్న ఖమ్మం నగరంలోని పలువురు కాంగ్రెస్ నాయకులను పార్టీ నుంచి బహిష్కరించినట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు ఐతం సత్యం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో శీలంశెట్టి వీరభద్రం, బెడదం సత్యనారాయణ, దాదె బాస్కర్‌రావు, గుంటి మల్లయ్య, గుంటి అరుణ, కుమ్మరి గురుమూర్తి, తేజావత్ శ్రీనివాస్, పిన్ని కోటేశ్వరరావు, గుత్తా నరేష్ (రామన్నపేట)లను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించినట్లు ఐతం సత్యం పేర్కొన్నారు.