ఎండలు ముదురుతున్నారుు. పల్లెల్లో గొంతెండుతోంది.. తాగునీరు దొరకక జనం తండ్లాడుతున్నారు. వేసవి రాకముందే తాగునీటి ఎద్దడి నివారణకు అన్ని చర్యలూ తీసుకుంటామని చెప్పిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ మాటే మరిచారు. మరమ్మతులకు నోచని చేతిపంపులు.. అడుగంటిన రక్షిత మంచినీటి బావులు.. నిరుపయోగంగా ట్యాంకులు.. వెరసి దాహం కేక మొదలైంది. పల్లెలు తాగునీటి కోసం పడుతున్న అవస్థలపై ‘సాక్షి’ ఫోకస్...
దుంపేటలో దాహం..దాహం..
‘బీడీలు చేస్తేనే పొట్ట గడుస్తది.. పొద్దుగాళ్ల లెవ్వగానే ఇంటోళ్లందరం నీళ్ల కోసం వెతుకుతున్నాం. ఇంట్లో నీళ్లులేకపోతే కనీస అవసరాలు తీర్చుకోవడానికి ఇబ్బందిపాలవుతున్నాం. బిందెడు నీటికోసం బోరుబావి వద్ద గంటల తరబడి నిలబడుతన్నం. దీంతో బీడీలు చేసుకోలేకపోతున్నామని, ఆర్థికంగా ఇబ్బందులపాలవుతున్నామని దుంపేట గ్రామానికి చెందిన ఈసపెల్లి రాజేశ్వరి అనే మహిళ వాపోయింది. ఈ నీటిగోస రాజేశ్వరి ఒక్కరిదే కాదు.. దుంపేట వాసులందరిది.
కథలాపూర్, న్యూస్‌లైన్: కథలాపూర్ మండలం దుంపేటలో ప్రతీ వేసవిలో నీటికి కటకట ఏర్పడుతున్నా సమస్య పరిష్కారంలో ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దుంపేటలో సుమారు 2,150 జనాభా ఉంది. తాగునీటి సరఫరా కోసం 60వేల లీటర్ల వాటర్‌ట్యాంక్, 40వేల లీటర్ల అదనపు వాటర్ ట్యాంక్ నిర్మించారు. ఆయా వాడల్లో 15బోర్లు ఉన్నాయి. ఇప్పటికే 8బోర్లు ఎండిపోయాయి. గ్రామంలోని గ్రామపంచాయతీ ఏరియా, ప్రభుత్వపాఠశాల ఏరియా, రజకకాలనీ, ముదిరాజ్‌వాడలో, బస్టాండ్ ప్రాంతంలో నల్లానీరు రోజు ఒక్కటే బిందెడు వస్తుండడంతో నీటి సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఆయావాడల్లోని బోర్లు గత నెలలోనే ఎండిపోయూరుు.
నీటికోసం ఇతర వాడలకు వెళ్లి గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని, ఆ బోర్లలో కొద్దిసేపు నీళ్లు వచ్చి మళ్లీ ఆగిపోతున్నాయని మహిళలు అంటున్నారు. 60వేల లీటర్ల వాటర్‌ట్యాంక్‌కు నీరందించే బోరుబావుల్లో నీరు అడుగంటిపోయాయి. 40వేల లీటర్ల అదనపు వాటర్ ట్యాంక్ నిర్మించినప్పటికీ పైపులైన్ పూర్తికాకపోవడంతో అది నిరుపయోగంగా మారింది. వాటర్‌ట్యాంక్‌లకు శాశ్వతంగా నీరందించేందుకు పరిష్కారం చూపిస్తే నీటి సమస్య తీరుతుందని గ్రామస్తులు పేర్కొన్నారు.
గ్రామంలో బోరు వేయాలంటే కనీసం 300 ఫీట్లు దాటితేనే నీళ్లు వస్తున్నాయని ప్రజలు అంటున్నారు. దుంపేట పరిసర ప్రాంతాల్లో రాయి విస్తరించి ఉండడంతో బోర్లు వేసినా నీళ్లు రావడం కష్టమేనని భూగర్భజలశాఖ అధికారులు నివేదిక ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామశివారులో పెద్దబావి తవ్వించి పైపులైన్ ద్వారా వాటర్‌ట్యాంకులు నింపితే నీటి సమస్య తీరుతుందని స్థానికులు పేర్కొన్నారు. నల్లా నీటికోసం ఎత్తు ప్రాంతం నుంచి కింది ప్రాంతానికి నీరు వచ్చేలా పైపులైన్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా..
దుంపేటలో నీటి సమస్య తీవ్రంగా ఉందని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రస్తుతం ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేస్తే వేసవిలో కాస్తా సమస్య తీరుతుంది. అదనపు వాటర్‌ట్యాంక్‌కు పైపులైన్, బోరుబావులు ఏర్పాటుచేస్తే శాశ్వతంగా సమస్య పరిష్కారమవుతుంది.
- చిలుక రాజేంద్రప్రసాద్, దుంపేట సర్పంచ్
గొంతెండుతోంది
Published Mon, May 5 2014 3:42 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM
Advertisement
Advertisement