కలిసిపోయిన ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీహరిరావు
సాక్షి, నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై రాజకీయంగా పట్టు కలిగిన నేతలు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సముద్రాల వేణుగోపాలాచారి. ఒకరిని మించి ఒకరు తమదైన హవా చాటుతున్నారు. నిర్మల్ నియోజకవర్గ రాజకీయాల్లోకి వీరిద్దరూ దాదాపు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరూ ఎన్‌టీ రామారావు ప్రారంభించిన తెలుగుదేశంలో కలిసి పనిచేశారు. 1985లో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌గా, 1987లో జెడ్పీచైర్మన్‌గా, 1991లో ఎంపీగా టీడీపీ నుంచి అల్లోల పనిచేశారు. ఇదే పార్టీలో ఉన్న చారి 1985 నుంచి 1994 వరకు నిర్మల్ ఎమ్మెల్యేగా కొనసాగారు. 1991లో ఎంపీగా గెలిచిన ఇంద్రకరణ్‌రెడ్డి అప్పటి పరిస్థితుల్లో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఆ తర్వాత టీడీపీని వీడి కాంగ్రెస్‌లో కొనసాగారు. అప్పటి వరకు మిత్రులుగా ఉన్న వీరిద్దరు 1996, 1998 లోక్‌సభ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీపడ్డారు.
ఇందులో టీడీపీ నుంచి పోటీ చేసిన చారి గెలుపొందారు. 2008 లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో మరోసారి వీరిద్దరూ ప్రత్యర్థులుగా తలపడగా ఈ సారి చారిపై కాంగ్రెస్ అభ్యర్థిగా ఇంద్రకరణ్‌రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో వేణుగోపాలచారి నిర్మల్ నియోజకవర్గాన్ని వదిలిపెట్టి, పక్కన ఉన్న ముథోల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్‌లో ఓడిపోయారు. ఇక 2014 ఎన్నికలలో చారి టీఆర్‌ఎస్‌లో చేరి మళ్లీ ముథోల్ నుంచి పోటీచేసి ఓడారు. ఇదే ఎన్నికల్లో నిర్మల్‌లో బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఇంద్రకరణ్‌రెడ్డి గెలిచారు. అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరారు. అలా మళ్లీ పాత మిత్రులు, శత్రువులు ఒకే పార్టీలో కలిశారు. అల్లోల రాష్ట్ర మంత్రి కాగా, చారి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి అయ్యారు. ప్రస్తుతం ఇద్దరూ వేర్వేరు నియోజకవర్గాలపై దృష్టిపెట్టినా జిల్లాలో టీఆర్‌ఎస్ గెలుపు కోసం పనిచేస్తున్నారు.
ఆ ముగ్గురూ.. ఆయన వెంటే..
నిర్మల్ నియోజకవర్గంలో గతంలో ప్రత్యర్థులుగా ఉన్నవారు.. ఇప్పుడు ఒకే అభ్యర్థి కోసం ప్రచారం చేస్తుండటం విశేషం. రాజకీయాల్లో గురుశిష్యులుగా పేరున్న ఇంద్రకరణ్‌రెడ్డి, కూచాడి శ్రీహరిరావు ఆ తర్వాత ప్రత్యర్థులుగా, మళ్లీ మిత్రులుగా మారారు. 2009లో కాంగ్రెస్ నుంచి ఇంద్రకరణ్‌రెడ్డి, మహాకూటమిలో భాగంగా టీఆర్‌ఎస్ నుంచి శ్రీహరిరావు పోటీపడ్డారు. కాగా, ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 2014లో టీఆర్‌ఎస్ నుంచి శ్రీహరిరావు, బీఎస్పీ నుంచి ఇంద్రకరణ్‌రెడ్డి బరిలో నిలిచారు. గురుశిష్యుల మధ్య పోటాపోటీగా సాగిన పోరులో అల్లోల గెలుపొందారు. ఆ తర్వాత ఆయన టీఆర్‌ఎస్‌లో చేరడం, మంత్రి కావడం, మొదట్లో శ్రీహరిరావుతో విభేదాలు కొనసాగడం.. ఇటీవలే ఇద్దరూ కలిసిపోయారు. అలాగే 2004 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వల్లకొండ సత్యనారాయణగౌడ్ పోటీచేశారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న అల్లోల గెలిచారు. అనంతరం సత్యనారాయణగౌడ్ టీఆర్‌ఎస్‌లో చేరారు.
ఆయన సతీమణి శోభారాణి జెడ్పీ చైర్‌పర్సన్ అయ్యారు. అలాగే 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి అప్పటి స్వతంత్ర అభ్యర్థి అర్గుల కమలాధర్‌గుప్తాపై గెలుపొందారు. అనంతరం 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగానే బరిలో దిగిన నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి సైతం టీఆర్‌ఎస్‌లో చేరారు. గత ఎన్నికల్లో అల్లోలకు ప్రత్యర్థులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, కూచాడి శ్రీహరిరావు, సత్యనారాయణగౌడ్ ఈ ముగ్గురూ ప్రస్తుతం అల్లోల విజయం కోసం ప్రచారంలో పాల్గొంటుండటం గమనార్హం. ఇక ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పుడు అప్పటి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి కొన్నిరోజులు ఒకే పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment