
మహిళా పోలీసుల సంఖ్య పెంచుతాం
- మహిళా ఠాణా ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్
సాక్షి, సిటీబ్యూరో: పోలీసు శాఖలో మహిళా సిబ్బంది సంఖ్యను పెంచుతామని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ, సైబరాబాద్ సీపీ ఆనంద్ తో కలిసి ఆయన గచ్చిబౌలిలోని ఐటీ కారిడార్‌లో ఏర్పాటు చేసిన మహిళా పోలీసుస్టేషన్‌తో పాటు గచ్చిబౌలిలోని శాంతి భద్రతల స్టేషన్‌ను బుధవారం ప్రారంభించారు.
అనంతరం కమిషనర్ కార్యాలయంలోని ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని, ఇందులో భాగంగా పోలీసులకు వాహనాల కొనుగోలు కోసం రూ.300 కోట్లు విడుదల చేసిందన్నారు.
మహిళల రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యల అధ్యయనం కోసం ప్రభుత్వం నియమించిన మహిళా భద్రత కమిటీ త్వరలో సింగపూర్ వెళ్లి అక్కడి చట్టాలను అధ్యయనం చేస్తుందన్నారు. ఐటీ కారిడార్‌లో మహిళా ఉద్యోగుల భద్రతకు సైబరాబాద్ పోలీసులు తీసుకున్న చర్యలను కేటీఆర్ ఈ సందర్భంగా ప్రశంసించారు. అలాగే కార్డన్ సర్చ్ వల్ల మంచి ఫలితాలొచ్చాయన్నారు. డీజీపీ అనురాగ్‌శర్మ మాట్లాడుతూ, పోలీసు శాఖలో 33 శాతం మహిళా సిబ్బంది ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
సేఫ్‌సిటీ ప్రాజెక్ట్‌ను గ్రామ స్థాయికి తీసుకెళ్తామన్నారు. రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, ఐటీ ఉద్యోగుల సౌకర్యార్థంలో ఐటీ కారిడార్‌లో అదనంగా మరో 15 ఆర్టీసీ బస్సులను త్వరలో ప్రవేశపెడతామన్నారు. మహిళలు తమ కష్టాలను పోలీసులకు తెలపడంతో పాటు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫేస్‌బుక్ పేజీని, మహిళా స్టేషన్‌కు కేటాయించిన ఇన్నోవా వాహనాన్ని మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. మహిళల రక్షణ కోసం టెక్ మహింద్రా సంస్థ రూపొందించిన ఫైట్‌బ్యాక్ (ఎఫ్‌బీ) యాప్‌ను కేటీఆర్ ప్రారంభించారు.
ఈ యాప్‌ను మహిళలందరూ డౌన్‌లోడ్ చేసుకోవాలని, ఆపదలో ఉన్నప్పుడు ఉపయోగిస్తే సెలెక్ట్ చేసిన ఐదుగురి సెల్‌ఫోన్‌లకు ఎక్కడ ఆపదలో చిక్కుకున్నది తదితర వివరాలతో మెసేజ్ వెళ్తుందన్నారు. తద్వారా త్వరగా రక్షణ చర్యలు చేపట్టడానికి అనుకూలంగా ఉంటుందన్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ ఐటీ ఉద్యోగుల భద్రతకై తీసుకున్న చర్యలను వివరించారు. మహిళా ఉద్యోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై లఘు చిత్రాన్ని ప్రదర్శించారు.
కార్యక్రమంలో జాయింట్ పోలీసు కమిషనర్ గంగాధర్, డీజీపీలు అవినాష్ మహంతి, క్రాంతిరాణా టాటా, అదనపు డీసీపీ జానకీ షర్మిల, ఎం.శ్రీనివాస్, ఎమ్మెల్యేలు ఎ.గాంధీ, జూపల్లి కృష్ణారావు, ఏనుగు రవీందర్‌రెడ్డి, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ , ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు. అంతకు ముందు మహిళా ఠాణా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐటీ కారిడార్‌లో మహిళల రక్షణపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన ఇన్‌స్పెక్టర్ మధులత, శ్యామలక్ష్మిలకు మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డిలు జ్ఞాపికను బహూకరించారు.