పెరుగుతున్న క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు | Increasing cancer patients | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు

Published Sat, May 31 2014 12:42 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 AM

Increasing cancer patients

మంచిర్యాల అర్బన్/ముథోల్, న్యూస్‌లైన్ : జిల్లాలో పొగాకు ఉత్పత్తులకు ప్రేరేపితులవుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. వినడానికి కర్ణ కఠోరంగా ఉన్నా.. ఇది వాస్తవం. ముఖ్యంగా గిరిజనులు, నూనూగు మీసాల యువకులు, గుట్కాలకు అలవాటు పడుతున్నారు. జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో, జిల్లా సరిహద్దు గ్రామాల్లో, కోల్‌బెల్ట్‌లో గుట్కాలు, జర్దాలు ఎక్కువగా తింటూ అనారోగ్యం పాలవుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆడ, మగ అనే తేడా లేకుండా పొగాకు ఉత్పత్తులను తింటున్నారు. దీంతో అనేక మంది ప్రాణాలు హరీమంటున్నాయి. గుట్కాలతో పాటు పొగాకు ఉత్పత్తులైన సిగరెట్లు, అంబార్, పాన్ జర్దాలను కూడా నిషేధిస్తే బాగుంటుందని అన్ని వర్గాల ప్రజలు చేస్తున్నా విన్నపాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం లేదు.

 1988లో ఆరంభం
 ప్రపంచ ఆరోగ్య సంస్థ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ప్రకటించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోవడంతో విస్తృతమైన ప్రచారం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని తలపోసింది. 31-05-2009 సిగరెట్ పెట్టెలు, బీడీలు, గుట్కాల కవర్లపై పుర్రె ఎముక, గుండెల్లో వ్యాధుల బొమ్మలను ముద్రించారు. అప్పటి నుంచి ప్రభుత్వం కూడా ప్రచారం విస్తృతంగా చేయాలని భావించింది. అందుకు నిబంధన లను విధించింది. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగితే నేరంగా పరిగణించింది. 6 నెలల జైలు, లేదా జరిమానా విధిస్తారు. సిగరెట్, పొగాకు ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ ప్రకటనలు చేయరాదు. 18 ఏళ్ల వయసు వారికి గుట్కాలు, సిగరెట్లు, జర్దాలు అమ్మడం నేరం. విద్యా సంస్థలకు 100 గజాల దూరంలో పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదు. ఇలాంటి ఆదేశాలతోనైనా కొంతవరకు వాడకం తగ్గు ముఖం పడుతుందని అధికారులు భావించారు. అయితే అనుకున్నంత స్పందన లభించలేదు. వాడకం తగ్గలేదు.

 గుట్కాల నిషేధం ఉన్నా...
 ప్రభుత్వం గుట్కాలపై నిషేధం విధించినా గుట్కాలు ఎక్కడపడితే అక్కడ అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. గుట్కాలు తినడం ఎంతో ప్రమాదకరమని తెలిసినా వాటి బలహీనతకు బానిసై ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. కర్ణాటక, చత్తీస్‌గఢ్ నుంచి జిల్లాకు అక్రమమార్గంలో వస్తున్న గుట్కాలు అనేక మంది ప్రాణాలను బలిగొంటున్నాయి. అక్రమ రవాణాను అడ్డుకోవడం లేదు. మహారాష్ట్రకు సరిహద్దునా ఆదిలాబాద్ జిల్లా ఉండడంతో అక్కడి వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. గుట్కాలు, జర్దాలు తినేవారి సంఖ్య జిల్లాలో ఎక్కువగానే ఉంది. వలస వచ్చిన కూలీలు ఎక్కువగా తక్కువ ధరకు లభించే సితార్, విమల్, టైగర్ గుట్కాలను తింటున్నారు. యువకులు ఆర్‌ఎండీ లాంటివి తింటున్నారు.

 ధూమపానంతో అనారోగ్యం
 సిగరెట్లు తాగడంతో ఆయుష్షు త్వరగా తీరిపోయే ప్రమాదం ఉందని తెలిసినా వాటిని మానేందుకు మొగ్గుచూపడం లేదు. సిగరెట్ అలవాటును మానుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిభారి నుంచి తప్పించుకోలేక యువకులు దీర్ఘకాలిక వ్యాధులకు చేరువవుతున్నారు. ఉదయం లేవగానే సిగరెట్ తాగడం వ్యసనంగా మారింది. మద్యం సేవించే సమయంలో సిగరెట్లు ఎక్కువగా తాగుతారు. ముఖ్యంగా విద్యార్థులు సిగరెట్ వ్యసనానికి బానిస కావడం కలవరపెడుతోంది. సిగరెట్ తాగడంతో పొగాకు పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లి గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగుతున్నారు. దీంతో తాగేవారికే కాక  పక్కనున్న వారికి సైతం దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదాలు మెండుగా ఉన్నాయి.

 అనుకుంటే మానివేయవచ్చు
 గుట్కా, పొగాకు ఉత్పత్తులను మానివేయడం చాలా సులువు. కావాల్సిందల్లా ‘నేను మానివేయగలను’ అనే దృఢ సంకల్పం. కౌన్సెలింగ్ చేస్తే కొంత మంచి ఫలితాలు వస్తాయి. జిల్లాలో నెలకు 150 మంది వరకు వ్యాధుల బారినపడి ఆస్పత్రులకు వస్తున్న వారు ఉన్నారు. చాలా మంది గుట్కాలను ఫ్యాషన్‌గా తినడంతో అది నిత్యకృత్యంగా మారిపోతోంది. తినకపోతే నరాలు పని చేయనంత స్థాయికి చేరుకుంటోంది. నోరు తెరవలేరు. అన్నం తినలేరు. అలాంటి వారికి చికిత్స ఇస్తే కొంత వరకు రికవర్ అవుతారు. దశల వారీగా చికిత్స అందిస్తాం. - డాక్టర్ రమణ, చెవి-ముక్కు-గొంతు వైద్య నిపుణులు, మంచిర్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement