నిద్దరోతున్న నిఘా!
Published Mon, Feb 27 2017 12:14 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
► దడపుట్టిస్తున్న చోరీలు
► సొత్తు పోతే దొరకడం కష్టమే..
► పగలు రెక్కీ.. రాత్రిళ్లు చోరీలు
► సవాలుగా మారిన చైన్‌స్నాచింగ్‌లు
మిర్యాలగూడ అర్బన్ :
పట్టణంలో వరుస చోరీలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. నానా కష్టం చేసి పైసా పైసా కూడబెట్టిన సొత్తును దొంగలు దర్జాగా దోచుకెళ్తున్నారు. పగలంతా రెక్కి నిర్వహి స్తూ ఇంటికి తాళం పడిందే తడవు రాత్రిళ్లు లూటీ చేస్తున్నారు. ఒక్కసారి చోరీ అయిన సొత్తు దొరకడం గగనంగా మారింది. పోలీసుల నిర్లక్ష్యం దీనికి తోడవడంతో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇక చైన్ స్నాచర్స్‌ను పట్టుకోవడం ఓ సవాలుగా మారింది. ప్రజలు ఊర్లకు పోయే ముందు పోలీసులకు ముందస్తుగా చెప్పకపోవడంతోనే ఎక్కువగా చోరీలు జరుగుతున్నాయని పోలీసులు భావిస్తున్నారు. అయితే తాళం వేసి ఉన్న ఇంటిలోనే చోరీలు జరుగుతున్నాయనుకుంటే పొరపాటే. ఇంట్లో మనుషులు ఉన్నప్పటికీ దొంగతనాలు జరిగిన ఘటనలు కో కొల్లలున్నాయి. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
పగలు రెక్కీ.. రాత్రి చోరీలు..
కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు పగటి వేళల్లో రెక్కీ నిర్వహించి రాత్రి సమయంలో చోరీలకు పాల్పడుతున్నట్లు సంఘటనలను చూస్తే అర్థమవుతుంది. ఇళ్లు అద్దెకు కావాలనో.. ఇంకా ఏదో పనిమీద వచ్చినట్టు కాలనీల్లో సంచరిస్తున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి పక్కా స్కెచ్‌తో చోరీలకు పాల్పతున్నారు. వాణిజ్య కేంద్రంగా రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న పట్టణంలో జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
వరుస దొంగతనాల నేపథ్యంలో రాత్రి సమయంలో పోలీసుల గస్తీని పెంచాల్సి ఉన్నా.. పోలీసులు నామమాత్రంగా గస్తీలు చేపడుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. కాగా 2016 నుంచి నేటి వరకు 51 చోరీలు జరగగా, సుమారు రూ.42 లక్షలకు పైగా విలువైన సొత్తు మాయమైనట్లు పోలీసుల లెక్కలు చెబుతున్నాయి. దీనిలో 12శాతం మాత్రమే రికవరీ చేసినట్లు పోలీసుల లెక్కలే చెపుతున్నాయి. దీంతో సొత్తు మాయమైతే ఇక వాటిపై ఆశలు వదులుకోవలసిందేనని బాధితులు పేర్కొంటున్నారు.
సిబ్బంది కొరత..
రోజురోజూకీ విస్తరిస్తున్న పట్టణంలో గస్తీ తిరగడానికి సరిపడా సిబ్బంది కొరత కూడా చోరీలు పెరగడానికి కారణమవుతున్నాయని కొంత మంది పోలీసు సిబ్బంది పేర్కొంటున్నారు. వన్‌టౌన్, టూటౌన్ పోలీస్ స్టేషన్లలో మెత్తం 29 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఉన్న పోలీసులకు ఇతర డ్యూటీలు పడిన సమయంలో గస్తీలకు వెళ్లడానికి సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు.
గస్తీ ముమ్మరం చేశాం
అన్ని స్టేషన్ల పరిధిలో పోలీసు సిబ్బంది రాత్రి సమయంలో ముమ్మర గస్తీలు నిర్వహిస్తున్నారు. గస్తీలను పెంచి చోరీలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. డివిజన్ పరిధిలో సుమారు 60 చోరీ కేసులను ఛేదించాం. ఇంటికి తాళం వేసి దూర ప్రాంతాలకు వెళ్లే వారు ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో సమాచారం అందించాలి. ప్రజలు కొద్దిపాటి జాగ్రత్తలతో తమ విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోవచ్చు. కాలనీల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. సిబ్బంది కొరత విషయం ప్రభుత్వ దృష్టిలో ఉంది. – సురభి రాంగోపాల్‌రావు, డీఎస్పీ, మిర్యాలగూడ
Advertisement
Advertisement