
తాలిబన్ల వద్ద వఖాస్ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది వఖాస్ విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాకిస్థానీ అయిన వఖాస్ భారత్‌లో అడుగుపెట్టడానికి ముందు ఆరేళ్ల పాటు తాలిబన్‌లో శిక్షణ పొందినట్లు వెల్లడైంది. ఇతడితోపాటు మరో ఉగ్రవాది తెహసీన్ అక్తర్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు ఢిల్లీ న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
శుక్రవారంతో కస్టడీ గడువు ముగియనుండటంతో ఈలోపు లేదా న్యాయస్థానం అనుమతితో కస్టడీ పొడిగించుకుని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాకిస్థాన్‌కు చెందిన వఖాస్ అసలు పేరు జఖీ ఉర్ రె హ్మాన్. ఫుడ్ టెక్నాలజీలో డిప్లమో పూర్తి చేసిన ఇతగాడు పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా (ఎల్‌ఈటీ) ద్వారా ఉగ్రవాదం వైపు మళ్లాడు. ఆ సంస్థలో ఏడాది పాటు తాజ్ మహ్మద్ అనే ట్రైనర్ దగ్గర శిక్షణ కూడా తీసుకున్నాడు. 2004 నుంచి 2010 వరకు ఆరేళ్ల పాటు అఫ్గానిస్తాన్‌లో ఉన్న తాలిబన్ శిక్షణా కేంద్రంలో అదనపు శిక్షణ పొందాడు.