సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : స్థానిక సంస్థల్లో కీలకమైన మండల పరిషత్‌లకు ఎట్టకేలకు సారథుల ఎన్నిక శుక్రవారం జరగనుంది. ఈ ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రాదేశిక ఎన్నికల్లో జిల్లాలో కారు జోరు కొనసాగింది. 52 మండలాల పరిధిలో 292 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో అత్యధిక మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు టీఆర్‌ఎస్‌కు దక్కనున్నాయి.
సుమారు 30కి పైగా ఎంపీపీ స్థానాలను దక్కించుకోనుంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని.. హంగ్ ఫలితాలొచ్చిన 25 మండలాల్లో ఎక్కువ ఎంపీపీ స్థానాలను తమ ఖాతా లో వేసుకునేందుకు టీఆర్‌ఎస్ పావులు కదిపింది. 165 ఎంపీటీసీ స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్ సుమారు ఐదు మండలాల ఎంపీపీ స్థానాలను గెలుచుకునే అవకాశాలున్నాయి. మూడు మం డల పరిషత్‌లు టీడీపీకి దక్కనుండగా, ఒకటీ, రెండు మండలాల్లో ఎంపీపీ స్థానాలను గెలుచుకుని ఉనికి చాటుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.
మొదట కో-ఆప్షన్ సభ్యుని ఎన్నిక..
ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ రోజు ఆయా మండలాల రిటర్నింగ్ అధికారులుగా వ్యవరించిన వారికే ఇప్పుడు ఎంపీపీ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా నియమించారు. ఆ ఆప్షన్ సభ్యుని ఎన్నిక కోసం ముందుగా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తారు. శుక్రవారం ఉద యం 10 గంటల వరకు కో-ఆప్షన్ సభ్యుని స్థానానికి నామినేషన్లు స్వీకరిస్తారు. 10 నుంచి 12 గంటల వరకు ఈ నామినేషన్ల పరిశీలన ఉంటుంది.
ఈ పరిశీలన కో ఆప్షన్ సభ్యుని స్థానానికి పోటీలో ఉన్న వారి పేర్లను ప్రకటిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక సమావేశం ప్రారంభమవుతుంది. మొద ట ఎంపీటీసీలందరు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం కో-ఆప్షన్ సభ్యుని ఎన్నిక ఉంటుంది. ఈ ఎన్నిక ఫలితం ప్రకటించిన తర్వాత తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి ప్రత్యేక సమావేశం ప్రారంభమవుతుంది.
ఈ సమావేశంలో మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎన్నుకుంటున్నారు. ఎంపీపీ పదవి కోసం ఓ సభ్యుని పేరును ఓ ఎంపీటీసీ ప్రతిపాదిస్తే.. మరో సభ్యుడు బలపరచాల్సి ఉంటుంది. చేతులు ఎత్తే పద్ధతిలో ఎంపీపీని, వైస్ ఎంపీపీని ఎన్నుకుంటారు. ఎంపీటీసీల్లో 50 శాతం మంది ఉంటే కోరం ఉన్నట్లుగా భావించి సమావేశాన్ని ప్రారంభిస్తారు. ఇక్కడ ఆయా నియోజకవర్గాల ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక ఆహ్వానితులుగా మాత్రమే ఉంటారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదు.
నేడే మండలాధీశుల ఎన్నిక
Published Fri, Jul 4 2014 1:32 AM | Last Updated on Sat, Apr 6 2019 9:15 PM
Advertisement
Advertisement