సాక్షి, హైదరాబాద్: ఆధ్యాత్మిక రాజధాని యాదాద్రికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్‌ఓ) సర్టిఫికెట్ లభించడం పట్ల రాష్ట్ర గృహ నిర్మాణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అద్భుత కళాసంపదకు దక్కిన అరుదైన గౌరవమని కొనియాడారు. యాదాద్రి ఆలయ నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ప్రత్యేక చొరవ, నిరంతర పర్యవేక్షణ వల్లే ఈ గుర్తింపు లభించిందన్నారు. ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు, అర్కిటెక్ట్‌లు, శిల్ప కళాకారులకు అభినందనలు తెలిపారు. నిర్మాణ దశలోనే ఐఎస్‌ఓ దక్కడంతో యాదాద్రి కీర్తి మరింత పెరిగిందన్నారు. ప్రాచీన శిల్పకళా సౌందర్యం, కృష్ణశిలల నిర్మాణాలు, ఎత్తైన గోపురాలు, అద్భుతమైన కళాసంపద, తంజావూరు శిల్ప నిర్మాణ రీతి, ప్రాకారాల సౌందర్య ప్రగతి, శిల్పుల కళాసృష్టితో రూపుదిద్దుకుంటున్న యాదాద్రి ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలుస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment