అందుకే.. ఇందూరు మండుతోంది... | Indure @44 Temperatures | Sakshi
Sakshi News home page

అందుకే.. ఇందూరు మండుతోంది...

Published Wed, Apr 20 2016 1:37 AM | Last Updated on Tue, Oct 16 2018 4:56 PM

అందుకే.. ఇందూరు మండుతోంది... - Sakshi

అందుకే.. ఇందూరు మండుతోంది...

సూర్యభగవానుడు ఇంద్రపురిపైనే ఎందుకు కక్షగట్టాడు? ఎక్కడా లేని విధంగా ఇక్కడే ఎందుకు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు? నిజామాబాద్ జిల్లాలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఎందుకు నమోదవుతున్నాయి? వేడి గాలులు తీవ్ర స్థాయిలో వీయడానికి కారణమేమై ఉంటుంది? భౌగోళికంగా ఇందూరు జిల్లా ఎత్తై ప్రాంతంలో ఉండడంతో సూర్యకిరణాలు నిట్టనిలువునా పడుతుండడం, చెట్లు తక్కువగా ఉండడంతో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మేలో 48 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవ్వవచ్చంటున్నారు.
 
* జిల్లా ఎత్తై ప్రాంతంలో ఉంది..
* సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడుతున్నాయి
* గాలిలో తగ్గుతున్న తేమ శాతం, పొడిబారుతున్న భూమి
* చెట్లు తక్కువగా ఉండడమూ కారణమే
* కాంక్రీట్, రోడ్ల పాపమూ ఉంది
* మే నెలలో 48 డిగ్రీలకు చేరే అవకాశం

ఇందూరు : ఇందూరు జిల్లా విదర్భ భూమిలో కలిసి ఉంది. అందుకే భౌగోళికంగా చూస్తే ఎత్తై ప్రాంతంలో ఉంది. సూర్య కిరణాలు ఏ కాలంలోనైనా సరే భూమిని తాకి వేడిని ఉత్పన్నం చేసుకునేందుకు వీలైన ప్రాంతంగా చెప్పవచ్చు. వేసవిలో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇందూరు నిప్పుల కుంపటిగా మారుతోంది.

* సూర్య కిరణాలు ఏటవాలుగా భూమిని తాకితే వేడి శక్తి తక్కువగా ఉంటుంది. కానీ ఇందూరు ఎత్తై ప్రాంతంలో ఉండడంతో సూర్యుడి కిరణాలు భూమిని నిట్టనిలువునా తాకుతున్నాయి. తద్వారా భూమి త్వరగా వేడెక్కుతోంది. దీనికి తోడు మెటల్, కాంక్రీటు రోడ్లు భూమిని కప్పేయడంతో సూర్యుడి కిరణాల ప్రభావం ఎక్కువవుతోంది.
* గాలిలో తేమ శాతం సాధారణంకంటే 20 శాతం తగ్గడం, ఉత్తర వాయువ్యం నుంచి వేడి గాలులు వీయడం, ఎల్‌నినో ప్రభావం వెరసి జిల్లాపై ప్రచండ భానుడి ప్రతాప తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది.
* చెట్లు లేకపోవడం, వర్షాభావంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు ఎండిపోవడమూ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి కారణమే.
* నేలపై నీటిశాతం తగ్గిపోవడంతో తడిగా ఉండాల్సిన భూమి పూర్తి పొడిబారిపోయింది. దీంతో సూర్య కిరణాలు భూమిని తాకి వేడిని మరింత ఉత్పన్నం చేస్తున్నాయి.
 
ఇరవై ఏనిమిదేళ్ల తర్వాత..
ఈ ఏడాది ఏప్రిల్‌లోనే గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరింది. అయితే జిల్లా రికార్డులను తిరిగేసి చూస్తే 1988 సంవత్సరం ఏప్రిల్ 29న 46.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత ఏప్రిల్‌లో ఎప్పుడూ అంత ఉష్ణోగ్రత నమోదు కాలేదు. దీనికి ఒకటి రెండు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఈసారి భానుడు పాత రికార్డును తిరగరాసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
 
మేలో ఆందోళనకరం..
ఏప్రిల్‌లోనే 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవడంపై వాతావరణ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవికి మారు పేరైన, అసలు సిసలు ఎండలకు నెలవైన మేలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. సూర్యుడి ప్రతాపం మే నెలలో మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. మేలో జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 48 డిగ్రీలకు చేరవచ్చని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

2015 మే 22న 46.6 డిగ్రీలు నమోదైంది. కాగా 2005 మే 22న జిల్లాలో రికార్డు స్థాయిలో 47.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అప్పుడు జిల్లాలో కరువు పరిస్థితులు లేకున్నా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న పరిస్థితులు, వాతావరణ మార్పులను చూస్తే ఉష్ణోగ్రత కచ్చితంగా 48 డిగ్రీలకు చేరుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
 ఆదుకోవాల్సింది క్యుములోనింబస్ మేఘాలే
 వేసవి ధాటికి జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు.

ఉదయం 8 గంటలకే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉష్ణోగ్రత ఉదయమే 30 డిగ్రీలు దాటుతోంది. పది దాటితే మండిపోతున్నాడు. మిట్టమధ్యాహ్నం ఉగ్రరూపం చూపిస్తున్నాడు. మధ్యాహ్నానికి 44 డిగ్రీలు దాటుతోంది. సాయంత్రమైనా భానుడి ప్రతాపం తగ్గడం లేదు. భూమిలోంచి వేడి తగ్గడానికి చాలా సమయమే పడుతోంది. రాత్రి 8 గంటలు దాటినా భూమి నుంచి వేడి వెలువడుతోంది. దీనికి తోడు వేడి గాలలు ఎక్కువగా ఉంటున్నాయి.
 
మొత్తం 27 మేఘాలున్నాయి. అయితే క్యుములో నింబస్ మేఘాలు వస్తేనే వేడినుంచి ఉపశమనం లభించే అవకాశాలున్నాయి. ఈ సీజన్‌లోనే ఇవి ఏర్పడతాయి. క్యుములో నింబస్ మేఘాలే జిల్లాకు వేడి నుంచి ఉపశమనం కలిగించగలవని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేఘాలు ఉరుములతో కూడిన వర్షాలు కురిపిస్తాయని, భూతాపం తగ్గడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొంటున్నారు.  

మే నెలలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు ఆయ్యేందుకు అవకాశం కల్పిస్తాయంటున్నారు. అయితే ఈసారి జూన్ 15 నుంచి వర్షాలు పడే అవకాశాలున్నాయని, సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని పుణే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
 
1988 సంవత్సరం ఏప్రిల్ 29న జిల్లాలో 46.8 డిగ్రీల అత్యధికఉష్ణోగ్రత నమోదైంది.
 
2005 సంవత్సరం మే 22న 47.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రికార్డైంది.

 
రోజురోజుకు వేడి పెరుగుతోంది
జిల్లా విదర్భ ప్రాంతంలో ఉండి ఎత్తై ప్రదేశంలో ఉండడంతో వేసవిలో సూర్యుడి నుం చి వచ్చే కిరణాలు నిట్టనిలువుగా భూమిపై పడుతున్నాయి. దీనికి తోడు జిల్లాలో కరు వు పరిస్థితులు, గాలిలో తేమ శాతం తగ్గ డం, ఉత్తర వాయువ్యం నుంచి వేడిగాలు లు వీస్తుండడం వల్ల వేడి ప్రభావం పెరుగుతోంది. భూమిపై కాంక్రీటు వేయడం, నేల పొడిబారడంతో వేడి పరావర్తనం చెంది మరింత వేడి ఉత్పన్న అవుతోంది. మేలో ఎండలు మరింత పెరగొచ్చు.
 - ఏ.నరేందర్, సహాయక శాస్త్రవేత్త, నిజామాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement