Indure
-
అందుకే.. ఇందూరు మండుతోంది...
సూర్యభగవానుడు ఇంద్రపురిపైనే ఎందుకు కక్షగట్టాడు? ఎక్కడా లేని విధంగా ఇక్కడే ఎందుకు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు? నిజామాబాద్ జిల్లాలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఎందుకు నమోదవుతున్నాయి? వేడి గాలులు తీవ్ర స్థాయిలో వీయడానికి కారణమేమై ఉంటుంది? భౌగోళికంగా ఇందూరు జిల్లా ఎత్తై ప్రాంతంలో ఉండడంతో సూర్యకిరణాలు నిట్టనిలువునా పడుతుండడం, చెట్లు తక్కువగా ఉండడంతో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మేలో 48 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవ్వవచ్చంటున్నారు. * జిల్లా ఎత్తై ప్రాంతంలో ఉంది.. * సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడుతున్నాయి * గాలిలో తగ్గుతున్న తేమ శాతం, పొడిబారుతున్న భూమి * చెట్లు తక్కువగా ఉండడమూ కారణమే * కాంక్రీట్, రోడ్ల పాపమూ ఉంది * మే నెలలో 48 డిగ్రీలకు చేరే అవకాశం ఇందూరు : ఇందూరు జిల్లా విదర్భ భూమిలో కలిసి ఉంది. అందుకే భౌగోళికంగా చూస్తే ఎత్తై ప్రాంతంలో ఉంది. సూర్య కిరణాలు ఏ కాలంలోనైనా సరే భూమిని తాకి వేడిని ఉత్పన్నం చేసుకునేందుకు వీలైన ప్రాంతంగా చెప్పవచ్చు. వేసవిలో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇందూరు నిప్పుల కుంపటిగా మారుతోంది. * సూర్య కిరణాలు ఏటవాలుగా భూమిని తాకితే వేడి శక్తి తక్కువగా ఉంటుంది. కానీ ఇందూరు ఎత్తై ప్రాంతంలో ఉండడంతో సూర్యుడి కిరణాలు భూమిని నిట్టనిలువునా తాకుతున్నాయి. తద్వారా భూమి త్వరగా వేడెక్కుతోంది. దీనికి తోడు మెటల్, కాంక్రీటు రోడ్లు భూమిని కప్పేయడంతో సూర్యుడి కిరణాల ప్రభావం ఎక్కువవుతోంది. * గాలిలో తేమ శాతం సాధారణంకంటే 20 శాతం తగ్గడం, ఉత్తర వాయువ్యం నుంచి వేడి గాలులు వీయడం, ఎల్‌నినో ప్రభావం వెరసి జిల్లాపై ప్రచండ భానుడి ప్రతాప తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. * చెట్లు లేకపోవడం, వర్షాభావంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు ఎండిపోవడమూ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి కారణమే. * నేలపై నీటిశాతం తగ్గిపోవడంతో తడిగా ఉండాల్సిన భూమి పూర్తి పొడిబారిపోయింది. దీంతో సూర్య కిరణాలు భూమిని తాకి వేడిని మరింత ఉత్పన్నం చేస్తున్నాయి. ఇరవై ఏనిమిదేళ్ల తర్వాత.. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరింది. అయితే జిల్లా రికార్డులను తిరిగేసి చూస్తే 1988 సంవత్సరం ఏప్రిల్ 29న 46.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత ఏప్రిల్‌లో ఎప్పుడూ అంత ఉష్ణోగ్రత నమోదు కాలేదు. దీనికి ఒకటి రెండు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఈసారి భానుడు పాత రికార్డును తిరగరాసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. మేలో ఆందోళనకరం.. ఏప్రిల్‌లోనే 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవడంపై వాతావరణ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవికి మారు పేరైన, అసలు సిసలు ఎండలకు నెలవైన మేలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. సూర్యుడి ప్రతాపం మే నెలలో మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. మేలో జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 48 డిగ్రీలకు చేరవచ్చని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. 2015 మే 22న 46.6 డిగ్రీలు నమోదైంది. కాగా 2005 మే 22న జిల్లాలో రికార్డు స్థాయిలో 47.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అప్పుడు జిల్లాలో కరువు పరిస్థితులు లేకున్నా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న పరిస్థితులు, వాతావరణ మార్పులను చూస్తే ఉష్ణోగ్రత కచ్చితంగా 48 డిగ్రీలకు చేరుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదుకోవాల్సింది క్యుములోనింబస్ మేఘాలే వేసవి ధాటికి జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. ఉదయం 8 గంటలకే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉష్ణోగ్రత ఉదయమే 30 డిగ్రీలు దాటుతోంది. పది దాటితే మండిపోతున్నాడు. మిట్టమధ్యాహ్నం ఉగ్రరూపం చూపిస్తున్నాడు. మధ్యాహ్నానికి 44 డిగ్రీలు దాటుతోంది. సాయంత్రమైనా భానుడి ప్రతాపం తగ్గడం లేదు. భూమిలోంచి వేడి తగ్గడానికి చాలా సమయమే పడుతోంది. రాత్రి 8 గంటలు దాటినా భూమి నుంచి వేడి వెలువడుతోంది. దీనికి తోడు వేడి గాలలు ఎక్కువగా ఉంటున్నాయి. మొత్తం 27 మేఘాలున్నాయి. అయితే క్యుములో నింబస్ మేఘాలు వస్తేనే వేడినుంచి ఉపశమనం లభించే అవకాశాలున్నాయి. ఈ సీజన్లోనే ఇవి ఏర్పడతాయి. క్యుములో నింబస్ మేఘాలే జిల్లాకు వేడి నుంచి ఉపశమనం కలిగించగలవని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేఘాలు ఉరుములతో కూడిన వర్షాలు కురిపిస్తాయని, భూతాపం తగ్గడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొంటున్నారు. మే నెలలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు ఆయ్యేందుకు అవకాశం కల్పిస్తాయంటున్నారు. అయితే ఈసారి జూన్ 15 నుంచి వర్షాలు పడే అవకాశాలున్నాయని, సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని పుణే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ⇒ 1988 సంవత్సరం ఏప్రిల్ 29న జిల్లాలో 46.8 డిగ్రీల అత్యధికఉష్ణోగ్రత నమోదైంది. ⇒ 2005 సంవత్సరం మే 22న 47.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రికార్డైంది. రోజురోజుకు వేడి పెరుగుతోంది జిల్లా విదర్భ ప్రాంతంలో ఉండి ఎత్తై ప్రదేశంలో ఉండడంతో వేసవిలో సూర్యుడి నుం చి వచ్చే కిరణాలు నిట్టనిలువుగా భూమిపై పడుతున్నాయి. దీనికి తోడు జిల్లాలో కరు వు పరిస్థితులు, గాలిలో తేమ శాతం తగ్గ డం, ఉత్తర వాయువ్యం నుంచి వేడిగాలు లు వీస్తుండడం వల్ల వేడి ప్రభావం పెరుగుతోంది. భూమిపై కాంక్రీటు వేయడం, నేల పొడిబారడంతో వేడి పరావర్తనం చెంది మరింత వేడి ఉత్పన్న అవుతోంది. మేలో ఎండలు మరింత పెరగొచ్చు. - ఏ.నరేందర్, సహాయక శాస్త్రవేత్త, నిజామాబాద్ -
నేడు ఇందూరుకు ఎంపీ కవిత రాక
చంద్రశేఖర్ కాలనీ : పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం ఇందూరు నగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నగరంలోని ఆయా ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. గుర్బాబాది రోడ్డులో గల సదానంద్గార్డెన్లో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే డీసీఎంఎస్ జనరల్ బాడీ సమావేశంలో ఎంపీ కవిత పాల్గొం టారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతినగర్‌లో జరిగే మునిసిపల్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్ సమీక్ష సమావేశంలో, సాయంత్రం 5 గంటలకు విద్యుత్ శాఖ సమీక్ష సమావేశంలో, శ్రావ్య గార్డెన్లో సాయంత్రం 6 గంటలకు జరిగే ఎంజీఆర్ మెమోరియల్ స్పోర్ట్స్ మీట్లో ఎంపీ కల్వకుంట్ల కవిత పాల్గొంటారు. -
‘పవర్’ పంచాయితీ
ఇందూరు: పాలకులు, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామపంచాయతీలకు సంబంధించిన కరెంటు బిల్లుల పంచాయితీ ముదురుతోంది. బిల్లులు కట్టకుంటే గ్రామాలలో విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని నోటీసులు జారీ చేసిన విద్యుత్ శాఖను తప్పుబట్టాలో, లేదా బకాయిలు కట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయాలో తెలియక 718 గ్రామాల సర్పంచులు అయోమయంలో పడిపోయారు. విద్యుత్ అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఏ ఒక్క పంచాయతీ పరిధిలో విద్యుత్ కనెక్షన్ తొలగించినా ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. పరిష్కారం లభించకపోతే న్యాయం కోసం కోర్టుకు వెళతామని స్పష్టం చేస్తున్నారు. ఏం జరిగింది ఎప్పటి మాదిరిగా కరెంటు బిల్లుల బకాయిలను ప్రభుత్వమే భరిస్తుందని సర్పంచులు భావించారు. కానీ, ప్రభుత్వం బిల్లుల విషయాన్ని పట్టించుకోకపోవడంతో జిల్లాలో రూ.117 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. చాలా రోజులు వేచి చూసిన విద్యుత్ అధికారులు, వెంటనే బకాయిలు చెల్లించాలని, లేదంటే కనెక్షన్లు తొ లగిస్తామని 718 పంచాయతీల సర్పంచులకు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం కొన్ని గ్రామాలలో కనెక్షన్లు తొలగిస్తున్నారు కూడా. మీటర్ రీడింగ్ ప్రకారం కాకుండా అడ్డగోలుగా బిల్లులు వేశారని, విద్యుత్ చౌర్యం బిల్లులు కూడా అందులో కలిపారని సర్పంచులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టాల్సిన అధికారులు తమను తాము తప్పించుకోవడానికి పంచాయతీలపై భారం మోపడం సరికాదని విమర్శిస్తున్నారు. ఇపుడు ఏకంగా కనెక్షన్లు తొలగిస్తే, గ్రామాలు అంధకారంలో మునిగిపోతా యని, మంచినీటి పథకాలకు ఆటంకం కలుగుతుందని చెబుతున్నారు. ఆదాయం లేదు... ఆసరా లేదు జిల్లాలో 718 పంచాయతీలున్నాయి. ఇందులో 74 మేజర్, 644 మైనర్ పంచాయతీలు. మేజర్ పంచాయతీలు రూ.53 కోట్లు, మైనర్ పంచాయతీలు రూ.63.88 కోట్లు బకాయి పడినట్లుగా విద్యుత్ అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. గత ప్రభుత్వాలు పంచాయతీలకు సంబంధించిన కరెంట్ బకాయిలు చెల్లించేది. రెండు సంవత్సరాలుగా కట్టకపోవడంతో ఆ భారం పంచాయతీలపై పడింది. ఆ మధ్య మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన బకాయిలు తామే చెల్లిస్తామని, మైనర్ పంచాయతీలు వారే కట్టుకోవాల్సి ఉంటుందని చెప్పారు. కానీ, ఆధికారికంగా ఆదేశాలు ఇవ్వలేదు. రోజులు గడిచిన కొద్దీ బకాయిలు పెరుగుతూనే ఉన్నాయి. గతంలో ఓసారి బిల్లు లు చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేస్తామని విద్యుత్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రుల సాయంతో విద్యుత్ అధికారులకు నచ్చజెప్పారు. ప్రస్తుతం విద్యుత్ అధికారులు ఎవరి మాటా వినడం లేదు. ఫలితంగా పంచాయతీలకు బకాయిల సమస్య తీవ్రమైంది. పంచాయతీల నుంచైన చెల్లిద్దామంటే అంతగా ఆదా యం లేదు. వచ్చిన నిధులు, పన్నులు కార్మికుల జీతాలు, పంచాయతీ నిర్వహణ, ఇతర ఖర్చులకే సరిపోతున్నాయి. నేడు కలెక్టర్ చెంతకు పంచాయితీ బకాయిలు చెల్లించాలని విద్యుత్ అధికారులు ఒత్తిడి తేవడం, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సోమవారం కలెక్టర్ రోనాల్డ్ రోస్‌ను కలవాలని నిర్ణయించుకున్నామని జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గోర్త రాజేందర్ ‘సాక్షి’కి తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీఓ నం 80ని ఆయన దృష్టికి తెస్తామన్నారు. అందులో పేర్కొ న్న విధంగా బకాయిలను సర్కారు చెల్లించే విధంగా చూడాలని కోరతామన్నారు. -
ఇలా అయితే ప్రగతి ఎలా!
ఇందూరు: బీఆర్జీఎఫ్ 2014-15 సంవత్సరానికి సంబంధించిన పనుల ప్రతిపాద న ప్రణాళిక తీరు.‘ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి’ అన్నట్లుగా తయారైంది జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగపడే ఈ నిధుల కో సం పనులను గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలి. నేటివరకు పంపిన దాఖలాలు లేవు. దీనికి ప్రధాన కారణం మండలాలు, మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి ప్రతిపాదనలు సమయానికి జడ్పీ అధికారులకు అందకపోవడమే. 2014-15 సంవత్సరానికిగాను జిల్లాకు రూ. 24 కోట్ల బీఆర్జీఎఫ్ నిధులను కేంద్రం కేటాయించింది. పనుల ప్రతిపాదనలు పంపాలని రెండు నెలల క్రితమే జడ్పీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 25 వరకు పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఈ ఆదేశాలను జడ్పీ అధికారులు మండల, మున్సిపల్ అధికారులకు పంపారు. స్సందించని అధికారులు గడువు ముగిసినప్పటికీ, కొన్ని మండలాల నుంచి ప్రతిపాదనలు రాకపోవడంతో మరో రెండు రోజులు గడువు పెంచిన అధికారులు, రోజూ వెంటపడి, ఒత్తిడి చేసి ప్రతిపాదనలను దాదాపు అన్ని మండలాల నుంచి తెప్పించుకున్నారు. బోధన్, కామారెడ్డి మున్సిపల్‌ల నుంచి కూడా ప్రతిపాదనలు పంపారు. నిజామాబాద్, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్లు మాత్రం పంపలేదు. పలుసార్లు జడ్పీ సీఈఓనే కమిషనర్లకు ఫోన్ చేసి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. జూలై మొదటి వారం పూర్తి కావస్తున్నా, ఇంకా వారు ప్రతిపాదనలు ఇవ్వకపోవడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్జీఎఫ్ నిధులు కావాల వద్దా? వద్దంటే చెప్పండి అంటూ సీరియస్ అ య్యారు. రెండు గంటలలో పంపుతామని వారు సీఈఓకు తెలిపారు. నేటి వరకు కూడా పనుల ప్రతిపాదనలు పంపలేదు. కేంద్రం విధించిన గడువుతోపాటు, జడ్పీ అధికారులు విధించిన గడువు ముగిసి పది రోజులు దాటింది. రోజులవుతుంది. నిజామాబాద్, ఆర్మూర్ మున్సిపాల్టీల నుంచి ప్రతిపాదనలు రాకపోవడంతో కేంద్ర ప్రభు త్వానికి సరైన సమయంలో ప్రణాళికను పంపలేకపోయారు. మళ్లీ మొదటికేనా? ఈ నెల ఐదున జిల్లా పరిషత్ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక జరిగి, కొత్త పాలకవర్గం కొలువుదీరింది. బీఆర్జీఎఫ్ పనుల ప్రణాళిక తయారీలో తమకు కూడా అవకాశం ఇవ్వాలని 15 రోజుల క్రితం జడ్పీ సీఈఓ రాజారాంకు పలువురు జడ్పీటీసీలు వినతి పత్రం ఇచ్చిన విషయం తెలిసిందే. కొత్త పాలకవర్గం కొలువుదీరిన నేపథ్యంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు తయారు చేసిన పనుల ప్రణాళికపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకం టే పాలకవర్గ సభ్యులు బీఆర్జీఎఫ్ పనుల గుర్తింపుపై తమకూ అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. జడ్పీ పాలకవర్గం సమావేశమై వారు ప్రత్యేకంగా తీర్మానం చే సుకునే అధికారం కూడా ఉంది. ఇదే జరిగితే ఇప్పటి వరకు వచ్చిన పనుల ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలు కానున్నాయి. మళ్లీ మొదటి నుంచి పనుల ప్రతిపాదనలు త యారు చేయాల్సి ఉంటుంది. కేంద్రానికి సమర్పించే సరికి మరో నెల రోజుల సమయం పట్టవచ్చు. -
తెలంగాణను ముంచిండ్రు
- కాంగ్రెస్, టీడీపీపై మండిపడిన కేసీఆర్ - డీఎస్, షబ్బీర్ చెల్లని రూపాయలు - నీళ్ల మంత్రిగా ప్రాజెక్టులు పట్టని సుదర్శన్‌రెడ్డి - నిజాంసాగర్, షుగర్ ఫ్యాక్టరీలకు పూర్వవైభవం తెస్తాం - బీడీ కార్మికులకు నెలకు రూ.1000 భృతి - విద్యార్హతలు లేకున్నా ఆటోడ్రైవర్లకు లెసైన్సులు - ఇందూరును అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతా - జిల్లాలో టీఆర్ఎస్ అధినేత సుడిగాలి పర్యటన సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణను నిండా ముంచింది కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలేనని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. 40 ఏళ్లు కాంగ్రెస్, 18 సంవత్సరాలు టీడీపీ పాలించి తెలంగాణను అణగదొక్కాయ ని, పూర్తిగా భ్రష్టుపట్టించాయని పేర్కొ న్నారు. వచ్చే ఎన్నికలలో బీజేపీకి ఓటేస్తే వెంకయ్యబాబు, చంద్రబాబుకు వేసినట్లేనని అన్నారు. మరోసారి తెలంగాణ ప్రజలు మోసపోవద్దని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ పలుచోట్ల మాట్లాడుతూ ప్రధానంగా జిల్లాకు చెందిన మాజీ మంత్రులు డి.శ్రీనివాస్, షబ్బీర్ అలీ, సుదర్శన్‌రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టారు. నిజామాబాద్ అర్బన్‌లో రెండుసార్లు ఓడిపోయిన డి.శ్రీనివాస్ రూరల్‌లో ఎలా గెలుస్తారనుకుంటున్నారని ప్రశ్నించారు. కామారె డ్డి, ఎల్లారెడ్డిలో ఓటమి పాలైన షబ్బీర్ అలీ ప్రజల కోసం చేసిందేమీ లేదని, ఈసారి కూడ ఆయన ఓడిపోవడం ఖాయమన్నారు. డీఎస్, షబ్బీర్ అలీ ఇద్దరు కూడా చెల్లని రూపాయలన్నారు. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రిగా జిల్లాకు చేసింది శూన్యమన్నారు. ప్రాజెక్టులను ఆయన పట్టించుకోలేదని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 10 లక్షల ఎకరాల కు సాగునీరందిస్తామన్నారు. నిజాం షుగర్స్‌కు, నిజాంసాగర్‌కు పూర్వవైభవం నిజాం షుగర్ ఫ్యాక్టరీని నిట్టనిలువునా అమ్ముకున్న చం ద్రబాబుకు జైలుశిక్ష పడటం, చక్కెర ఫ్యాక్టరీకి పూర్వవైభవం తీసుకురావడం ఖాయమని కేసీఆర్ పేర్కొన్నారు. ఎంత చెప్పినా వినకుండా ఫ్యాక్టరీని అమ్మిన బాబు రూ. 380 కోట్ల నష్టం చేకూర్చారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆ ఫ్యాక్టరీని చక్కదిద్దుకుంటా మ న్నారు. ఫ్యాక్టరీని మళ్లీ తెరిపించడంతోపాటు, బోధన్‌లో చెరుకు వంగడాల పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. నైజాముల కాలంలో కళకళ లాడిన నిజాం సా గర్ ప్రాజెక్టును ఆధునీకరిస్తామన్నారు. ఇందూరు జిల్లా రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వచ్చిన వెంటనే లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేస్తామన్నా రు. కృష్ణా జలాలను హైదరాబాద్‌కు తరలించి, సింగూ రు ప్రాజెక్టును జిల్లాకు అంకితం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తానని చెప్పారు. కౌలాస్‌నాలా సామర్థ్యం పెంచుతామన్నారు. ప్రాణహిత, లెండి తదితర పెండిం గ్ ప్రాజెక్టులను పూర్తి చేసి వ్యవసాయరంగానికి పూర్వవైభవం తెస్తామని హామీ ఇచ్చారు. మోతెలో పసుపుబోర్డును ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. విద్యార్హతలు లేకున్నా ఆటోడ్రైవర్లకు డ్రైవింగ్ లెసైన్సులు ఇస్తామని, బీడీ కార్మికులందరికీ రూ.1000 భృతి కల్పిస్తామని ప్రకటించారు. ఇందూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. బలహీనవర్గాలు గౌరవంగా బ్రతకాలి గతంలో పరిపాలన సాగించిన కాంగ్రెస్, టీడీపీలు ఒక్క గదితో డబ్బాల్లాంటి ఇళ్లను నిర్మించి బలహీనవర్గాలను అవమానపర్చారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎ మ్మెల్యేలు, ఎంపీలు ఆ ఇళ్లలో సంసారాలు చేస్తారా? అని ప్రశ్నించారు. బలహీనవర్గాల ప్రజలు గౌరవంగా బ్రతికేలా చూస్తామని, వారి కోసం రెండు పడక గదు లు, మరుగుదొడ్డి, స్నానపు గదులతో 125 గజాలలో రూ. మూడు లక్షల వ్యయంతో పక్కా ఇళ్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. రైతులకు రూ. లక్ష మేరకు పంట రుణాల ను మాఫీ చేస్తామన్నారు. గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చుతామన్నారు. వితంతువులు, వృద్ధులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500ల ఫించ ను ఇవ్వనున్నట్లు చెప్పారు. మహిళలకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మైనార్టీలకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమ లు చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. టీఆర్ ఎస్ గెలుపు ఖాయమై పోయిందని, జిల్లాలో రెండు లోక్‌సభ, తొమ్మి ది అసెంబ్లీ స్థానాలలో విజయం ఖాయమన్నారు. ఈ స భలలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, ఎంపీ అభ్యర్థులు కల్వకుంట్ల కవిత, బీబీ పాటిల్, ఎమ్మెల్యే అభ్యర్థులు బాజిరెడ్డి గోవర్ధన్, పోచారం శ్రీనివాసరెడ్డి, పల్లె గంగారెడ్డి, గంప గోవర్ధన్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, వేముల ప్రశాంత్‌రెడ్డి, మహ్మద్ షకీల్, హన్మంత్ సింధేతదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్కు ప్రజలే హైకమాండ్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలే హైకమాండ్‌గా ఉంటారని, కాంగ్రెస్‌లాగా చిన్న సంతకానికి కూడా ఢిల్లీ నేతల ఆజ్ఞలు, ఆదేశాలు ఉండవని టీఆర్ఎస్ నిజామాబాద్ లోక్‌సభ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నా రు. గురువారం జిల్లాలోని పలు ప్రాంతాలలో జరిగిన సభలలో ఆమె ప్రసంగించారు. 14 ఏళ్ల ఉద్యమంలో టీఆర్ఎస్ నిబద్ధతో ప్రజల పక్షాన నిలిచిందన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలి ప్రభుత్వం మనదే కావాలని ఆకాంక్షించారు. ఇన్ని రోజులు కో రుకుని ఉద్యమం నడిపింది స్వయంపాలన కోసమేనని స్పష్టం చేశారు. 60 ఏళ్ల తరువా త తెలంగాణకు స్వతంత్రం వచ్చిందన్నారు. కొత్త రాష్ట్రంతోపాటు వరుసగా ఎన్నికలు వచ్చాయన్నారు. పరిస్థితులు టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నాయనే దుర్బుద్ధితో ఆంధ్ర సీఎంలు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చారన్నారు.