సాక్షి, హైదరాబాద్: సర్పంచ్‌లను పరోక్షంగా ఎన్నుకోవటంతోపాటు అవిశ్వాస తీర్మానంతో వారిపై వేటు వేసేలా కొత్త పంచాయతీరాజ్ చట్టానికి ప్రభుత్వం సవరణలు చేస్తోంది. సర్పంచ్‌లపై కొరడా ఝళిపిస్తూనే.. పలు విశేషాధికారాలనూ కల్పించనుంది. ప్రస్తుతం నిధుల దుర్వినియోగానికి పాల్పడితేనే సర్పంచిపై వేటు వేసే అవకాశం ఉంది. ఇప్పుడు విధులు నిర్వహించకపోయినా పదవి ఊడిపోయేలా కట్టుదిట్టంగా నిబంధనలు పొందుపరుస్తున్నారు. త్వరలోనే కొత్త చట్టానికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు.
చట్టం ముసాయిదాలో ఏయే అంశాలున్నాయి? వేటికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది? ప్రస్తుతం ఉన్న చట్టానికి ఏమేం సవరణలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కొత్త చట్టంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సంస్కరణలు ఉండేలా అధ్యయనం చేయాలని సీఎం ఇప్పటికే అధికారులకు సూచించారు. దీంతో ముసాయిదా తుది రూపుదిద్దుకుంటున్న కొద్దీ కొత్త చట్టం ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతమున్న పంచాయతీరాజ్ చట్టంలో 220 సెక్షన్లున్నాయి. కొత్తగా మరో 50 సెక్షన్లను పొందుపరిచి చట్టంలో మొత్తం 275 సెక్షన్లు ఉండేలా భారీగా సవరణలు చేసే అవకాశాలున్నాయి. అధికార వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం ముసాయిదాలో ఇప్పటికే పొందుపరిచిన కొన్ని కీలకమైన అంశాలు ఇవీ..
ఎన్నిక పరోక్షం.. అసమ్మతితో వేటు
సర్పంచ్ ఎన్నికను పరోక్షంగా నిర్వహించాలని కొత్త చట్టంలో పొందుపరచనున్నారు. గ్రామాల్లో గెలిచిన వార్డు మెంబర్లందరూ తమలో మెజారిటీ మద్దతు సాధించిన అభ్యర్థిని సర్పంచ్‌గా ఎన్నుకుంటారు. సర్పంచ్‌గా ఎన్నికయ్యే అభ్యర్థి విధిగా వార్డు మెంబర్‌గా గెలుపొంది ఉండాలి. ఒక అభ్యర్థి రెండు మూడు వార్డులకు పోటీ చేయటం కుదరదు. ఏదైనా ఒక వార్డు నుంచే పోటీ చేయాలి. మరోవైపు అసమ్మతి తీర్మానం ద్వారా సర్పంచ్‌ను పదవి నుంచి తొలగించే వీలుంటుంది.
సర్పంచ్, ఉప సర్పంచ్‌పై ఎప్పుడైనా అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చు. విధులు సరిగ్గా నిర్వహించటం లేదని భావిస్తే ఎప్పుడైనా అవిశ్వాసం పెట్టే వెసులుబాటు ఉండేలా చట్టంలో ప్రత్యేకంగా సెక్షన్లను పొందుపరుస్తారు. ప్రస్తుత చట్టంలో ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లను అవిశ్వాస తీర్మానంతో తొలగించే నిబంధన ఉంది. పదవీకాలం నాలుగేళ్లు పూర్తయితేనే అవిశ్వాసం పెట్టాలనే షరతు కూడా ఉంది. సర్పంచ్‌లపై అవిశ్వాసానికి సంబంధించి ఇదే నాలుగేళ్ల వ్యవధి పాటిస్తారా లేదా అనేది స్పష్టత లేదు.
బడ్జెట్ నుంచే నిధులు
స్థానిక సంస్థలకు ప్రత్యేకంగా రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు కేటాయిస్తారు. వీటిని ఖర్చు చేసేందుకు ప్రత్యేకంగా ఎక్స్‌పెండిచర్ కమిటీ ఉంటుంది. స్పెషల్ ఫండ్ గ్రామ సర్పంచ్‌ల అధీనంలో ఉంటుంది. కమిటీ సూచనల మేరకు ఫండ్‌ను ఖర్చు చేయాలనే నిబంధన ఉంటుంది. ఎన్‌ఆర్‌ఐలు, ఇతర దాతలు, వివిధ సంస్థల నుంచి సర్పంచ్ గ్రామానికి అవసరమైన నిధిని సేకరించే వెసులుబాటు ఉంటుంది. పంచాయతీరాజ్ చట్టం ముసాయిదా బిల్లు తయారీ తుది దశకు చేరిందని, సీఎం నిర్ణయం మేరకు నెలాఖరున లేదా జనవరిలో బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.
సర్పంచ్‌లు సైతం పవర్‌ఫుల్
కొత్త చట్టంతో సర్పంచ్‌లకు సైతం విశేషాధికారాలు కల్పిస్తారు. గ్రామాల్లో రోడ్లపై చెత్త వేసినా, రోడ్లను తవ్వినా డ్రైనేజీలు, రోడ్ల వెడల్పుతోపాటు ఇతర ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఎవరైనా అడ్డుపడినా వాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టించే అధికారాలు ఉంటాయి.
గ్రామాల్లో ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సిఫారసు చేయవచ్చు. ఈ విషయాల్లో సర్పంచ్ సరిగ్గా వ్యవహరించకపోయినా, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచకపోయినా, పచ్చదనం పెంపొందించకపోయినా, సర్పంచ్‌ను బాధ్యుడిగా గుర్తించి సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. సర్పంచ్, వార్డు మెంబర్‌పై నేరుగా పోలీసులు కేసు పెట్టే అవకాశం లేదు. సర్పంచ్‌పై ఎవరైనా కేసు పెట్టాలంటే 15 రోజుల ముందు ఆయనకు నోటీసు పంపటం తప్పనిసరి.
ఎస్సైలు సలాం కొట్టాల్సిందే
కొత్త చట్టం ప్రకారం సర్పంచ్‌ల ఆదేశాలను స్థానిక పోలీసులు పాటించాల్సి ఉంటుంది. ఏదైనా కేసు లేదా శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై స్థానిక పోలీస్, అంటే ఎస్సై స్థాయి అధికారి సర్పంచ్ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీకి రావాలని ఎస్సై స్థాయి అధికారిని సర్పంచ్ పిలిస్తే రావాల్సిందే.
సర్పంచ్‌లపై పెత్తనపు కమిటీ
సర్పంచ్‌లకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు గ్రామాల్లో కొత్తగా ఓ కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ సూచనలను సర్పంచ్ తప్పక పాటిలించాలి. ప్రభుత్వమే ఈ కమిటీని నియమిస్తుంది. ఇందులో అధికారులుంటారా.. ఎవరైనా నామినేట్ సభ్యులుంటారా.. అనేది ప్రభుత్వమే తదుపరి జీవో ద్వారా వెల్లడిస్తుంది. గ్రామ సర్పంచ్ విధుల్లో విఫలమయ్యారని, అభివృద్ధి పనుల్లో అవినీతికి పాల్పడినట్లు కమిటీ భావిస్తే పదవి నుంచి సస్పెండ్ చేయాలని సిఫారసు చేసే విస్తృత అధికారాలు కమిటీకి ఉంటాయి. కమిటీ సలహాలను పాటించకున్నా సర్పంచ్ వ్యవహార శైలిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసే అధికారం కమిటీకి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment