సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో రాజీవ్ గృహకల్ప, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీల్లో ఇళ్లు పొందిన లబ్ధిదారుల్లో పెద్ద సంఖ్యలో అనర్హులున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా నిర్ధారించింది. క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి అనర్హులను గుర్తించి వారికిచ్చిన గృహాలను వెనక్కు తీసుకోవాలని నిర్ణయించింది. శనివారం కలెక్టరేట్లో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, రాజీవ్ గృహ కల్ప పథకాల్లో నిర్మించిన ఇళ్ల పరిస్థితిపై ఎంపీలు, ఎమ్మెల్యేలతో మంత్రి మహేందర్‌రెడ్డి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఈ పథకాల్లో ఇళ్లు పొందిన లబ్ధిదారులు చాలావరకు అద్దెకు ఇచ్చుకున్నారని, అలాంటివారిపై చర్యలు తీసుకొని ఇళ్లు లేని నిరుపేదలకు మంజూరు చేయాలన్నారు. దీనికి మంత్రి మహేందర్‌రెడ్డి స్పందిస్తూ ఈ అంశంపై విచారణ జరిపించి అనర్హులను తొలగించి అర్హులకు ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 2005 సంవత్సరంలో 54వేల మంది దరఖాస్తు చేసుకుంటే.. ఇందులో 44వేల మందిని అర్హులుగా గుర్తించినప్పటికీ.. ఇందులో 21366 మందికి ఇంకా ఇళ్లు కేటాయించగా.. 16399 మందికి ఇంకా ఇళ్లు ఇవ్వాల్సి ఉందన్నారు.
జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీల్లో తాగునీటి కొరత తీవ్రంగా ఉందని, పలుకాలనీల్లో మౌలిక వసతులు లేకపోవడంతో లబ్ధిదారులు నివాసం ఉండటంలేదని పలువురు ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. దీంతో మంత్రి స్పందిస్తూ రాజీవ్ గృహకల్ప, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీల్లో మౌలిక వసతులు కల్పించేందుకు జాయింట్ కలెక్టర్ స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ కాలనీలకు రూ.102.14కోట్లు రావాల్సి ఉండగా.. జీహెచ్‌ఎంసీ నుంచి నిధులు విడుదల కాలేదని మంత్రి పేర్కొన్నారు. కృష్ణా మూడోదశ పనులు త్వరలో పూర్తి చేసి నీటి కొరత సమస్య తీరుస్తామన్నారు. సమావేశంలో ఎంపీలు కె.విశ్వేశ్వర్‌రెడ్డి, సీహెచ్.మల్లారెడ్డి, బి.నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు టి.రామ్మెహన్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, క్రిష్ణారెడ్డి, ప్రకాష్‌గౌడ్, వివేకానంద, కాలె యాదయ్య, ప్రభాకర్, కలెక్టర్ ఎన్.శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
గృహకల్పలో బినామీలపై విచారణ
Published Sat, Dec 27 2014 11:49 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement
Advertisement