మోత్కూరు : ఓ బాలుడి కిడ్నాప్ వదంతం కలకలం రేపింది. కిడ్నాపైన బాలుడు మోత్కూరులో తప్పించుకున్నాడని ప్రచారం కావడంతో టీవీచానల్స్‌లో బ్రేకింగ్‌న్యూస్‌లు మార్మోగాయి. స్పందించిన జిల్లా ఎస్పీ అన్ని పోలీస్‌స్టేషన్‌లకు సమాచారం అందించి బాలుడి కిడ్నాప్ సంఘటనపై పోలీసులను అప్రమత్తం చేశారు. చివరికి కిడ్నాపైన బాలుడే అసత్య ప్రచారం చేశాడని తేలడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలిలా.. నార్కట్‌పెల్లి మండలం గోపాలయపెల్లి గ్రామానికి చెందిన అంకిరెడ్డి సువర్ణ-సైదులు దంపతుల కుమారుడు అజయ్ నార్కట్‌పెల్లిలోని శాంతినికేతన్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు పండ్లతోటలను కౌలుకు తీసుకొని ఆయా గ్రామాల్లో నివాసం ఏర్పాటుచేసుకొని జీవిస్తున్నారు.
ప్రస్తుతం అమ్మనబోలులో నివాసముంటున్నారు. నిత్యం అమ్మనబోల్ నుంచి నార్కట్‌పెల్లి పాఠశాలకు స్కూల్‌బస్‌లో వచ్చివెళ్తుండే వాడు. రోజులాగే బుధవారం స్కూల్‌వ్యాన్‌లో ఉదయాన్నే పాఠశాలకు వె ళ్లాడు. అయితే హోంవర్క్ చేయలేదెందుకని టీచర్లు అడగడంతో కడుపునొస్తుందని, ఆరోగ్యం బాలేదని చెప్పడంతో మందులు ఇచ్చారు. కాసేపటి తర్వాత నోడ్స్ కొనుక్కుంటానని చెప్పి పాఠశాల నుంచి దుకాణానికి వచ్చినట్టు నటించి అక్కడి నుంచి మోత్కూరులో ఉన్న బాలుడి బంధువుల దగ్గరికి వెళ్లాడు. తనను కిడ్నాప్ చేశారని, వారినుంచి తప్పించుకొని మీ దగ్గరికి వచ్చానని చెప్పడంతో వెంటనే వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాలుడిని ఎస్‌ఐ పురేందర్‌భట్ తన సిబ్బందితో వచ్చి స్టేషన్‌కు తీసుకెళ్లి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. తనను కొంతమంది వ్యక్తులు తుఫాన్ వాహనంలో నార్కట్‌పెల్లిలో కిడ్నాప్‌చేశారని, మోత్కూరు వద్ద వాహనం నిలిపిఉండగా అక్కడ తప్పించుకొని బంధువుల వద్దకు చేరానని చెప్పాడు.
అప్పటి కే జిల్లా వ్యాప్తంగా బాలుడి కిడ్నాప్ వార్త నిజమేనని ఎలక్ట్రానిక్ చానల్స్‌లో స్క్రోలింగ్ రావడంతో పోలీసులు అప్రమత్తమై కిడ్నాప్‌గ్యాంక్ పై మొదట ఆరాదీశారు. బాలుడి చెప్పే విషయాలు ఒకదానికికొకటి పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చి తల్లిదండ్రులకు, పాఠశాల యాజమాన్యానికి ఫోన్‌చేసి అసలు విషయం రాబట్టారు. పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని హోంవర్క్‌పై ప్రశ్నించడంతో చదవలేక భయపడి అక్కడ నుంచి మోత్కూరుకు వెళ్లాడని తెలుసుకున్నారు. ఇంకేముంది కాస్త భయపెట్టి గట్టిగా అడగడంతో చెప్పింది తప్పుడుమాటలని, నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఊరికే చెప్పానని చెప్పాడు. అనంతరం తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి సీఐ బాలగంగిరెడ్డి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. విద్యార్థికి ఇష్టమైన స్కూల్‌లో చేర్పించి చక్కగా చదివించాలని సూచిం చారు. అనంతరం విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు.
బాలుడి కిడ్నాప్ కలకలం
Published Thu, Aug 13 2015 1:06 AM | Last Updated on Sun, Sep 3 2017 7:19 AM
Advertisement