Motkuru
-
తెలంగాణ పోలీస్ దేశంలోనే ఫస్ట్
మోత్కూరు (తుంగతుర్తి) : సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో తెలంగాణ పోలీస్ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. శనివారం స్థానిక సుమంగళి çఫంక్షన్‌హాల్‌లోఏర్పాటు చేసిన మోత్కూరు, అడ్డగూడూర్ మండలాల సామూహిక సీసీ టీవీ కెమెరాను డీసీపీ రామచంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. తనకోటా నిధులు రూ.7.50 లక్షలతో సీసీ కెమెరాల ఏర్పాటు చేశారని మరిన్ని కెమెరాల ఏర్పాటుకు మోత్కూరుకు రూ.3 లక్షలు , అడ్డగూడూర్‌కు రూ.5లక్షలు కేటాయిం చనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. డీసీపీ కె.రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ఏర్పాటులో జిల్లా రాష్ట్రం లోనే ముందంజలో ఉందన్నారు. కార్యక్రమంలో చౌటుప్పల్ ఏసీపీ శ్రీరామోజు, రమేష్, రామన్నపేట సీఐ ఎన్. శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేంద్రనాథ్, ఎంపీపీ ఓర్సులక్ష్మి, జెడ్పీటీసీ వలక్ష్మీ, స్థానిక సర్పంచ్ పిచ్చయ్య, సింగిల్‌విండో చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎంపీటీసీ జయశ్రీ, ప్రమీళ, శ్రీను, ఎస్ఐలు యాదగిరి, శివనాగప్రసాద్ తదితరులు ఉన్నారు. గీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియో చెక్కుల పంపిణీ మోత్కూరు, అడ్డగూడూర్ మండలాల పరిధిలోని 16 మంది కల్లుగీత కార్మికులకు రూ. 4.86 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కులను ఎమ్మెల్యే గాదరికిషోర్‌కుమార్, ఎక్సైజ్ సూపరిండెంటెంట్ కృష్ణప్రియ పంపిణీ చేశారు. -
అర్ధ సంచారజాతులుగా గుర్తించాలి
మోత్కూరు : గొల్ల, కురుమలను అర్థసంచార జాతులుగా గుర్తించాలని గొల్ల, కురుమల ఐక్య కార్యాచరణ రాష్ట్ర కమ్డిఠీ కన్వీనర్ బెల్లి కృష్ణయాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మోత్కూరులోని రహదారి బంగ్లాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ పదవుల్లో జనాభా ప్రాతిపదికన కచితమైన వాటా ఇవ్వాలని, ప్రమాదవశాత్తు చనిపోయినవారికి రూ. 6 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. పాల ఉప్పత్తి మరియు, విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిలో గొల్ల, కురుమలకు 90 శాతం భాగస్వామ్యం కల్పించాలన్నారు. చెరువు, పొరంబోకు, జంగ్లాత్, చెరువుశిఖం భూముల్లో గొర్రెలు మేపుకోవడానికి కనీసం 10 ఎకరాలు పట్టా ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఉన్ని పరిశ్రమల ఏర్పాటుకు రుణాలు మంజూరు చేయాలని, ఉన్ని ఉత్పత్తులపై శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో గొల్ల, కురుమల జేఏసీ జిల్లా కన్వీనర్ గుండెబోయిన అయోధ్య యాదవ్, మండల కన్వీనర్లు పురుగుల వెంకన్న, ఎలేందర్, ఎంపీటీసీ జంగ శ్రీను, నాయకులు పురుగుల మల్లయ్య, లెంకల వేణు, అవిశెట్టి సుధాకర్, వెంకటనర్సయ్య, మేడబోయిన నరేష్, జంగ నర్సయ్య తదితరులు ఉన్నారు. -
మహిళ దారుణ హత్య
మోత్కూరు ఒంటరిగా నివసిస్తున్న ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన మోత్కూరు మండలం పాటిమట్లలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన పసునూరి సావి త్రమ్మ(46) ఒంటరిగా చిరుదుకాణం నడుపుకుంటూ జీవనం సాగి స్తోంది. వివాహం జరిగిన కొద్దిరోజులకే విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తోంది. దినపత్రికల కట్టలను చూసి.. సావిత్రమ్మ చిరుదుకాణంతో పాటు వివిధ దినపత్రికల ఏజెన్సీ నిర్వాహకురాలిగా వ్యవహరిస్తోంది. బుధవారం పొద్దుపోయినా దినపత్రికల బండిల్స్ ఇంటి ఆ వరణలోనే ఉండడంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడ గా హత్యోదంతం విషయం వెలుగులోకి వచ్చింది. ఒంటిమీది ఆభరణాలు మాయం రక్తపు మడుగులో ఉన్న సావిత్రమ్మ మృతదేహాన్ని ఇరుగుపొరుగు వారు చూసి సమాచారం ఇవ్వడంతో గ్రా మస్తులంతా గుమిగూడారు. ఇంట్లోకి వెళ్లి చూడగా ఆ మె ఒంటిపై ఉన్న పుస్తెలతాడు, చెవి కమ్మలు కనిపిం చలేదు. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను ప్లాస్టిక్ వైరు తో ఉరివేసి చంపి ఆభరణాలు ఎత్తుకెళ్లి ఉంటారని భావిస్తున్నారు. గొంతుకు ఉరివేయడంతో ముక్కులో నుంచి రక్తస్రావం అయినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు గ్రామస్తుల సమాచారం మేరకు రామన్నపేట ఇన్చార్జ్ సీఐ కె.శివరాంరెడ్డి తన సిబ్బందితో ఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యోదంతానికి గల కారణాలను స్థా నికులను అడిగి తెలుసుకున్నారు. క్లూస్‌టీంతో ఘ టన స్థలంలో ఆధారాలు సేకరించారు. డాగ్‌స్క్వాడ్‌తో తని ఖీలు నిర్వహించగా గ్రామమంతా తిరిగి చివరకు సావి త్రమ్మ ఇంటిముందుకు వచ్చి ఆగిపోయాయి. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి సోదరుడు పసునూరి రామచంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ పురేందర్బట్ తెలిపారు. తెలిసిన వారి పనేనా..? సావిత్రమ్మను తెలిసిన వారే హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒంటిరిగా నివసిస్తున్న సావిత్రమ్మ దుకాణం, పేపర్ ఏజెన్సీ నిర్వహిస్తూ బాగానే కూడబెట్టిందని గ్రామంలో ప్రచారం ఉంది. గతంలోనూ ఆమె ఇంట్లోకి మూడు సార్లు దుండగులు ప్రవేశించి చోరీకి పాల్పడిన ఘటనలు ఉన్నాయి. మూడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సావిత్రమ్మ ఇంట్లో చోరీకి పాల్పడేందుకు ప్రయత్నించగా సావిత్రమ్మ గుర్తుపట్టి కేకలు వేసింది. ఈ విషయం పెద్ద మనుషులలో పంచాయితీ పెట్టగా ఆ వ్యక్తిని మందలించి వదిలేశారని గ్రామస్తులు పేర్కొన్నారు. ఇప్పుడు కూడా ఆనేపథ్యంలోనే చోరీకి యత్నించడంతో సావిత్రమ్మ ప్రతిఘటించడంతోనే హత్య చేసి ఆభరణాలతో ఉడాయించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి -
బాలుడి కిడ్నాప్ కలకలం
మోత్కూరు : ఓ బాలుడి కిడ్నాప్ వదంతం కలకలం రేపింది. కిడ్నాపైన బాలుడు మోత్కూరులో తప్పించుకున్నాడని ప్రచారం కావడంతో టీవీచానల్స్‌లో బ్రేకింగ్న్యూస్లు మార్మోగాయి. స్పందించిన జిల్లా ఎస్పీ అన్ని పోలీస్స్టేషన్లకు సమాచారం అందించి బాలుడి కిడ్నాప్ సంఘటనపై పోలీసులను అప్రమత్తం చేశారు. చివరికి కిడ్నాపైన బాలుడే అసత్య ప్రచారం చేశాడని తేలడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలిలా.. నార్కట్‌పెల్లి మండలం గోపాలయపెల్లి గ్రామానికి చెందిన అంకిరెడ్డి సువర్ణ-సైదులు దంపతుల కుమారుడు అజయ్ నార్కట్పెల్లిలోని శాంతినికేతన్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు పండ్లతోటలను కౌలుకు తీసుకొని ఆయా గ్రామాల్లో నివాసం ఏర్పాటుచేసుకొని జీవిస్తున్నారు. ప్రస్తుతం అమ్మనబోలులో నివాసముంటున్నారు. నిత్యం అమ్మనబోల్ నుంచి నార్కట్‌పెల్లి పాఠశాలకు స్కూల్‌బస్‌లో వచ్చివెళ్తుండే వాడు. రోజులాగే బుధవారం స్కూల్‌వ్యాన్‌లో ఉదయాన్నే పాఠశాలకు వె ళ్లాడు. అయితే హోంవర్క్ చేయలేదెందుకని టీచర్లు అడగడంతో కడుపునొస్తుందని, ఆరోగ్యం బాలేదని చెప్పడంతో మందులు ఇచ్చారు. కాసేపటి తర్వాత నోడ్స్ కొనుక్కుంటానని చెప్పి పాఠశాల నుంచి దుకాణానికి వచ్చినట్టు నటించి అక్కడి నుంచి మోత్కూరులో ఉన్న బాలుడి బంధువుల దగ్గరికి వెళ్లాడు. తనను కిడ్నాప్ చేశారని, వారినుంచి తప్పించుకొని మీ దగ్గరికి వచ్చానని చెప్పడంతో వెంటనే వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాలుడిని ఎస్ఐ పురేందర్‌భట్ తన సిబ్బందితో వచ్చి స్టేషన్‌కు తీసుకెళ్లి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. తనను కొంతమంది వ్యక్తులు తుఫాన్ వాహనంలో నార్కట్‌పెల్లిలో కిడ్నాప్‌చేశారని, మోత్కూరు వద్ద వాహనం నిలిపిఉండగా అక్కడ తప్పించుకొని బంధువుల వద్దకు చేరానని చెప్పాడు. అప్పటి కే జిల్లా వ్యాప్తంగా బాలుడి కిడ్నాప్ వార్త నిజమేనని ఎలక్ట్రానిక్ చానల్స్‌లో స్క్రోలింగ్ రావడంతో పోలీసులు అప్రమత్తమై కిడ్నాప్గ్యాంక్ పై మొదట ఆరాదీశారు. బాలుడి చెప్పే విషయాలు ఒకదానికికొకటి పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చి తల్లిదండ్రులకు, పాఠశాల యాజమాన్యానికి ఫోన్‌చేసి అసలు విషయం రాబట్టారు. పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని హోంవర్క్‌పై ప్రశ్నించడంతో చదవలేక భయపడి అక్కడ నుంచి మోత్కూరుకు వెళ్లాడని తెలుసుకున్నారు. ఇంకేముంది కాస్త భయపెట్టి గట్టిగా అడగడంతో చెప్పింది తప్పుడుమాటలని, నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఊరికే చెప్పానని చెప్పాడు. అనంతరం తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి సీఐ బాలగంగిరెడ్డి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. విద్యార్థికి ఇష్టమైన స్కూల్లో చేర్పించి చక్కగా చదివించాలని సూచిం చారు. అనంతరం విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. -
హైదరాబాద్‌ను సినిమా రాజధాని చేయాలి
ప్రముఖ సినీ నటుడు సుమన్ మోత్కూరు: హైదరాబాద్ మహానగరాన్ని ఫిలిమ్ ఇండస్ట్రీ రాజధానిగా తీర్చిదిద్దాలని ప్రముఖ సినీ హీరో సుమన్ అన్నారు. శుక్రవారం మోత్కూరులోని సంతోష్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సినిమా షూటింగ్‌లకు హైదరాబాద్ అన్నిరకాలుగా అనుకూలమైన ప్రాంతమన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం రెండు వేల ఎకరాలు కేటాయిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. తాను సినీ పరిశ్రమలో 37 ఏళ్లుగా సుమారు 350 సినిమాల్లో నటించినట్టు చెప్పారు. దేవుడి పాత్రలు పోషించడంలో ఎన్టీఆర్ తరువాత స్థానం తనకు దక్కిందన్నారు. తెలంగాణలో మంచి కళాకారులు ఉన్నారని, ప్రతిభావంతులైన కళాకారులను తాను ప్రోత్సహిస్తానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ‘జై తెలంగాణ’ అన్నది ఫిల్మ్ ఇండస్ట్రీలో తానొక్కడినేనని గుర్తుచేశారు. ఒకే రకమైన రిజర్వేషన్లు కల్పించాలి కులాల రిజర్వేషన్లు రాష్ట్రానికో విధంగా ఉండడం సరికాదని ప్రముఖ సినీ నటుడు సుమన్ అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారైనందున ఈ సమయంలోనే జాతీయ స్థాయిలో సమాన రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు చెప్పారు. తనకు సమయం దొరికినప్పుడల్లా బీసీ, గౌడ సామాజిక వర్గాల కోసం పనిచేస్తున్నానని తెలిపారు. రైతులకు ప్రత్యేక బీమా పాలసీ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను కాపాడే క్రమంలో అమరులయ్యే పోలీసులు, జవాన్ కుటుంబాలకు భారీ పరిహారం ఇవ్వాలన్నారు. అన్ని రకాల ప్రయోజనాలతో కలుపుకొని కోటి రూపాయల వరకు పరిహారం అందిస్తే బాగుంటుందన్నారు. తన తల్లిదండ్రుల స్ఫూర్తితో పేద ప్రజలకు విద్యాపరంగా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో గౌడ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు గనగాని మల్లేశ్‌గౌడ్, గుండ్లపెల్లి రజింత్, ప్రవీణ్, మల్లేశ్, చౌగోని సత్యం, గునగంటి సత్యనారాయణ, దబ్బెటి సోంబాబు, గీత సొసైటీ అధ్యక్షుడు బుర్ర యాదయ్య, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి బుర్ర శ్రీనివాస్‌గౌడ్, నాయకులు దబ్బటి రమేష్, సోమ రాములు, మొరిగాల వెంకన్న, కారిపోతుల వెంకన్న, బీసు యాదగిరి, రాజయ్య పాల్గొన్నారు. -
జానకీపురం ఎన్‌కౌంటర్‌పై బహిరంగ విచారణ
మోత్కూరు: మండలంలోని జానకీపురం వద్ద ఈనెల 4వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్‌పై బుధవారం మోత్కూరు తహసీల్దార్ కార్యాలయంలో మిర్యాలగూడ ఆర్డీఓ, మెజిస్టీరియల్ విచారణ అధికారి బి.కిషన్‌రావు బహిరంగ విచారణ జరిపారు. పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఉగ్రవాదులు అస్లామ్అయూక్ఖాన్, మహ్మద్ఎజాజొద్దీన్లతో పాటు ఆత్మకూరు ఎస్ఐ సిద్ధయ్య, కానిస్టేబుల్ నాగరాజు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఉద యం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు, మృతిచెందిన పోలీ సుల బంధువులను, రెవెన్యూశాఖ, వైద్యాధికారులను విచారించారు. 36 మందికి నోటీసులు పంపగా విచారణకు 24 మంది హాజరై వాంగ్మూలాలను ఇచ్చారు. 12 మంది గైర్హాజర్ అయ్యారని, పోలీసు విచారణ అధికారి బృందానికి చెందిన 7గురిని తదుపరి పిలిపించి విచారించనున్నట్లు ఆర్డీఓ కిషన్‌రావు తెలిపారు. మొదటగా ఉగ్రవాదులకు పోస్టుమార్టం నిర్వహించిన జిల్లా కేంద్ర ఆస్పత్రికి చెందిన సివిల్‌సర్జన్ డాక్టర్లు టి.నర్సింగరావు, మాతృ, కె.ప్రసాద్రా వు, వినోద్‌కుమార్, బి.శోభారాణిలను ఆర్డీఓ విచారించారు. జానకీపురం వీఆర్వో సత్యనారాయణను ఎదురుకాల్పుల సంఘటన స్థలంలో ఏమి చూశా వు, అక్కడ ఏమి పరిశీలించావు, మృతుల పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించి అతడి స్టేట్మెంట్ను ఆర్డీఓ నమోదు చేసుకున్నారు. మృతిచెందిన కానిస్టేబుల్ నాగరాజు భార్య సంజన, ఆయన తల్లిదండ్రులు శ్రీమన్నారాయణ-లక్ష్మమ్మలను నాగరాజు మృతిచెందాడని ఎవరు చెప్పారని, మీకు ఎలా తెలిసిందని ఆర్డీఓ ప్రశ్నించారు. తమకు అధికారికంగా బాధ్యులైన పోలీసులు ఎవరూ సమాచారం ఇవ్వలేదని ఆత్మకూరు ఎస్ఐ సిద్ధయ్య కాల్పుల్లో మృతిచెందాడని ఆయనతో పాటు కానిస్టేబుల్ నాగరాజు కూడా చనిపోయాడని టీవీ చానల్స్‌లో స్క్రోలింగ్‌లు చూసి నిర్ధారించుకున్నామని ఆర్డీఓకు వివరించారు. చికిత్స కోసం హైదరాబాద్ ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి తరలించామని తెలపడంతో అక్కడికి తామువెళ్లిచూశామని తెలిపారు. నాగరాజు కాల్పులు జరపగా ఒక ఉగ్రవాది మరణించాడని ప్రత్యక్ష సంఘటనలో ఉన్న తోటి కానిస్టేబుల్స్ తమతో చెప్పారని ఆర్డీఓకు వారు వివరించారు. నాగరాజు ఉగ్రవాదనికి కాల్చిచంపిన సమాచారాన్ని కొంతమంది పోలీసులు పక్కదారి పట్టిస్తున్నారని భార్య, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నాగరాజు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందాడని తమ విచారణలో నిర్ధారన జరిగిందని నల్లగొండ డీఎస్పీ రాములు నాయక్ ఆర్డీఓకు వివరించారు. మోత్కూ రు ఎస్ఐ పురేందర్‌భట్, మోత్కూరు, ఆత్మకూరు, రామన్నపేట పోలీస్‌స్టేన్లకు చెందిన కానిస్టేబుల్స్ బి.వెంకటేశ్వర్లు, కొణతం మధు, ఎల్.జానకిరాం, మంద నిరంజన్, టి.శివకోటశ్వర్రావు, ముత్తినేని శ్రీను,హోగార్డు కొంపెల్లి శ్రీనివాస్‌లను ఆయన విచారించారు.వారి ఇచ్చిన స్టేట్మెంట్స్ను రికార్డు చేశారు. భువనగిరి ఆర్డీఓ నూతి మధుసూదన్, డీఎస్పీ సాదుమోహన్‌రెడ్డి, ఎస్ఐ సిద్ధయ్య భార్య ధరణిష, ఆయన సోదరులు దస్తగిరి, పెద్దబాషా, శ్రీకాంత్‌రెడ్డి, ఎఫ్ఏ సీల్ అధికారి తజియోద్దీన్ విచారణకు గైర్హాజరు అయ్యారని ఆర్డీఓ తెలిపారు. -
కలకలం రేపిన చిన్నారుల అదృశ్యం
మోత్కూరు : మోత్కూరు పట్టణంలో స్మైల్ వెల్ఫేర్‌ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అబ్బాస్ చిల్డ్రన్ హోం నుంచి చిన్నారులు అదృశ్యం అయ్యారనే వార్త శుక్రవారం తీవ్ర కలకలం రేపింది. మునగాలకు చెంది న డి.కవిత, కరీంనగర్ జిల్లాకు చెందిన బాలరాజు మండల కేం ద్రంలో అబ్బాస్ చిల్డ్రన్ హోంను నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన 27 మంది చిన్నారులు ఇక్కడ వసతి పొందుతున్నారు. ఇందులో కోశాధికారిగా ఎం.వెంకటేశ్వర్లు, ట్యూటర్‌గా ఓర్సు జ్యోతి, ఆయాగా గొలుసుల లక్ష్మమ్మ పనిచేస్తున్నారు. దీని నిర్వహణకు ఫ్రాన్స్ దేశం నుంచి నిధులు వస్తున్నట్టు తెలిసింది. అవి దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తమ గుట్టు రట్టవుతుందనే నిర్వాహకులు చిల్డ్రన్ హోంను మూసివేసినట్టు తెలుస్తోంది. అప్రమత్తమైన అధికారులు చిల్డ్రన్ హోం నుంచి 27 మంది చిన్నారులు అదృశ్యమయ్యారని లీగల్‌సెల్ సర్వీస్ అథారిటీకి ఫిర్యాదు అందింది. దీంతో ఈ ఘటనపై విచారణ జరపాలని పోలీస్‌శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఎస్పీ ప్రభాకర్‌రావు వెంటనే జిల్లా విద్యాధికారి ఎస్.విశ్వనాథరావును అప్రమత్తంచేశారు. రామన్నపేట సీఐ ఎ.బాలగంగిరెడ్డి, తహసీల్దార్ బి.ధర్మయ్య, ఎంఈఓ జె.సత్తయ్య మూసివేసి ఉన్న చిల్డ్రన్‌హోం వద్దకు వచ్చి విచారణ జరుపుతున్నారు. చిన్నారులు ఏమైనట్టు..? చిల్డ్రన్‌హోం ఈ నెల 18వ తేదీ రాత్రి నుంచి మూతబడినట్టు అందులో పనిచేస్తున్న ఆయా గొలుసుల లక్ష్మమ్మ పేర్కొంది. ఈ చిల్డ్రన్ హోంలో వసతి పొందుతున్న సాయికుమార్, వేముల శివకృష్ణ, రవిశంకర్‌ను నిర్వహకులు బాలరాజు, కవిత గత జూన్ 24న మోత్కూరు పట్టణం గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలలో అడ్మిషన్ చేయించినట్లు ఎంఈఓ విచారణలో తేలింది. దసరా సెలవుల వరకు ఈ ముగ్గురు విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారు. సెలవుల అనంతరం విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరు అయినట్లు హాజరు రిజిస్టర్లో ఉంది. కాగా, అక్టోబర్ 17,18 తేదీల్లో చిల్డ్రన్‌హోంలో మీటింగ్‌లు నిర్వహించినట్లు సీఐ విచారణలో ఆయమ్మ గొలుసు ల లక్ష్మమ్మ తెలిపింది. నిధులు దుర్వినియోగం అవుతున్నాయనే నేపథ్యంలో నిర్వహకులు చిల్డ్రన్‌హోం ను మూసివేశారా?, పిల్లలను ఇతర చోటుకు తరలించారా పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. కాగా, 5 గురు పిల్లలతో కవిత తన తల్లిదండ్రులతో నకిరేకల్ పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మిగిలిన 22 మంది పిల్లలు ఏమయ్యారనే విషయం తేలాల్సి ఉంది. -
27మంది చిన్నారుల అదృశ్యం!
నల్లగొండ జిల్లా మోత్కూర్‌లో ఘటన లీగల్‌సెల్ సర్వీస్ అథారిటీకి ఫిర్యాదు విచారణకు ఆదేశం మోత్కూరు: నల్లగొండ జిల్లా మోత్కూరులో స్మైల్ వెల్ఫేర్‌ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అబ్బాస్ చిల్డ్రన్‌హోం నుంచి 27 మంది చిన్నారులు అదృశ్యమైన ఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. చిల్డ్రన్‌హోం నుంచి పిల్లలు అదృశ్యమయ్యారని లీగల్‌సెల్ సర్వీస్ అథారిటీకి ఫిర్యాదు అందింది. దీంతో ఈ ఘటనపై విచారణ జరపాలని పోలీస్‌శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఎస్పీ ప్రభాకర్‌రావు వెంటనే జిల్లా విద్యాధికారి ఎస్.విశ్వనాథరావును అప్రమత్తం చేశారు. రామన్నపేట సీఐ ఎ.బాలగంగిరెడ్డి, తహసీల్దార్ బి.ధర్మయ్య, ఎంఈఓ జె.సత్తయ్య విచారణ జరుపుతున్నారు. అబ్బాస్ చిల్డ్రన్‌హోంను నల్లగొండ జిల్లా మునగాలకు చెందిన డి.కవిత, కరీంనగర్‌కు చెందిన బాలరాజులు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ నిర్వహణకు ఫ్రాన్స్ దేశం నుంచి నిధులు వస్తున్నాయని తెలిసింది. హోంలో వివిధ ప్రాంతాలకు చెందిన 27మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. కొన్నిరోజులుగా నిధులు దుర్వినియోగమవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 18వ తేదీ రాత్రి నుంచి చిల్డ్రన్‌హోం మూసినట్లు తెలుస్తోంది. అయితే పిల్లలను ఇతరచోటుకు తరలించారా..లేక సంరక్షకుల వద్దకు చేర్చారా అన్న విషయం తేలాల్సి ఉంది. కాగా, నిర్వాహకులలో ఒకరైన కవిత, ఐదుగురు చిన్నారులు, ఆమె తల్లిదండ్రులు నకిరేకల్ పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. -
బంగారు తెలంగాణ కేసీఆర్‌తోనే సాధ్యం
మోత్కూరు : సుదీర్ఘ పోరాటం తర్వాత ఆవిర్భవించిన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే శక్తి సీఎం కేసీఆర్‌కే ఉందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ అన్నారు. శనివారం టీడీపీ మోత్కూరు పట్టణశాఖ కార్యదర్శి వర్రె రాములు, ఆయన అనుచరులు 40 మంది, కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో 10 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం, పదవులకోసం టీఆర్ఎస్ పాకులాడలేదని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా పనిచేసిందన్నారు. ఆంధ్రా నాయకుల చేతిలో తెలంగాణను తాకట్టుపెట్టిన టీడీపీ, కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత నాయకులు టీఆర్ఎస్ను విమర్శించడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో వివిధ పార్టీలనుంచి కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల రామకృష్ణారెడ్డి, మం డల పార్టీ అధ్యక్షుడు కొణతం యాకుబ్‌రెడ్డి, ఎం పీపీ ఓర్సు లక్ష్మి, మోత్కూరు ఎంపీటీసీ సభ్యు డు జంగ శ్రీను, నాయకులు పురుగుల వెంకన్న, మంచ గోవర్ధన్, బి.వెంకటయ్య, దేవ, సీహెచ్.మహేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
బైక్‌ల దొంగ పరార్..!
మోత్కూరు :పోలీస్‌కస్టడీలో ఉన్న ఓ బైక్‌ల దొంగ పరారయ్యాడు. ఈ ఘటన మోత్కూరు పోలీస్‌స్టేషన్‌లో సోమవారం చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. హైదరాబాద్‌కు చెందిన ఏవూరి శివకుమార్ అలియాజ్ శివ, వెంకి, విక్రం, విక్కి పొడిచేడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి సమీప బంధువు. శివకుమార్ గతంలో గ్రామానికి చెందిన కొందరికి నాలుగైదు బైక్‌లు విక్రయించాడు. కాగా,ఇటీవల గ్రామానికి చెందిన కప్ప శ్రీరాములు తన బైక్‌ను ఇంటి ఎదుట పార్క్ చేయగా గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. దీంతో ఇటీవల బైక్‌లు విక్రయించిన శివకుమార్‌పై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తూ అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. ఇవే కాక పలు ప్రాంతాల్లో సుమారు 38 బైక్‌లు అపహరించినట్లు ఒప్పుకున్నాడు. వాటిలో 9 బైక్‌లను పోలీసులు రికవరీ చేసినట్లు సమాచారం. మిగతా బైక్‌లను కూడా రికవరీ చేసేందుకు అతడిని విచారిస్తున్నారు. ఈలోగా శివకుమార్ పోలీసుల కన్నుగప్పి పరారైనట్లు తెలిసింది. సిబ్బంది నిర్లక్ష్యంతోనే.. తమ అదుపులో ఉన్న శివకుమార్ పరారైంది వాస్తవమేనని ఎస్ఐ అబ్బు రంజిత్‌రెడ్డి తెలిపారు. తాను గణేష్ ఉత్సవాల బందోబస్తుకు వెళ్లగా సిబ్బంది నిర్లక్ష్యంతో ఘటన చోటు చేసుకుందని వివరించారు. -
ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి
మోత్కూరు :ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యవుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు (కేటీఆర్), విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డిలు అన్నారు. గురువారం మోత్కూరు, కొండగడప గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ గ్రామాల్లోని వనరులను సద్వినియోగం పర్చుకోవడం కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం ‘మన ఊరు-మన ప్రణాళిక’ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. దీనిలో గుర్తించిన సమస్యలను ప్రాధాన్యం ప్రకారం పరిష్కరిస్తారని చెప్పారు. ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెండింగ్‌లో ఉందని, త్వరలో సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. రూ.లక్ష వరకు ఎలాంటి షరతులూ లేకుండా పంట రుణమాఫీ ప్రభుత్వం అమలుచేస్తుందన్నారు. దసరా, దీపావళి వరకు ప్రభుత్వం కొత్తరేషన్‌కార్డులను మంజూరు చేస్తుందని తెలిపారు. నవంబర్ మాసం నుంచి వివిధ రకాల పింఛన్లు పెంచి అందజేయనున్నట్లు తెలిపారు. 500 జనాభా గల ప్రతి తండా ఆవాసాలను కచ్చితంగా నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామన్నారు. ఐకేపీ కేంద్రాలు ఏర్పాటుచేసిన గ్రామాల్లో 500 ధాన్యం నిలువ గోదాములను నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని తెలిపారు. అభివృద్ధి కమిటీలతో గ్రామాభివృద్ధి.. మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని కోట్ల నిధులు ఇచ్చినా అభివృద్ధి సాధ్యం కాదని, ప్రజల భాగస్వామ్యం పెరిగినప్పుడే అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందన్నారు. అందులో భాగంగానే ‘మన ఊరు-మన ప్రణాళిక’ను సీఎం కేసీఆర్ అమలుపరుస్తున్నారని వివరించారు. వివిధ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసుకుని గ్రామాభివృద్ధికి దోహదపడుతున్న కొండగడపవాసులను అభినందించారు. జెడ్పీ చైర్మన్ బాలునాయక్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ నూతన భవనానికి నిధులు మంజూరు కావాలని కోరగా మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. అత్యాధునిక సౌకర్యాలతో భవనం నిర్మాణంకోసం నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కొండగడపను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా.. కొండగడప గ్రామానికి చెందిన ప్రపంచ వాణిజ్య సంస్థ భారత అధికారి కొప్పుల శ్రీకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో తాను ఎక్కడ ఉన్నా జన్మభూమిని విస్మరించబోనన్నారు. గ్రామాభివృద్ధికోసం తన వంతు కృషిచేస్తానని తెలిపారు. జిల్లాలో కొండగడపను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషిచేస్తున్నట్లు చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో వివిధ కమిటీలను ఏర్పాటుచేసి అభివృద్ధి దశలో గ్రామాన్ని నడిపిస్తున్నట్లు తెలిపారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా ఆలేరు, నకిరేకల్, మునుగోడు ఎమ్మెల్యేలు గొంగిడి సునీతారెడ్డి, వేముల వీరేశం, కె.ప్రభాకర్‌రెడ్డి, భువనగిరి ఆర్డీఓ ఎన్.మధుసూదన్, డీపీఓ కృష్ణమూర్తి, డీఎంహెచ్ఓ ఆమోస్, జెడ్పీ సీఈఓ దామోదర్, డ్వామా పీడీ సునంద, డీఆర్డీఏ పీడీ సుధాకర్, మండల స్పెషల్ ఆఫీసర్ నిరంజన్, ఎంపీపీ ఓర్సు లక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు చింతల వరలక్ష్మి, సర్పంచ్‌లు కె.ఉమారాణి, బయ్యని పిచ్చయ్య, ఎంపీటీసీ సభ్యులు జంగ శ్రీను, ఎర్రబెల్లి పద్మ, మోత్కూరు సింగిల్‌విండో చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కె.యాకుబ్‌రెడ్డి, నాయకులు కాసోజు శంకరమ్మ, వెంకటాచారి, కె.ప్రకాశ్‌రాయుడు పాల్గొన్నారు. వీఆర్వోల సమస్యల పరిష్కరించాలి గ్రామ రెవెన్యూ అధికారులకు జూనియర్ అసిస్టెంట్ల పేస్కేల్‌ను అందజేయాలని కోరుతూ మంత్రి కేటీఆర్‌కు తెలంగాణ వీఆర్వోల జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.కె.చాంద్‌పాషా ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలని, వివిధ సమస్యలను విన్నవించారు. -
జయహో
మోత్కూరు, న్యూస్‌లైన్, బోనాలు ఎత్తుకున్న మహిళలు.. శివసత్తు ల ఆటాపాటలు.. ఎడ్ల బండ్ల పరుగులు.. బైక్‌ల ప్రదర్శనలతో జయనామ సంవత్సర ఉగాది పర్వదినం సోమవారం మోత్కూరు మండల కేంద్రంలో ఆనందోత్సాహాలతో జరిగింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మండల కేంద్రం లో వినూత్న రీతిలో ఉగాది పండగను ప్రజలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల రంగులతో, రంగురంగుల కాగితాలతో ఎడ్ల బండ్లు, ఆటోలు, డీసీఎంలు, కార్లు, బైక్‌లు, ట్రాక్టర్లు తదితర వాహనాలను అలంకరించారు. అలాగే పసుపు-కుంకుమ, వేపాకులతో అలంకరించిన బోనాలను నెత్తిన పెట్టుకుని మహిళలు వాడ వాడలా డప్పు చప్పుళ్లుతో ఊరేగింపుగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు. ఈ బోనాల చుట్టూ వాహనాలతో భక్తిభావంతో ప్రక్షిణలు చేశారు. ఎడ్ల బండ్లను పరుగులెత్తించడం, వాహనాలు అత్యంత వేగవంతంగా నడిపే విన్యాసాలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా స్థానిక ఎస్ఐ అబ్బు రంజిత్‌రెడ్డి పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. మూడు గంటల పాటు విన్యాసాలు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఎడ్ల బండ్ల ప్రదర్శన, బైక్‌ల విన్యాసాలు సుమారు 3 గంటల వరకు కొనసాగాయి. ఎడ్ల బండ్లు, వాటి పై ఏర్పాటు చేసిన మైక్ సెట్ల పాటలతో జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణమంతా మార్మోగింది. అత్యంత వేగంగా ఎడ్లబండ్లను పరుగెత్తిస్తూ ఆ బండ్లపై యువకులు నృత్యాలు చేయడం ఆకట్టుకుంది. యువకులు పోటీ పడి మరీ ఒంటిచేత్తో బైకుల విన్యాసాలు చేయడం ఆకట్టుకున్నాయి. జిల్లా పరిషత్ హైస్కూల్, సుందరయ్యకాలనీ లోని ముత్యాలమ్మ , శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయాల చుట్టూ ఎడ్లబండ్లతో ప్రదక్షిణ చేశారు. అనంతరం చెరువు కట్ట వద్ద ఉన్న ముత్యాలమ్మ దేవతకు నైవేద్యంసమర్పించారు. అలాగే ఆరెగూడెం, కొండాపురంలలో ముత్యాలమ్మగుడి వద్ద ఎడ్ల బండ్లు, బోనాలతో ప్రదక్షిణలు చేశారు.