ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి
మోత్కూరు :ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యవుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు (కేటీఆర్), విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డిలు అన్నారు. గురువారం మోత్కూరు, కొండగడప గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ గ్రామాల్లోని వనరులను సద్వినియోగం పర్చుకోవడం కోసమే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ‘మన ఊరు-మన ప్రణాళిక’ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. దీనిలో గుర్తించిన సమస్యలను ప్రాధాన్యం ప్రకారం పరిష్కరిస్తారని చెప్పారు.
ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెండింగ్‌లో ఉందని, త్వరలో సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. రూ.లక్ష వరకు ఎలాంటి షరతులూ లేకుండా పంట రుణమాఫీ ప్రభుత్వం అమలుచేస్తుందన్నారు. దసరా, దీపావళి వరకు ప్రభుత్వం కొత్తరేషన్‌కార్డులను మంజూరు చేస్తుందని తెలిపారు. నవంబర్ మాసం నుంచి వివిధ రకాల పింఛన్లు పెంచి అందజేయనున్నట్లు తెలిపారు. 500 జనాభా గల ప్రతి తండా ఆవాసాలను కచ్చితంగా నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామన్నారు. ఐకేపీ కేంద్రాలు ఏర్పాటుచేసిన గ్రామాల్లో 500 ధాన్యం నిలువ గోదాములను నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని తెలిపారు.
అభివృద్ధి కమిటీలతో గ్రామాభివృద్ధి..
మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని కోట్ల నిధులు ఇచ్చినా అభివృద్ధి సాధ్యం కాదని, ప్రజల భాగస్వామ్యం పెరిగినప్పుడే అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందన్నారు. అందులో భాగంగానే ‘మన ఊరు-మన ప్రణాళిక’ను సీఎం కేసీఆర్ అమలుపరుస్తున్నారని వివరించారు. వివిధ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసుకుని గ్రామాభివృద్ధికి దోహదపడుతున్న కొండగడపవాసులను అభినందించారు. జెడ్పీ చైర్మన్ బాలునాయక్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ నూతన భవనానికి నిధులు మంజూరు కావాలని కోరగా మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. అత్యాధునిక సౌకర్యాలతో భవనం నిర్మాణంకోసం నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
కొండగడపను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..
కొండగడప గ్రామానికి చెందిన ప్రపంచ వాణిజ్య సంస్థ భారత అధికారి కొప్పుల శ్రీకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో తాను ఎక్కడ ఉన్నా జన్మభూమిని విస్మరించబోనన్నారు. గ్రామాభివృద్ధికోసం తన వంతు కృషిచేస్తానని తెలిపారు. జిల్లాలో కొండగడపను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషిచేస్తున్నట్లు చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో వివిధ కమిటీలను ఏర్పాటుచేసి అభివృద్ధి దశలో గ్రామాన్ని నడిపిస్తున్నట్లు తెలిపారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా ఆలేరు, నకిరేకల్, మునుగోడు ఎమ్మెల్యేలు గొంగిడి సునీతారెడ్డి, వేముల వీరేశం,
కె.ప్రభాకర్‌రెడ్డి, భువనగిరి ఆర్డీఓ ఎన్.మధుసూదన్, డీపీఓ కృష్ణమూర్తి, డీఎంహెచ్‌ఓ ఆమోస్, జెడ్పీ సీఈఓ దామోదర్, డ్వామా పీడీ సునంద, డీఆర్‌డీఏ పీడీ సుధాకర్, మండల స్పెషల్ ఆఫీసర్ నిరంజన్, ఎంపీపీ ఓర్సు లక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు చింతల వరలక్ష్మి, సర్పంచ్‌లు కె.ఉమారాణి, బయ్యని పిచ్చయ్య, ఎంపీటీసీ సభ్యులు జంగ శ్రీను, ఎర్రబెల్లి పద్మ, మోత్కూరు సింగిల్‌విండో చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కె.యాకుబ్‌రెడ్డి, నాయకులు కాసోజు శంకరమ్మ, వెంకటాచారి, కె.ప్రకాశ్‌రాయుడు పాల్గొన్నారు.
వీఆర్వోల సమస్యల పరిష్కరించాలి
గ్రామ రెవెన్యూ అధికారులకు జూనియర్ అసిస్టెంట్ల పేస్కేల్‌ను అందజేయాలని కోరుతూ మంత్రి కేటీఆర్‌కు తెలంగాణ వీఆర్వోల జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.కె.చాంద్‌పాషా ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలని, వివిధ సమస్యలను విన్నవించారు.