బోనాలు ఎత్తుకున్న మహిళలు
మోత్కూరు, న్యూస్‌లైన్, బోనాలు ఎత్తుకున్న మహిళలు.. శివసత్తు ల ఆటాపాటలు.. ఎడ్ల బండ్ల పరుగులు.. బైక్‌ల ప్రదర్శనలతో జయనామ సంవత్సర ఉగాది పర్వదినం సోమవారం మోత్కూరు మండల కేంద్రంలో ఆనందోత్సాహాలతో జరిగింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మండల కేంద్రం లో వినూత్న రీతిలో ఉగాది పండగను ప్రజలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల రంగులతో, రంగురంగుల కాగితాలతో ఎడ్ల బండ్లు, ఆటోలు, డీసీఎంలు, కార్లు, బైక్‌లు, ట్రాక్టర్లు తదితర వాహనాలను అలంకరించారు.
అలాగే పసుపు-కుంకుమ, వేపాకులతో అలంకరించిన బోనాలను నెత్తిన పెట్టుకుని మహిళలు వాడ వాడలా డప్పు చప్పుళ్లుతో ఊరేగింపుగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు. ఈ బోనాల చుట్టూ వాహనాలతో భక్తిభావంతో ప్రక్షిణలు చేశారు. ఎడ్ల బండ్లను పరుగులెత్తించడం, వాహనాలు అత్యంత వేగవంతంగా నడిపే విన్యాసాలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా స్థానిక ఎస్‌ఐ అబ్బు రంజిత్‌రెడ్డి పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
మూడు గంటల పాటు విన్యాసాలు
మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఎడ్ల బండ్ల ప్రదర్శన, బైక్‌ల విన్యాసాలు సుమారు 3 గంటల వరకు కొనసాగాయి. ఎడ్ల బండ్లు, వాటి పై ఏర్పాటు చేసిన మైక్ సెట్‌ల పాటలతో జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణమంతా మార్మోగింది. అత్యంత వేగంగా ఎడ్లబండ్లను పరుగెత్తిస్తూ ఆ బండ్లపై యువకులు నృత్యాలు చేయడం ఆకట్టుకుంది.
యువకులు పోటీ పడి మరీ ఒంటిచేత్తో బైకుల విన్యాసాలు చేయడం ఆకట్టుకున్నాయి. జిల్లా పరిషత్ హైస్కూల్, సుందరయ్యకాలనీ లోని ముత్యాలమ్మ , శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయాల చుట్టూ ఎడ్లబండ్లతో ప్రదక్షిణ చేశారు. అనంతరం చెరువు కట్ట వద్ద ఉన్న ముత్యాలమ్మ దేవతకు నైవేద్యంసమర్పించారు. అలాగే ఆరెగూడెం, కొండాపురంలలో ముత్యాలమ్మగుడి వద్ద ఎడ్ల బండ్లు, బోనాలతో ప్రదక్షిణలు చేశారు.