రెండు, మూడు రోజుల్లో వెల్లడయ్యే అవకాశం
జిల్లాలో భారీగా మార్పులు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఎస్పీలు, డీఎస్పీల స్థాయిలో మార్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో కీలకమైన ఇన్‌స్పెక్టర్ల బదిలీలపై దృష్టి సారించింది. వరంగల్ రీజియన్ పరిధిలోని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ల బదిలీ ప్రక్రియ ఎట్టకేలకు ముగియనుంది. నెల క్రితం ఉత్తర్వులు ఇచ్చి నిలిచిన ఇన్‌స్పెక్టర్ల బదిలీల జాబితాను పోలీసు శాఖ సిద్ధం చేసింది. రెండు, మూడు రోజుల్లోనే బదిలీల ఆదేశాలు ఇక ఇన్‌స్పెక్టర్ల బదిలీలు వెల్లడయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇన్‌స్పెక్టర్ల బదిలీల ఉత్తర్వులు ఇప్పటికే రావాల్సి ఉండగా.. అసెంబ్లీ సమావేశాల కారణంగానే ఉత్తర్వుల విడుదల ఆగిపోయినట్లు పోలీసుశాఖ వర్గాలు చెబుతున్నాయి.
అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపే బదిలీ ఉత్తర్వులు వస్తాయని పేర్కొంటున్నాయి. సాధారణ ఎన్నికలు ముగిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి వరంగల్ రీజియన్‌లో ఇన్‌స్పెక్టర్ల బదిలీలు జరగలేదు. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో 29 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీసు శాఖ అక్టోబరు 17న ఉత్తర్వులు ఇచ్చింది. 24 గంటల్లోనే నిలిపివేసింది. టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలను పక్కనబెట్టి పోలీసు ఉన్నతాధికారులు నిబంధనల ప్రకారం పోస్టింగ్‌లు ఇవ్వడం వల్లే ఇలా జరిగిందని అప్పడు ప్రచారం జరిగింది. దీనికి తగినట్లుగానే ఇన్‌స్పెక్టర్ల పోస్టింగ్‌ల విషయంలో ప్రజాప్రతినిధుల నుంచి తాజాగా ప్రతిపాదనలు వెళ్లాయి.
వీటి ఆధారంగానే బదిలీల ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిసింది. ఇన్‌స్పెక్టర్ల పోస్టింగ్‌ల విషయంలో పూర్తిగా ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలకే ప్రాధాన్యత ఉంటుందా లేదా అనేది బదిలీ ఉత్తర్వులతో స్పష్టత రానుంది. ఇన్‌స్పెక్టర్ల బదిలీలకు సంబంధించి కొందరి పోస్టింగ్‌లపై స్పష్టత వచ్చినట్లు పోలీసు శాఖ వర్గాలు తెలిపాయి. మడికొండ, హసన్‌పర్తి, గీసుగొండ ఇన్‌స్పెక్టర్ల పోస్టింగ్‌ల విషయంలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. తుది దశలో మార్పులు లేకుంటే జాబితా ఇలా ఉంటుందని విశ్వసనీయవర్గాల సమాచారం.
సిద్ధమైన పోస్టింగ్‌ల జాబితా
Published Sun, Nov 23 2014 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM
Advertisement