అభివృద్ధిలో బార్సిలోనా నగరాన్ని ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు అభిప్రాయపడ్డారు. గురువారం హెచ్‌ఐసీసీలో జరిగిన మెట్రోపొలిస్ సదస్సులో ‘ఫైనాన్సింగ్ టెరిటోరియల్....
సాక్షి, సిటీబ్యూరో: అభివృద్ధిలో బార్సిలోనా నగరాన్ని ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు అభిప్రాయపడ్డారు. గురువారం హెచ్‌ఐసీసీలో జరిగిన మెట్రోపొలిస్ సదస్సులో ‘ఫైనాన్సింగ్ టెరిటోరియల్ డెవలప్‌మెంట్’ అంశంపై జరిగిన చర్చలో పలువురు వక్తలు మాట్లాడారు. స్పెయిన్ దేశ స్థూల జాతీయోత్పత్తిలో బార్సిలోనా నగరం వాటా సుమారు 50 శాతం ఉందని వారు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం, నూతన అవకాశాల సృష్టి, వనరుల వినియోగం, అన్ని రంగాల సమతుల్య అభివృద్ధితోనే ఈ నగరాభివృద్ధి సాధ్యపడిందని వారన్నారు. వర్ధమాన దే శాల్లోని పలు నగరాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్లేందుకు ఈ నగరాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అందరి సహకారంతోనే అభివృద్ధి..
అన్ని కీలక రంగాల్లో సంస్కరణలు చేపట్టడం, పన్నుల వసూలు పకడ్బందీగా ఉండడంతో తమ నగరం అభివృద్ధి చెందిందని బార్సిలోనా మెట్రోపాలిటన్ ఏరియా తొలి ఉపాధ్యక్షుడు ఆంటోనియో బాల్మన్ అన్నారు. అభివృద్ధిలో ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా తీసుకోవడంతో సత్ఫలితాలు వచ్చినట్టు చెప్పారు.
వరదలతో సతమతం..
జోహెన్స్‌బర్గ్ (దక్షిణాఫ్రికా) మేయోరల్ కమిటీ సభ్యుడు జెఫీమకుబో మాట్లాడుతూ.. తమ నగరం మంచినీటి ఎద్దడి, మైనింగ్ వల్ల తలెత్తే సమస్యలు, వరదలు, జనాభా పెరుగుదలతో సతమతమవుతుండడంతో ఆర్థికాభివృద్ధి మందగించిందన్నారు. దీంతో వాణిజ్య బ్యాంకులు, ప్రజల నుంచి నగరాభివృద్ధికి పెట్టుబడులు సమీకరించి ఇప్పుడిప్పుడే సత్ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు.
వసతుల కల్పనకు పెద్దపీట..
డచ్ డెవలప్‌మెంట్ పార్క్‌కు చెందిన ఫ్లెక్స్ మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలని సూచించారు. వాతావరణ మార్పులను తట్టుకునేలా నిర్మాణాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. నగరాభివృద్ధికి కేటాయించే నిధులు పక్కదారి పట్టకుండా చూడాల్సిన అవసరముందన్నారు. నగదు ఆడిట్ ప్రతి విషయంలో తప్పనిసరిగా ఉండాలన్నారు.