సాక్షి, హైదరాబాద్: వాహనదారుల అతివేగం వల్ల ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్) రక్తసిక్తమవుతోంది. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఓఆర్‌ఆర్‌లో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇప్పటికీ రక్తపుటేర్లు పారుతూనే ఉన్నాయి.
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ), సైబరాబాద్, రాచకొండ పోలీసులు తీసుకుంటున్న చర్యల వల్ల గతంలో కన్నా రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గినా.. ఆ ఘటన జరిగిన సమయంలో తీవ్రగాయాలై అక్కడికక్కడే మరణిస్తున్నవారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఓఆర్‌ఆర్‌పై హెల్త్ ఎమర్జెన్సీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హెచ్‌ఎండీఏ ప్రణాళిక సిద్ధం చేసింది.
‘గోల్డెన్ అవర్’ కీలకం..
గోల్డెన్ అవర్.. అంటే ప్రమాదం జరిగిన తర్వాత మొదటి గంట(60 నిమిషాలు) సమయం. ప్రమాద తీవ్రతను బట్టి గోల్డెన్ అవర్ సమయం మారుతూ ఉంటుంది. ప్రమాదం జరిగి తీవ్రగాయాలైన సమయంలో క్షతగాత్రులను ‘గోల్డెన్ అవర్’లో ఆస్పత్రికి తీసుకురాకపొవడంతో అనేక మంది ప్రాణాలు వదులుతున్నారు. 158 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌లో 2015లో 84 ప్రమాదాలు జరిగితే 81 మంది.. 2016లో 104 దుర్ఘటనలు జరిగితే 119 మంది మృత్యువాతపడ్డారు.
ఈ ఏడాది ఇప్పటివరకు ఓఆర్‌ఆర్‌లో జరిగిన ప్రమాదాల్లో దాదాపు 50 మంది వరకు మృతి చెందారని రాచకొండ పోలీసులు చెబుతున్నారు. వాహనాల అతివేగం, డ్రైవర్ కునుకుపాట్లు తదితర కారణాల వల్ల జరిగిన ఈ ప్రమాదాల్లో గాయపడిన వారిని త్వరిగతిన ఆస్పత్రులకు చేరిస్తే ప్రాణాలు నిలిచేవని ఓఆర్‌ఆర్ నిర్వహణను చూసుకునే హెచ్‌ఎండీఏ అధికారులు భావిస్తున్నారు. క్షతగాత్రులకు ప్రాణం పోసే ‘గోల్డెన్ అవర్’లో ఆస్పత్రిలో చేర్చేలా పక్కా ప్రణాళిక రూపొందించారు.
20కిపైగా ఆస్పత్రులతో అవగాహన
ప్రస్తుతం ఓఆర్‌ఆర్‌పై సంచరిస్తున్న ఎనిమిది అంబులెన్స్‌లకు తోడు మరిన్ని అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చి ఒక్కో అంబులెన్స్‌ను పది నుంచి 15 కిలోమీటర్ల మధ్య నిలిపి ఉంచేలా హెచ్‌ఎండీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఫోన్‌కాల్ రాగానే ఆ ప్రాంతానికి ఐదు నిమిషాల వ్యవధిలో చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తీసుకెళ్లేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు రాంగ్‌రూట్‌లో వెళ్లేలా కూడా అనుమతివ్వనున్నారు.
108 ఫోన్‌కాల్ సెంటర్‌తోనూ చర్చలు జరిపిన అధికారులు.. వారికి ప్రమాద ఫోన్‌కాల్ రాగానే ఓఆర్‌ఆర్‌పై ఉన్న అంబులెన్స్‌లకు సమాచారం ఇచ్చేలా చర్చలు జరిపారు. అలాగే ఓఆర్‌ఆర్‌కు సమీపంలో ఉన్న దాదాపు 20కిపైగా ఆస్పత్రులతో ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చిన అధికారులు.. ప్రమాదంలో గాయపడిన వారిని అక్కడికి తీసుకెళ్లి చికిత్స కోసం అయ్యే ఖర్చును హెచ్‌ఎండీఏనే భరించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ఓఆర్‌ఆర్‌పై హెల్త్ ఎమర్జెన్సీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment