సాక్షి, హైదరాబాద్: అరవై ఏళ్లలోపు వయసున్న రైతులకే ‘రైతు బీమా’ అమలు చేయాలని వ్యవసాయశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతోపాటు ఏదైనా ఉద్యోగంలో ఉండి వ్యవసాయం చేస్తున్నవారికి ఈ బీమా వర్తింపజేయకూడదని భావిస్తోంది. ఈ మేరకు రైతు బీమా మార్గదర్శకాలపై వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
రూ.5 లక్షల బీమా..
రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బీమా పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందుకు బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించింది కూడా. ఈ బీమా వర్తించే రైతు ఏ కారణంతో మరణించినా రూ.5 లక్షల పరిహారం ఇస్తారు. అంటే సాధారణ మరణం పొందినా, ఆత్మహత్య చేసుకున్నా, ప్రమాదంలో చనిపోయినా ఆయా రైతుల కుటుంబాలకు బీమా పరిహారాన్ని అందజేస్తారు. ఈ బీమా పరిహారంలో కేంద్రం రూ.2 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షలు భరిస్తాయి. అయితే కేంద్రం 50 ఏళ్లలోపువారికి మాత్రమే బీమా అమలుచేస్తుంది. అయితే దీనిని 60 ఏళ్ల వరకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
ఉద్యోగులు వ్యవసాయం చేస్తే..
అనేకమంది ఉద్యోగులకు ఎంతో కొంత వ్యవసాయ భూమి ఉంటుంది. అయితే పట్టా భూములున్న రైతులందరికీ బీమా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. ఉద్యోగం, వ్యాపారం చేసే రైతులకూ పథకం వర్తించాల్సి ఉంటుంది. ప్రభుత్వమే సుమారు రూ.వెయ్యి వరకు ప్రీమియాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అయితే భూములున్న ఉద్యోగులు, వ్యాపారస్తులకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించడం ఏమేరకు సబబన్న చర్చ జరుగుతోంది. దీంతో ఈ అంశంపై ఏం చేయాలన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. మార్గదర్శకాలు ఖరారు చేసే సమయంలో.. భూమి ఉన్న ఉద్యోగులను గుర్తించే అవకాశముంది. ఇక బీమా పథకానికి 60 ఏళ్లలోపు వయసు అర్హతపై వ్యతిరేకత వచ్చే అవకాశముందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యవసాయం చేసే రైతులు ఆరోగ్యంగా ఉంటారని, చాలా మంది 60 ఏళ్లుపైబడి జీవిస్తారని అంటున్నారు. దీంతో 60 ఏళ్లలోపు వారికే బీమా అంటే ఎలాగని పేర్కొంటున్నారు.
అరవై ఏళ్లలోపు రైతులకే బీమా!
Published Sun, Mar 25 2018 3:13 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment