
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షాఫలితాల్లో చోటుచేసుకున్న గందరగోళం సాధారణ విషయం కాదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అతిపెద్ద కుంభకోణాల్లో ఇది ఒకటని బీజేపీ ఆరోపించింది. దాదాపు 10 లక్షల మంది విద్యార్థుల కుటుంబాలతో చెలగాటం ఆడటాన్ని ప్రభుత్వం సాధారణ విషయంగా తీసుకుందని మండిపడింది. ఇప్పటి వరకు 16 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. వివిధ అంశాలపై గంటల తరబడి సమీక్షలు చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వ్యవహారంపై ఒక్కమాట కూడా మాట్లాడకపోవటం విడ్డూరంగా ఉందని పేర్కొంది.
మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని కలసి వినతిపత్రం అందజేసింది. అనంతరం లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడారు. పది లక్షలమంది విద్యార్థులను తీవ్ర మనోవేదనకు, కొంతమంది ఆత్మహత్యలకు దారితీసిన ఈ ఉదంతాన్ని ప్రభుత్వం తేలికగా తీసుకోవటం భావ్యం కాదన్న విషయాన్ని సీఎస్ దృష్టికి తెచ్చినట్టు చెప్పారు. మంత్రి జగదీశ్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దైర్యంగా ఉండాలని, ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాన్ని దారిలోకి తెచ్చేందుకు అన్ని కలెక్టరేట్ల ఎదుట బుధవారం దిష్టిబొమ్మలు దహనం చేయనున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment