హార్వర్డ్ యూనివర్సిటీ లీడర్‌షిప్ కోర్సులో పాల్గొననున్న జగదీశ్వర్‌రావును అభినందిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి
సాక్షి, నల్లగొండ టౌన్ : నల్లగొండ జిల్లాకు చెందిన ప్రొఫెసర్ వీరనేని జగదీశ్వర్‌రావు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొంటూ జిల్లాకు పేరు ప్రఖ్యాతలను తీసుకువస్తున్నారు. నార్కెట్‌పల్లి మండలం షేర్‌బావిగూడెం గ్రామానికి చెందిన జగదీశ్వర్‌రావు ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ మల్టిమీడియా రీసెర్చ్ సెంటర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అమెరికా, చైనా, సింగపూర్, హాంకాంగ్, మకావ్, థాయ్‌లాండ్ దేశాల్లో పర్యటించి దూరవిద్య విధానానికి సంబంధించిన పీజీ స్థాయిలో కోర్సు రైటర్‌గా బాధ్యతలను నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో న్యాయం కోసం తెలంగాణ అనే ఇతివృత్తంతో డాక్యుమెంటరీ ఫిలిమ్‌ను ఆంగ్లం, తెలుగు భాషల్లో రూపొందించారు.
ప్రస్తుతం ఏడుగురు విద్యార్థులకు రీసెర్చ్ గైడెన్స్ ఇస్తూ పర్యవేక్షిస్తున్నారు. ఎంఏ సోషియాలజీని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1989లో పొందారు. అదే సమయంలో ఆర్ట్ కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా కూడా బాధ్యతలను నిర్వర్తించి విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారు. ఇటీవల అమెరికాలోని హార్వర్డ్ ఎంబటీ విశ్వవిద్యాలయంలో అకడమిక్ డిసిప్టెన్స్ అనే అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొని ప్రాచీన కాలం నుంచి నేటి వరకు విద్యావిధానంలో వస్తున్న మార్పులు చేర్పులు అనే అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్చించి, 50 దేశాల ప్రతినిధుల సమక్షంలో ప్రసంగించి మన్ననలు పొందారు. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకమైన లీడర్‌షిప్ కోర్సులో పాల్గొనేందుకు ఆయనకు యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది.
ప్రతి సంవత్సరం యూనివర్సిటీలో వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులైన వారికి లీడర్‌షిప్ ప్రోగ్రాంను నిర్వహిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 25 ఏళ్లకు పైగా సంబంధిత రంగంలో అనుభవం ఆధారంగా కోర్సులో పాల్గొనడానికి ఎంపిక చేస్తారు. ఈ లీడర్‌షిప్ కోర్సులో పాల్గొనడానికి ఎంపికైన వీరనేని జగదీశ్వర్‌రావు ఇటీవల హైదరాబాద్‌లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అభినందించారు. ఈ నెల 21న హార్వర్డ్ యూనివర్సిటీ లీడర్‌షిప్ కోర్సులో ఆయన పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment