సాక్షి, సిటీబ్యూరో: దసరా పండుగ వచ్చేస్తోంది...పిల్లందరితో కలిసి కుటుంబసభ్యులు అందరూ స్వగ్రామంలోకి వెళ్లే హడావుడిలో ఉన్నారు. ఇదే అదునుగా చోరీలు చేసేందుకు దొంగలు రెచ్చిపోతుండడంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు చెబుతున్నారు. నగరంలో ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో అంతరాష్ట్ర దొంగల ముఠాల కదలికలు ఉన్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు పెట్రోలింగ్ గస్తీని ముమ్మరం చేశారు. అలాగే పెళ్లిళ్లు, పండుగలు, బతుకమ్మ, దాండియా వంటి వేడుకల్లో పాల్గొనే మహిళలు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇటీవల శంషాబాద్ రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని చౌదరిగూడలోని ఓ ఇంట్లో ఉన్న దంపతులను మంగళవారం రాత్రి బెదిరించి బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లడం, సనత్‌నగర్ ఠాణా పరిధిలో నాలుగు రోజుల క్రితం అల్లాపూర్‌లో తాళం వేసి రెండు ఇళ్ల తాళాలు పగులకొట్టి సొత్తు దోచుకెళ్లడంతో అంతర్రాష్ట ముఠాల సంచారం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే ఎల్‌బీనగర్ ఠాణా పరిధిలోనిమా మన్సూరాబాద్ ఎస్‌బీఐ ఏటీఎంను పగులగొట్టిన హర్యానాకు చెందిన ముఠా రూ.15లక్షలకుపైగా నగదును ఎత్తుకెళుతూ అన్‌రిజిష్టర్డ్ ఆటోలో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అరెస్టు చేశారు.
దొంగలు హల్‌చల్ చేస్తున్నారు..
సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో వారం రోజుల్లో దొంగతనాలు పెరిగాయి. స్థానిక నేరస్తుల సహాయంతో అంతర్రాష్ట్ర ముఠాలు చోరీలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య దొంగతనాలు అధికంగా నమోదవుతున్నాయి. తాళం వేసిన ఇళ్లు, అపార్ట్‌మెంట్లలోని ప్లాట్లలోకి కొరియర్‌బాయ్, ఎలక్ట్రిషియన్, ప్లంబర్‌బాయ్, బంధువుగా చెప్పి ప్రవేశిస్తున్నారు. ఎవరైనా మీ రు ఎవరని ప్రశ్నిస్తే పై పోర్షన్‌లో ఉన్న వ్యక్తి రమ్మంటున్నారంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ఏమాత్రం అవకాశం చిక్కినా తాళం పగులగొట్టి అందినంత దొచుకొని పారిపోతారు. బ్యాచిలర్స్ గదుల్లోకి ఉద యం 5 నుంచి 7.30 గంటల మధ్యలో ప్రవేశించి ల్యాప్‌టాప్, మొబైల్స్ తదితర విలువైన వస్తువులు తస్కరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
డేంజర్ గాంగ్స్...
నగరంపై కన్నేసి సాధ్యమైనంత దొచుకొని వెళ్లే దొంగల ముఠాల్లో కొన్ని ప్రమాదకరమైనవి కూడా ఉన్నాయి. ఇరానీ గ్యాంగ్, చెడ్డీ గ్యాంగ్, రామ్‌జీ ముఠాలు ప్రమాదకరమైనవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఇరానీ ముఠాల్లో కొందరు రాత్రి చోరీలకు పాల్పడుతున్నారు. ఎదురుతిరిగితే చంపేందుకు కూడా వెనుకాడరు. నగర శివార్లను లక్ష్యంగా చేసుకునే దొంగతనాలకు పాల్పడేది చెడ్డీగ్యాంగ్ ముఠా. వీరంతా చోరీ సమయంలో ముఖం కనపడకుండా కండువాలు చుట్టుకుంటారు. చెప్పులను నడుముకు కట్టుకుంటారు. ఇంటి తలుపులను బండరాళ్లతో పగులకొడతారు. వీరి దగ్గర ఉండే పదునైన కత్తితో ఇంటివ్యక్తులపై దాడి చేసేందుకు వెనుకాడరు. ఇక రామ్‌జీ ముఠా విషయానికొస్తే పగటిపూట దృష్టి మరల్చి డబ్బులు కిందపడ్డాయని, బంగారం దొరికిదంటూ నమ్మించి టోకరా వేస్తారు. అలాగే బైక్‌పై వెళ్లే వారిని అనుసరిస్తూ శరీరంపై దుమ్ము పడిందని,పురుగులున్నాయని భ్రమ కల్పిస్తారు. అది నిజమని నమ్మించేందుకు ఒకరకమైన స్ప్రే చల్లుతారు. ఆ సమయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నారని గ్రహించినా చేతిలో బ్యాగ్, చెడలో చైన్ మాయమైనట్టే. ఈ గ్యాంగ్ కూడా ఇటీవల రాత్రిళ్లు దొంగతనాలు చేస్తున్నట్టుగా పోలీసులు తేల్చారు.
సమీప పోలీసు స్టేషన్లకు సమాచారమివ్వండి...
కాలనీలు, అపార్ట్‌మెంట్లలో సీసీటీవీ కెమెరాలు, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటుచేసుకుంటే మంచిది. పండుగ పూట సొంతూళ్లకు వెళితే ఇంట్లోని విలువైన ఆభరణాలను లాకర్‌లో పెట్టుకుంటే మంచిది. కొత్త వ్యక్తులు కనపడితే సమీపంలోని ఠాణాలకు సమాచారమివ్వాలి. ఒకవేళ సుదూర ప్రాంతాలకు వెళ్తున్నట్టయితే పోలీసులకు సమాచారం ఇస్తే అలర్ట్‌గా ఉంటారు. ప్రత్యేక బృందాలతో పోలీసులు గస్తీ నిర్వహిస్తారు.
–వీసీ సజ్జనార్,సైబరాబాద్ పోలీసు కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment