‘నామినేటెడ్’ పోస్టులపై...
- పదవుల కోసం నాయకుల చుట్టూ చక్కర్లు
- ప్రసన్నం చేసుకోవడానికి నానా పాట్లు
- బయోడేటాలు సమర్పిస్తున్న ఆశావహులు
సాక్షి, మంచిర్యాల : ‘నాతో కలిసి, పార్టీ కోసం పనిచేసిన వారందరినీ గుర్తుపెట్టుకుంటా. వీలైనంత వరకు అందరికీ పదవులు వస్తాయి’అని ఆచార్య జయశంకర్ మూడో వర్ధంతి సందర్భంగా టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలు గులాబీ దండులో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీలతోపాటు నామినేటెడ్ పోస్టుల భర్తీకి కేసీఆర్ పచ్చజెండా ఊపారు. తాజా ప్రకటనతో నామినేటెడ్ పోస్టుల కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఇన్నాళ్లు ఉద్యమంలో భాగంగా కీలక పాత్ర పోషించిన తమకు పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పదవి ఇస్తే సముచితంగా ఉంటుందని పేర్కొంటున్నారు. జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా ప్రధానంగా జిల్లాలో మార్కెట్ కమిటీ చైర్మన్, ఆలయాల చైర్మన్‌తోపాటు గ్రంథాలయ చైర్మన్ వంటి పదవులు నామినేటెడ్ పద్ధతిలో భర్తీ చేస్తారు.
వీటికోసం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్ కారణంగా పోటీకి దూరంగా ఉన్న నాయకుల్లో ఆసక్తి జోరందుకుంది. ఈ పదవులే కాకుండా రాష్ట్రస్థాయి పాలకమండలిల్లో తమను సభ్యుడిగా నియమించాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా నుంచి పార్టీకి తొమ్మిది మంది ఎమ్మెల్యేలున్న నేపథ్యంలో నామినేటెడ్ పదవుల కేటాయింపుల్లో పెద్ద ఎత్తున్నే పార్టీ న్యాయం చేస్తుందనే భరోసా సదరు నాయకుల్లో ఉంది.
కాగా, ప్రభుత్వం ఏర్పడి దాదాపు నెలరోజులు కావస్తుండం, నామినేటెడ్ పోస్టులను భర్తీచేసే అవకాశం ఉండటంతో నాయకులు పార్టీ అధినేతలను కలుస్తున్నారు. పార్టీలోకి కొత్త నేతల వలసలు పెరుగుతున్న నేపథ్యంలో ఒకమాట చెప్పి ఉంచితే బాగుంటుందని భావిస్తున్నారు. ఆశావహులు కొందరు హైదరాబాద్ వెళ్లి మంత్రులు, రాష్ట్రప్రతినిధులను కలిసి తమ బయోడాటాలు ఇస్తున్నారు. అందులో తమ రాజకీయ జీవితంతోపాటు తెలంగాణ ఉద్యమంలో భాగంగా తమ భాగస్వామ్యాన్ని పేర్కొంటున్నారు.
వీటికే నియామకాలుజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌తోపాటు జిల్లాలోని మార్కెటు యార్డులు, దేవాలయాలకు చెందిన పాలకమండళ్లు నియామకం జరగనున్నాయి.
జిల్లాలో 17 మార్కెట్ యార్డులుండగా ఇందులో 13 యార్డులకు పాలకమండళ్లు ఉన్నాయి. ఆదిలాబాద్, జైనథ్, నిర్మల్, సారంగాపూర్, కుభీర్, ఖానాపూర్, లక్సెట్టిపేట, మంచిర్యాల, చెన్నూర్, సిర్పూర్ కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, ఇచ్చోడ, బోథ్, వీటికి పాలకమండళ్లు కొనసాగుతున్నాయి. మూడేళ్ల వీరి పదవీకాలం ఇంకా ముగియలేదు, ప్రభుత్వం నుంచి తొలగింపు ఆదే శాలు రాలేదు. ఈ నియామకాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగాయి.
అయితే ఈ నియామకాలను రద్దుచేస్తూ కొత్త వారిని నియమించే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే సదరు నియామకాలు చేసే అవకాశాలుంటాయని ఆశావహులు భావిస్తున్నారు. బెల్లంపల్లి, ఇంద్రవెల్లి, జైనూర్, భైంసాల కమిటీల నియామకం కాలేదు. వీటిని కూడా సంబంధిత నామినేటెడ్ సమయంలో భర్తీ చేసే అవకాశం ఉంది.
జిల్లాలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి వ స్తూ పాలకమండళ్లు ఉ న్న దేవాలయాలు26. ఇందులో ఏడు దేవాలయాలకు పాలకమండళ్లు ఉ న్నాయి. 16 దేవాలయాలకు లేవు. మరో రెండు మఠాలు, ఒక ధర్మశాలల కు పాలకమండలి నియామకం ఉండదు. పాలకమండళ్లు ఉన్న దేవాలయా లు అడెల్లి పోచమ్మ(సారంగాపూర్), లక్ష్మీదేవి ఆలయం (చింతగూడ), నా గోబా(కేస్లాపూర్), లక్ష్మీనరసింహస్వామి(కాల్వ), లక్ష్మీవెంకటేశ్వస్వామి ఆలయం (నిర్మల్), విశ్వనాథ ఆలయం(మంచిర్యాల), కత్తెరసాల మల్లన్న ఆలయం(చెన్నూర్), మదనపోచమ్మ ఆలయం(చెన్నూర్), బాలాజీ వెంకటేశ్వర ఆలయం(గంగాపూర్), జగన్నాథస్వామి ఆలయం(చెన్నూర్).