అట్టహాసంగా ఎమ్మెల్సీ అభ్యర్థి శిల్పా నామినేషన్
Published Wed, Mar 1 2017 12:38 AM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM
– రెండు సెట్ల నామినేషన్ పత్రాల దాఖలు
కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి కర్నూలు స్థానిక నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి మంగళవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సహా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత శిల్పా చక్రపాణిరెడ్డి తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి, జేసీ హరికిరణ్‌కు అందజేశారు. జిల్లా పార్టీ కార్యాలయం నుంచి టీడీపీ నేతలు పాదయాత్రంగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. నామినేషన్ పత్రాల దాఖలుకు రిటర్నింగ్ అధికారి చాంబర్‌లోకి అభ్యర్థితో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి, మరో మగ్గురిని మాత్రమే అనుమతించారు. అభ్యర్థి శిల్పా రెండు సెట్ల పత్రాలను దాఖలు చేశారు. అనంతరం శిల్పా చక్రపాణిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తనను గెలిపిస్తాయన్నారు.
జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలతో చర్చించిన తర్వాతే శిల్పాను అభ్యర్థిగా ఎంపిక చేశామన్నారు. గతంలో జరిగిన ఎన్నికల నాటితో పోలిస్తే ఇప్పుడు తమ పార్టీకి ఎక్కువ మెజార్టీ వస్తుందన్నారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్సీగా శిల్పాను మరింత ఎక్కువ మెజారిటీతో గెలిపించుకునేందుకు అందరం కలసికట్టుగా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బీసీ జనార్ధన్‌రెడ్డి, భూమా నాగిరెడ్డి, ఎస్‌వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, టీడీపీ నేతలు కేఈ ప్రభాకర్, కేఈ ప్రతాప్, తగ్గలి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
పోలీసు దిగ్బంధంలో కలెక్టరేట్
స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థిగా శిల్పా చక్రపాణిరెడ్డి నామినేషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో కలెక్టరేట్‌ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సోమవారం గౌరు వెంకటరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి మీడియాను అనుమతించారు. అయితే శిల్పా నామినేషన్‌కు మీడియాను అనుమతించలేదు. జేసీ, రిటర్నింగ్ అధికారి హరికిరణ్ ఆదేశాల మేరకు అన్ని దారులను మూసివేశారు.
Advertisement
Advertisement