‘మండలి ’ రేసులో... గులాబీ గుర్రాలు వీరే
అభ్యర్థుల ఖరారు.. అధికారిక ప్రకటనే తరువాయి
నామినేషన్ పత్రాలను భర్తీ చేసిన ఆరుగురు నేతలు
హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్‌లో మండలి అభ్యర్థులు ఎవరో వెల్లడైంది. అధికారికంగా ఇంకా ప్రకటించకున్నా, ఎమ్మెల్సీలుగా పోటీ పడనున్న వారి పేర్లు బయటకు వచ్చాయి. ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఈ పేర్లను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు బుధవారం ఆరుగురు నేతలు నామినేషన్ పత్రాలను భర్తీ చేశారు. గురువారం వీరంతా వాటిని దాఖలు చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీలు కె.యాదవరెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకుడు, పార్టీ కార్యాలయ కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి బుధవారం నామినేషన్ పత్రాలు భర్తీ చేశారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను తేలిగ్గా గెలుచుకుంటుంది. కాంగ్రెస్‌కు ఒక స్థానంలో విజయం సాధించేందుకు వీలుగా ఎమ్మెల్యేల సంఖ్య ఉంది.
టీఆర్‌ఎస్ నాలుగు స్థానాలను కైవసం చేసుకోవడానికే పరిమితం కాకుండా అయిదో స్థానం కోసం పోటీ పడాలని నిర్ణయించుకుంది. టీడీపీ, బీజేపీల ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థిని ఓడించి అయిదో స్థానాన్ని సొంతం చేసుకునేందుకు వ్యూహ రచన చేసింది. దీంతో ఆరుగురు నాయకులతో నామినేషన్ పత్రాలు నింపించారని సమాచారం. మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌ను గవర్నర్ కోటాలోనే సర్దుతారని, ముందు జాగ్రత్త చర్యగానే ఆయనతో నామినేషన్ పత్రాలు భర్తీ చేయించారని చెబుతున్నారు. ఇక, అయిదో స్థానంలో పార్టీ కార్యాలయ కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డిని పోటీకి దింపనున్నారని తెలిసింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా గెలిచే నాలుగు స్థానాలకు కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన కె.యాదవరెడ్డి, టీడీపీ నుంచి గులాబీ తీర్థం పుచ్చుకున్న వరంగల్ నేత బోడకుంటి వెంకటేశ్వర్లు, ఉప ముఖ్యమంత్రి కడియం, మంత్రి తుమ్మలకు కేటాయించారని సమాచారం. చివరి నిమిషంలో ఏవైనా మార్పులు చేర్పులు జరిగితే మినహా ఇవే పేర్లు ఖరారయ్యే అవకాశం ఉంది.