సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఐపీఎస్ అయిన అధికారులు కచ్చితంగా రెండేళ్లపాటు కేంద్ర సర్వీసుల్లో పనిచేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో రాష్ట్రంలోనూ, కేంద్ర సర్వీసుల్లోనూ కొన్ని కీలకమైన పోస్టులకు ప్యానల్ జాబితాలో చోటు దొరకకుండాపోయే ప్రమాదం ఏర్పడుతుంది. దీనితో తమని కేంద్ర సర్వీసుల్లోకి పంపాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
వరుసలో ఐదుగురు
సివిల్ సప్లయిస్ కమిషనర్‌గా ఉన్న సీవీ ఆనంద్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలని రెండేళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించడంతో ఆగిపోయారు. డిప్యుటేషన్‌లోకి రావాలని ఇటీవలే కేంద్ర హోంశాఖ మరోసారి ఆయనకు ఆఫర్ ఇచ్చింది. అదే విధంగా ఐజీ చారుసిన్హా సైతం కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చారుసిన్హా శిక్షణ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. రెండురోజుల క్రితమే ఐజీ హోదా నుంచి అదనపు డీజీపీగా పదోన్నతి పొందిన సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య సైతం కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. డీఐజీగా పదోన్నతి పొందిన రాచకొండ జాయింట్ కమిషనర్ తరుణ్‌జోషి సైతం కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇంటర్ కేడర్ డిప్యుటేషన్ లేదా కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు సీఐడీ ఐజీ సౌమ్యామిశ్రా సైతం ప్రభుత్వానికి విజ్ఞప్తి పెట్టుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆనంద్‌కే అవకాశం...
అదనపు డీజీపీ సీవీ ఆనంద్‌కే కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మిగతా అధికారుల విషయంలో ప్రభుత్వం ఒప్పుకోకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలే రాష్ట్రంలో అధికారుల కొరత ఉండటం, పైగా ఎన్నికల ఏడాది సమీపిస్తుండటంతో ఐపీఎస్ అధికారులను కేంద్ర సర్వీసుల్లోకి పంపితే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్నట్టు భావిస్తోంది. పైగా రాష్ట్ర కేడర్‌కు చెందిన 9మంది సీనియర్ ఐపీఎస్‌లు కేంద్ర సర్వీసుల్లోనే ఉన్నారు. వారంతా ఇప్పట్లో తిరిగి వచ్చేలా కనిపించడం లేదని, అందువల్లే ఆనంద్ మినహా మిగతావారికి అవకాశం ఉండకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
హస్తినకు పంపించరూ..
Published Mon, Feb 12 2018 12:59 AM | Last Updated on Mon, Feb 12 2018 12:59 AM
Advertisement
Advertisement