
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పనిచేస్తున్న ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లనున్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ ప్రస్తుతం సివిల్ సప్లయ్ శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు అనుమతివ్వాలని రెండేళ్లుగా ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు ఆనంద్ పేరును సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో డిప్యుటేషన్ అండ్ అలాట్‌మెంట్స్ కమిటీ ఆనంద్ నియామకంపై ఆమోదముద్ర వేసింది.
కేంద్ర పోలీస్ విభాగాల్లో ఒకటైన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్)లో ఇన్‌స్పెక్టర్ జనరల్(ఐజీ)గా ఐదేళ్లు పనిచేసేందుకు శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. అదే విధంగా 1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారిణి చారుసిన్హా సైతం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్)లో ఐజీగా ఐదేళ్లు పనిచేసేందుకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు వెలువరించింది. వీరిద్దరిని త్వరితగతిన రిలీవ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.