
సోమవారం కమిషనరేట్ వద్ద ధర్నా చేస్తున్న వివిధ జిల్లాల వ్యవసాయ ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: మండల వ్యవసాయాధికారుల (ఏవో) బదిలీలపై ఉద్యోగుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. గత నెల కౌన్సెలింగ్ చేసి పోస్టింగ్‌లు ఖరారు చేసిన అధికారులు, చివరకు జాబితాలో అనేక మార్పులు చేసి ఆదివారం అర్ధరాత్రి ఇష్టారాజ్యంగా ఉత్తర్వులు జారీ చేశారని మండిపడుతున్నారు. వ్యవసాయశాఖ ఉన్నతాధికారుల నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల వ్యవసాయ ఉద్యోగు లు సోమవారం కమిషనరేట్ వద్ద నిరసన చేపట్టారు. కౌన్సెలింగ్‌లో ఖరారు చేశాక మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరమేమిటని నిలదీశారు.
లక్షలు చేతులు మారాయని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా లో ఒక మండల ఏవో బదిలీ నిలుపుదలకు ఏకంగా రూ.20 లక్షలు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. తెలంగాణ అగ్రిడాక్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.రాములు ఆధ్వర్యంలో వ్యవసాయ కమిషనరేట్ ముందు ధర్నా జరిగింది. అక్రమంగా పోస్టింగ్‌లు కేటాయించిన వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు తాము ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విన్నవించామని రాములు తెలిపారు.
20 పోస్టుల్లో మార్పులు చేర్పులు...
ఏవోల బదిలీలకు గాను జూలై 9, 10 తేదీల్లో వ్యవసాయశాఖ కౌన్సెలింగ్ జరిపింది. ఓ కమిటీ ద్వారా దాదాపు 390 మంది ఏవోలకు కౌన్సెలింగ్ జరిపారు. అయితే రైతుబంధు బీమా ప్రక్రియ నడుస్తున్నందున వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వకుండా తాత్సారం చేశారు. దాదాపు 2 నెలలపాటు ఈ జాబితాను ఉన్నతాధికారులు తమ దగ్గరే ఉంచుకున్నారు. మంత్రులు, కొందరు ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ఒత్తిడులు, మరికొందరు లంచం ఎర చూపిన ఫలితంగా దాదాపు 20 పోస్టుల్లో మార్పులు చేర్పులు చేసినట్లు అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ నేతలు ఆరోపించారు. ప్రభుత్వ సీఎస్‌కు ఇచ్చిన వినతిలో 11 మంది బదిలీల్లో జరిగిన మార్పులు చేర్పుల వివరాలను పొందుపరచినట్లు రాములు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment