సాక్షిప్రతినిధి, వరంగల్ : జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎన్నికల్లో జెడ్పీటీసీ సభ్యులపై అనర్హత వేటు ఫిర్యాదులపై విచారణ ప్రక్రియ ముగిసింది. చైర్ పర్సన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటు వేసిన మొత్తం ఆరుగురు కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులు జిల్లా కలెక్టర్ జి.కిషన్‌కు తమ వివరణ.. లేఖ రూపంలో ఇచ్చారు. జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నిక సందర్భంగా విప్ ధిక్కరించి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరుగురు జడ్పీటీసీ సభ్యులపై కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు కలెక్టర్ జి.కిషన్ ఈ విచారణ చేశారు.
జెడ్పీటీసీ సభ్యులు బన్నెపాక గణేష్(పాలకుర్తి), నల్ల ఆండాలు(దేవరుప్పుల), బాకి లలిత(కొడకండ్ల) ఈ నెల 19న జిల్లా కలెక్టర్ జి.కిషన్‌ను కలిసి వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న వారు ఎవరు అనేది తమకు తెలియలేదని వివరించారు.
టీఆర్‌ఎస్ అభ్యర్థి పేరు ప్రకటించినప్పుడు గందరగోళం నెలకొందని... అయోమయంలో ఏ జరిగిందనేది తెలియలేదని పేర్కొన్నారు. మరో ముగ్గురు జెడ్పీటీ సభ్యులు శ్రీరాం భరత్‌కుమార్(నెల్లికుదురు), వంగాల రమాదేవి(శాయంపేట), కాట్రేవులు సాయిలు(చిట్యాల) సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి వివరణ ఇచ్చారు.
కాంగ్రెస్ పంపిన విప్ పత్రాలు తన అడ్రస్‌కు చేరలేదని నెల్లికుదరు జడ్పీటీసీ సభ్యుడు శ్రీరాం భరత్‌కుమార్ తెలిపారు. కాంగ్రెస్ పంపిన నోటీసులు అందలేదు. విప్ నాకు ఇవ్వలేదు. తప్పుడు సాక్ష్యాలతో నాకు నోటీసులు ఇప్పించేలా ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షడిపైనే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరాను అని శ్రీరాంభరత్ వివరించారు.
జడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికల్లో తాను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదని శాయంపేట జడ్పీటీసీ సభ్యురాలు వంగాల రమాదేవి చెప్పారు. ‘డీసీసీ అధ్యక్షుడు ఇచ్చిన ఫిర్యాదు తప్పు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎన్నిక విషయంలో నాకు ఎలాంటి విప్ అందలేదు. పార్టీ తరఫున ఎవరూ చెప్పలేదు. జెడ్పీ చైర్ పర్సన్ ఎన్నిక రోజున ఉన్న తాను గందరగోళ పరిస్థితులు ఉండడంతో ఏ పార్టీకి ఎవరు చేరుు ఎత్తారనేది గుర్తించలేదు’ అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ విప్‌కు సంబంధించిన ఎలాంటి ఆదేశాలూ తనకు ఇవ్వకుండానే చర్యల కోసం నోటీసులు జారీ చేసిందని చిట్యాల జెడ్పీటీసీ సభ్యుడు కాట్రేవుల సాయిలు చెప్పారు. ‘నోటీసులు నాకు అందలేదు. విప్ జారీ విషయం తెలియదు. నేను క్యాంపులో ఉన్నప్పుడు మా ఇంటికి కొందరు వచ్చి నా భార్యతో ఫోన్‌లో మాట్లాడించారు. ఏదో పేపర్ తెచ్చి సంతకం పెట్టమన్నారట. నేను వచ్చాక చూస్తాను వద్దని నా భార్యకు చెప్పారు. డీసీసీ అధ్యక్షుడు విప్ గురించి నాకు చెప్పలేదు. నాతో మాట్లాడలేదు. జెడ్పీ చైర్‌పర్సన్ ఓటింగ్‌కు సంబంధించి ఆ రోజు ఓటింగ్ సమయంలో గందరగోళ పరిస్థితి ఉంది. అదే సమయంలో చెయ్యి ఎత్తాను. నేను పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదు’ అని వివరించారు.
ఏం జరిగిందో.. ఏమో
Published Tue, Jul 22 2014 4:03 AM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM
Advertisement