
చంద్రబాబు వల్లే కరెంటు సమస్య
మాజీ మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుత విద్యుత్ సమస్యకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడే ప్రధాన కారణమని నల్లగొండ ఎమ్మె ల్యే, మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణలో విద్యుత్ శాఖను తనకు అప్పగిస్తే సమస్య లేకుండా చేస్తానని చంద్రబాబు చెప్పడాన్ని బట్టి కరెంట్ ఉండి కూడా ఇవ్వడం లేదనే విషయం అర్థమవుతోందని విమర్శించారు. మంగళవారం కోమటిరెడ్డి సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలసి ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని, నల్లగొండ జిల్లా పరిధిలోని హైదరాబాద్-విజయవాడ రహదారిలో మెడికల్ కళాశాల, సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో అన్ని వనరులు ఉన్నా విద్యుత్ ప్రాజెక్టులు పెట్టకపోవడం వల్లనే ఈ సమస్య ఏర్పడిందన్నారు. పొన్నాల లక్ష్మ య్య తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నిం చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చి 4 నెలలే అయిందని, అప్పుడే ఆయనపై విమర్శలు చేసే ముందు గత 60 ఏళ్లలో అధికారంలో ఉన్న పార్టీలు ఏంచేశాయనేదే తాను మాట్లాడుతున్నానని అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే జరిపి మళ్లీ రేషన్‌కార్డుల కోసం వృద్ధులను కార్యాలయాల చుట్టూ తిప్పడం సరికాదని చెప్పారు. పార్టీ మారుతాననే ఊహాగానాలు తనపై ఎప్పుడూ ఉంటాయని తేలిగ్గా తీసేశారు.