సిరిసిల్ల విద్యార్థికి ఐసెట్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు
సిరిసిల్ల: కార్మిక క్షేత్రంలోని ఓ పేదింట్లో విద్యాకుసుమం విరిసింది. మంగళవారం విడుదలైన ఐసెట్ ఫలితాల్లో సిరిసిల్లలోని బీవై నగర్‌కు చెందిన గాజుల వరుణ్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించాడు. గాజుల నిరంజన్, చంద్రకళ దంపతులకు కొడుకులు ఆదిత్య, వరుణ్, జయంత్. నిరంజన్ వార్పన్ కార్మికుడు. బీములు పోస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. 2005లో అనారోగ్యంతో నిరంజన్ మరణించాడు. బీడీ కార్మికురాలైన చంద్రకళ భర్తలేని లోటు రాకుండా పిల్లలను కష్టపడి చదివిస్తోంది. పెద్దాబ్బాయి ఆదిత్య ప్రైవేటు కంపెనీలో పని చేస్తుండగా.. వరుణ్ హైదరాబాద్ నిజాం కాలేజీలో ఇటీవలే బీఎస్సీ డిగ్రీ పూర్తిచేశాడు. చిన్నాబ్బాయి జయంత్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తయింది.
వరుణ్ చదువులో ఫస్ట్
వరుణ్ చదువులో మొదటి నుంచి ముందుండేవాడు. సిరిసిల్ల శాంతినగర్ శ్రీసిద్ధార్థ స్కూల్‌లో పదోతరగతి చదివి 563 మార్కులు సాధించాడు. కరీంనగర్ సీవీ.రామన్ కాలేజీలో ఇంటర్ ఎంపీసీ చదివి 979 మార్కులు సాధించాడు. చదువులో ఎప్పుడూ ముందుండే వరుణ్‌కు కరీంనగర్‌లో ఇంటర్ ఫ్రీ సీటు లభించింది. ప్రస్తుతం ఐసెట్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించాడు. దీంతో అతడి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.
సివిల్స్ సాధించడమే లక్ష్యం
ఐసెట్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో సివిల్స్ లో ర్యాంకు సాధించి ఐఏఎస్ కావాలని ఉంది. ఫస్ట్ ర్యాంకు రావడం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇదే పట్టుదలతో సివిల్స్ లక్ష్యంగా ముందుకెళ్తా.