
సిటీకి ఐటీ హారం
నగరం చుట్టూ 14 ఐటీ క్లస్టర్లు
ఐటీఐఆర్‌లో భాగంగా చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం
సైబరాబాద్, విమానాశ్రయం పరిధిలోనే 82 శాతం ప్రాజెక్టు ఏరియా
ఫలక్‌నుమా నుంచి విమానాశ్రయం వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు
హెచ్‌ఎండీఏకు బృహత్ ప్రణాళిక రూపకల్పన బాధ్యతలు
ఆశిస్తున్న పెట్టుబడులు 2,19,440 కోట్లు
ఐటీఐఆర్ మౌలిక స్వరూపం..
ప్రాజెక్టు ఏరియా :49,913 ఎకరాలు
ఆశిస్తున్న పెట్టుబడులు :2,19,440 కోట్లు
ఉద్యోగావకాశాలు :15.4 లక్షలు (ప్రత్యక్షంగా)
: 50.4 లక్షలు (పరోక్షంగా)
మౌలిక సదుపాయాల కోసం కేంద్రమిచ్చే సాయం :4,863 కోట్లు
కేంద్రం మంజూరు చేసింది : 3,275 కోట్లు
ప్రాజెక్టు కాల పరిమితి
తొలి విడత : 2013 - 2018
రెండో విడత : 2018 -2038
ఐటీ క్లస్టర్ల ఏర్పాటుకు గుర్తించిన ప్రాంతాలు
మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ/ఆర్థిక జిల్లా, రాయదుర్గం, కొండాపూర్, తెల్లాపూర్,
బహదూర్‌పల్లి, జవహర్‌నగర్, ఉప్పల్, పోచారం, హార్డ్‌వేర్ పార్కు, ఏపీఐఐసీ వర్క్ సెంటర్, ఫ్యాబ్ సిటీ, మహేశ్వరం
సాక్షి, హైదరాబాద్: ‘సమాచార సాంకేతిక పరిజ్ఞాన పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్)’ ప్రాజెక్టు కింద హైదరాబాద్ నగరం చుట్టూ 14 ఐటీ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు నగరం చుట్టూ అనువైన ప్రాంతాలను గుర్తించింది. మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ/ఆర్థిక జిల్లా, రాయదుర్గం, కొండాపూర్, తెల్లాపూర్, బహదూర్‌పల్లి, జవహర్‌నగర్, ఉప్పల్, పోచారం, హార్డ్‌వేర్ పార్కు, ఏపీఐఐసీ వర్క్ సెంటర్, ఫ్యాబ్ సిటీ, మహేశ్వరం ప్రాంతాలు అందులో ఉన్నాయి. 49,913 ఎకరాల (202 చదరపు కిలోమీటర్ల) విస్తీర్ణంలో తలపెట్టిన ఐటీఐఆర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే... సైబరాబాద్ పరిధితో పాటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాల్లో మరో ఐటీ విప్లవం రానుంది. ఐటీఐఆర్ ప్రాజెక్టు అవసరాల కోసం ఈ రెండు ప్రాంతాల నుంచే 82 శాతం స్థలాన్ని ప్రభుత్వం సేకరించనుంది. ఐటీఐఆర్ ప్రాజెక్టుకోసం ప్రతిపాదించిన 202 చదరపు కిలోమీటర్లలోని 41 శాతం (82.4 చ.కి.మీ.) ప్రాంతాన్ని ప్రాసెసింగ్ ఏరియా కోసం కేటాయించనున్నారు. అంటే ఈ ప్రాంతాల్లోనే ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు, వాటి కార్యాలయాలు ఏర్పాటవుతాయి. ఇలా ప్రాసెసింగ్ ఏరియాలో... 5.5 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఇప్పటికే అభివృద్ధి చెందిన గచ్చిబౌలి, మాదాపూర్, నానక్‌రాంగూడ ప్రాంతాల్లో ఉండగా... మిగతాది అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టు పరిధిలో మిగతా 59 శాతం ప్రాంతాన్ని ఐటీఐఆర్ పరిశ్రమల ఉద్యోగుల వసతికి కేటాయించనున్నారు. దీనికి నాన్ ప్రాసెసింగ్ ఏరియాగా పేరుపెట్టారు. సంక్షిప్త కార్యాచరణ నివేదికలో ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం ప్రణాళికను హెచ్‌ఎండీఏ రూపొందించనుంది.
ప్రాజెక్టు వెలుపల వసతులకు కేంద్ర సాయం
ఐటీఐఆర్ ప్రాజెక్టు వెలుపల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు అందజేస్తుంది. తొలి విడతగా వచ్చే ఐదేళ్లలో రూ.942 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ మొత్తంతో 2015 చివరికి ఉమ్దానగర్ నుంచి విమానాశ్రయం వరకు ఎంఎంటీఎస్ లైను ఏర్పాటు, ఫలక్‌నుమా నుంచి విమానాశ్రయం వరకు డబ్లింగ్. నానల్‌నగర్ కూడలి-హెచ్‌సీయూ డిపో, పంజాగుట్ట-ఎడులనాగులపల్లి, మూసాపేట-బీహెచ్‌ఈఎల్ కూడలి, హెచ్‌సీయూ డిపో-వట్టినాగులపల్లి వరకు ఔటర్ రింగు రోడ్డును విస్తరించనున్నారు. అలాగే, గోల్కొండ, రాయదుర్గం, మణికొండ, మహేశ్వరంలలో భారీ సబ్ స్టేషన్లు నిర్మించనున్నారు.
అంతర్గత వసతుల బాధ్యత రాష్ట్రానిదే..
ఐటీఐఆర్ ప్రాజెక్టుకు అంతర్గత మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వమే కల్పించనుంది. రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులతో పాటు ప్రాజెక్టు ప్రాంతంలో వసూలు చేసిన ఆస్తి పన్నులు, భూ వినియోగ మార్పిడి, లే అవుట్ల క్రమబద్ధీకరణ, ప్రాసెసింగ్ ఏరియాలోని భూముల లీజులు, విక్రయాలు తదితర మార్గాల్లో నిధులను సమకూర్చనుంది. రానున్న 25 ఏళ్లలో ఐటీఐఆర్ కోసం రాష్ట్రం రూ. 13,093 కోట్లను వెచ్చించాల్సి ఉంటుంది.
అంతర్గత వనరుల కల్పనకు కావాల్సిన నిధులు (రూ. కోట్లలో)
రహదారుల నిర్మాణం 2,320
డ్రైనేజీలు 1,084
ఘన వ్యర్థాల నిర్వహణ 105
విద్యుదీకరణ 2,111
టెలికాం నెట్‌వర్క్ 145
వర్షపు నీటి సంరక్షణ 156
భూ అభివృద్ధి వ్యయం 817
మొత్తం 13,093
ప్రాజెక్టు కోసం గుర్తించిన ప్రాంతాలు
స్థలం (చ. కి.మీ.ల్లో)
సైబరాబాద్ 86.7
శంషాబాద్ విమానాశ్రయం 79.2
ఉప్పల్, పోచారం 10.3
ఔటర్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడార్-1 11.5
ఔటర్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడార్-2 14.3
మొత్తం 202