
ఇది కలయేనా?
* కదలికలేని ఐటీఐఆర్
* ప్రకటించి మూడేళ్లయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే
* రూ. 3 వేల కోట్ల ఆర్థిక సాయంపై నోరు మెదపని కేంద్రం
* ప్రాజెక్టులో మార్పుచేర్పులు చేయాలని యోచన!
* మౌలిక వసతుల కల్పనకు ముందుకు రాని రాష్ట్ర సర్కారు
* ప్రాజెక్టు సాకారమైతే హైదరాబాద్ మరో సిలికాన్ వ్యాలీ
ప్రయోజనాలివి..
→ హైదరాబాద్ మరో సిలికాన్ వ్యాలీగా అవతరిస్తుంది.
→ వందలాది హార్డ్‌వేర్ కంపెనీలు, చిప్స్ తయారీ యూనిట్లు, స్టార్టప్స్ కంపెనీల ఏర్పాటు.
→ 202 చదరపు కిలోమీటర్ల పరిధిలో రహదారులు, మౌలిక వసతుల కల్పన.
→ ఔటర్ రింగ్‌రోడ్‌కు లోపలున్న సుమారు 165 గ్రామపంచాయతీల పరిధిలో అభివృద్ధి.
→ చైనా నుంచి కంప్యూటర్లలో వినియోగించే చిప్స్‌ను దిగుమతి చేసుకోకుండా దేశీయంగా ఇక్కడే తయారు చేసుకునే అవకాశం.
సాక్షి, హైదరాబాద్
లక్షలాది కొలువులు.. రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రవాహం.. ఐటీలో మేటిగా నిలిచే అద్భుత అవకాశం.. స్థూలంగా ఇదీ ఐటీఐఆర్!! భాగ్యనగరం రూపురేఖలే మార్చేసే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మూడేళ్ల కిందట నాటి యూపీఏ సర్కారు ప్రకటించిన ఈ ప్రాజెక్టు పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారైంది. 2018 నాటికి ప్రాజెక్టు మొదటి దశ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నా ఇప్పటిదాకా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఈ పథకానికి అందజేయాల్సిన రూ. 3 వేల కోట్ల ఆర్థిక సాయంపై కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. అంతేకాదు.. ఈ ప్రాజెక్టులో పలు మార్పుచేర్పులు చేయాలని ఎన్‌డీఏ సర్కారు యోచిస్తున్నట్లు తెలిసింది. అందువల్లే రూ.3 వేల కోట్ల సాయం ఇంకా రాష్ట్ర సర్కారుకుఅందలేదు.
కేంద్రం పైసా విదల్చకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిత ప్రాజెక్టు పరిధిలో వసతుల కల్పన అంశంపై చేతులెత్తేసింది. దీంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్(ఐటీఐఆర్) ప్రాజెక్టు ‘కల’గానే మిగిలిపోతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ ప్రాజెక్టు స్వరూపం: సుమారు 202 చదరపు కిలోమీటర్ల పరిధిలో మూడు క్లస్టర్లుగా ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఉప్పల్-పోచారం, సైబరాబాద్-శంషాబాద్ ఎయిర్‌పోర్ట్(గ్రోత్ కారిడార్-1), శంషాబాద్-ఉప్పల్(గ్రోత్ కారిడార్-2) పరిధిలో 2018 నాటికి ప్రాజెక్టు మొదటి దశ పూర్తి చేయాలని సంకల్పించారు. ఐటీఐఆర్‌తో నగరానికి రూ.2.18 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించవచ్చని ప్రతిష్టాత్మక అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ప్రైస్ వాటర్ కూపర్స్ అంచనా వేసింది. ఇది సాకారమైతే సుమారు 25 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని పేర్కొంది.
ప్రస్తుత పరిస్థితి ఇదీ..
ఐటీఐఆర్ పరిధిలో ఐటీ, హార్డ్‌వేర్ పరిశ్రమలు తరలిరావాలంటే రూ.13,093 కోట్ల అంచనా వ్యయంతో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలని 2013లోనే ప్రైస్ వాటర్ కూపర్ సంస్థ అంచనా వేసింది. ఇందులో రూ.3 వేల కోట్లు భరిస్తామని కేంద్రం అప్పట్లో చెప్పింది. మిగతా రూ.10,093 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని నిర్దేశించింది. వసతుల కల్పనలో ప్రధానంగా మంచినీరు, మురుగు నీటి పారుదల, వాననీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రహదారుల విస్తరణ వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. అయితే నేటికీ కార్యాచరణ మొదలు కాలేదు. కేంద్రం నయా పైసా ఇవ్వకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా చేపట్టాల్సిన పనులపై మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో ప్రాజెక్టుపై ముందడుగు పడడం లేదు.
కంపెనీలు వస్తున్నాయి: జయేష్ రంజన్, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి
రాష్ట్ర ప్రభుత్వం, ఐటీ మంత్రిత్వ శాఖ, టీఎస్‌ఐఐసీ తీసుకుంటున్న చర్యలతో ఐటీఐఆర్ రీజియన్ పరిధిలో సంస్థల ఏర్పాటుకు పలు ఐటీ, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, మొబైల్ ఫోన్ కంపెనీలు తరలివస్తున్నాయి. ఇప్పటికే యాపిల్, మైక్రోమ్యాక్స్, గూగుల్, ఊబర్ వంటి కంపెనీలు ప్రత్యేక క్యాంపస్‌లు నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ రీజియన్‌లో దశల వారీగా మౌలిక వసతులు కల్పిస్తాం.
దశల వారీగా పనులు చేపట్టాలి: రమేశ్ లోకనాథన్, హైసియా అధ్యక్షులు
ఐటీఐఆర్ పరిధిలో ఐటీ, హార్డ్‌వేర్ పరిశ్రమలు నెలకొల్పేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. ఈ పరిధిలో దశలవారీగా మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్న ఐటీ పాలసీలో దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తారని భావిస్తున్నాం. మణికొండ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల అభివృద్ధికి సుమారు 15 ఏళ్ల సమయం పట్టింది.
ఐటీఐఆర్ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు నిధుల అవసం ఇదీ...(రూ.కోట్లలో)
మొదటి దశ: 2013-2018
పనులు కావాల్సిన నిధులు
రోడ్లు (డ్రెయిన్లు, వంతెనలు) 2,320
మురుగునీటి వ్యవస్థ 1.084
ఘన వ్యర్థాల నిర్వహణ 105
నీటిసరఫరా 6,355
విద్యుద్దీకరణ 2,111
టెలికాం నెట్‌వర్క్ 145
వాననీటి సంరక్షణ, 156
భూముల అభివృద్ధి 817
మొత్తం 13,093