ఐటీ కోర్సులు: అమీర్‌పేట్! | IT Courses offered for all students over Ameerpet | Sakshi
Sakshi News home page

ఐటీ కోర్సులు: అమీర్‌పేట్!

Published Wed, Jul 2 2014 11:47 PM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM

IT Courses offered for all students over Ameerpet

టాప్ స్టోరీ: పదోతరగతి విద్యార్థి నుంచి పట్టభద్రుల వరకు... బేసిక్ కోర్సుల నుంచి సర్టిఫికేషన్ల వరకు... ఎనీ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్ కోర్సుల కూడలి... అమీర్‌పేట్!! హైటెక్ సిటీ నిర్మాణానికి ముందు ఐటీ హబ్‌గా వెలుగులీనిన ఈ ప్రాంతం తర్వాత ఐటీ కోర్సుల శిక్షణ శిబిరంగా మారింది. ఆధునిక ప్రపంచానికి అవసరమైన సాంకేతిక సైనికులను తీర్చిదిద్దుతోంది!!
 
సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌తోపాటు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాలని కలలు కనే ప్రతి ఒక్కరికీ పరిచయం అక్కర్లేని ప్రాంతం అమీర్‌పేట. వందల సంఖ్యలో ఇన్‌స్టిట్యూట్‌లతో, వేల మంది విద్యార్థులతో వీధులన్నీ నిత్యం కోలాహలంగా ఉంటాయి. అంగుళం ఖాళీ లేకుండా భవనాల గోడల నిండా భారీ హోర్డింగులు, బ్యానర్లు దర్శనమిస్తాయి. రోడ్లన్నీ సాయంత్రం సమయానికి కరపత్రాలతో తివాచీ పరచినట్లు కనిపిస్తాయి.  అర్హతలేవైనా... వయసెంతైనా... ఇక్కడ అందుబాటులో ఉండే ఐటీ కోర్సులు అనేకం. ఇక్కడి కోచింగ్ సంస్థలు.. సాఫ్ట్‌వేర్ పరిశ్రమ డిమాండ్‌కు తగిన కోర్సుల్లో శిక్షణ ఇస్తూ సగటు విద్యార్థుల సమున్నత కెరీర్ అవకాశాలకు అండగా నిలుస్తున్నాయి. ‘హైదరాబాద్ పరిధిలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాను. కోర్సు పూర్తై కొలువు దక్కలేదు. స్నేహితులు, సీనియర్ల సలహా మేరకు అమీర్‌పేటలో టెస్టింగ్ టూల్స్ కోర్సులో చేరాను. ఎలాగైనా ఆర్నెల్లలో ఉద్యోగం సంపాదిస్తాననే నమ్మకం ఏర్పడింది’ అంటున్నాడు ఏడాది క్రితం బీటెక్ పూర్తిచేసిన మహేందర్. అమీర్‌పేట పరిసరాల్లోకి అడుగుపెట్టిన విద్యార్థిలో మానసిక  స్థైర్యంతోపాటు భవిష్యత్తుపై ధీమా కూడా ఏర్పడుతుందనేందుకు ఇలాంటి ఉదాహరణలెన్నో.
 
 ఎవరెవరికి ఏ కోర్సులు:
 అకడమిక్ బ్యాగ్రౌండ్ ఏదైనా విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో చేరుతున్నారు. కంపెనీలు కూడా అభ్యర్థులు ఎంపిక చేసుకున్న ప్లాట్‌ఫాంలో నైపుణ్యాలను పరీక్షిస్తూ, అకడమిక్ ప్రతిభను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఉదాహరణకు బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, బీఎస్సీ.. వీటిలో ఏ కోర్సునభ్యసించినవారైనా సీ, సీ++, జావా, డాట్‌నెట్, ఒరాకిల్, ఐబీఎం మెయిన్ ఫ్రేమ్స్ పీహెచ్, హడూప్, షేర్‌పాయింట్, జెక్వెరీ, హెచ్‌టీఎంఎల్5 సీఎస్‌ఎస్3, ఎంవీసీ, డబ్ల్యూఎఫ్, లినక్స్, మైక్రోసాఫ్ట్ సర్వర్స్,  సిస్కో రూటర్స్, వీఎంవేర్ మొదలైన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ కోర్సులతోపాటు ఆండ్రాయిడ్, ఐఫోన్ మొబైల్ అప్లికేషన్‌లనూ నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. బీకామ్ విద్యార్థులు టాలీ తదితర అకౌంటింగ్ కోర్సుల్లోనూ చేరుతున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ విద్యార్థుల కోసం వీఎల్‌ఎస్‌ఐ డిజైన్, క్యాడ్/క్యామ్ తదితర కోర్సులూ అందుబాటులో ఉన్నాయి.  ‘అమీర్‌పేటలో కోర్సులు నేర్చుకున్న వారు ప్రపంచంలో ఎక్కడైనా తమ సత్తా నిరూపించుకోగలరు. అమెరికా తదితర దేశాలకు వెళ్లాలనుకునే వారు ఇక్కడికే వచ్చి అవసరమైన కోర్సుల్లో శిక్షణ పొందుతారు. మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా డిమాండ్ ఉన్న కోర్సులు నేర్చుకుంటే తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుతం షేర్‌పాయింట్ - 2013 కోర్సుకు డిమాండ్ ఉంది’ అని పీర్స్ టెక్నాలజీస్ ఇన్‌స్టిట్యూట్ ఆపరేషన్స్ హెడ్ ఎన్.రామకోటేశ్వరరావు తెలిపారు.
 
 అమీర్‌పేటే ఎందుకు?
 హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్, కూకట్‌పల్లిలో కూడా మంచి ఇన్‌స్టిట్యూట్‌లు, కోర్సులు అందుబాటులో ఉన్నప్పటికీ విద్యార్థులు అమీర్‌పేటకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. దేశంలో సాఫ్ట్‌వేర్ అభివృద్ధి మొదలైన తొలినాళ్లలో సాఫ్ట్‌వేర్ నిపుణులకు, కోర్సులకు విస్తృత డిమాండ్ ఉండేది. ఆ సమయంలోనే సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా(ఎస్‌టీపీఐ), హైదరాబాద్ అమీర్‌పేటలోని మైత్రీవనం భవనంలో ఏర్పాటు చేశారు. ఎస్‌టీపీఐ అనుమతులు పొందినవారు చుట్టు పక్కల ఉన్న ఆదిత్య ఎన్‌క్లేవ్స్‌లోని అన్నపూర్ణ, నీలగిరి బ్లాకుల్లో చిన్న ఇన్‌స్టిట్యూట్‌లను ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఇక్కడికి వచ్చి వివిధ ఐటీ కోర్సులను అభ్యసించేవారు. దాంతో అమీర్‌పేట ఐటీ శిక్షణకు ప్రధాన కేంద్రంగా మారింది. తర్వాత కాలంలో ఎస్‌టీపీఐ మాదాపూర్‌లోని సైబర్ టవర్స్‌లోకి మారినప్పటికీ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు ఇక్కడే కొనసాగాయి. ప్రస్తుతం అమీర్‌పేటలో ఇన్‌స్టిట్యూట్‌ల సంఖ్య 600లకు పైనే ఉంటుంది. పోటీ వాతావరణం నెలకొనడంతో ఇన్‌స్టిట్యూట్‌లు వీలైనంత తక్కువ ఫీజులకే కోర్సులను ఆఫర్ చేస్తూ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి.
 
 ఫీజులు:
 ఒక్కో ఇన్‌స్టిట్యూట్‌లో ఒక్కో కోర్సుకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఫీజులు కూడా ఇన్‌స్టిట్యూట్‌లను బట్టి మారుతుంటాయి. రూ.300 నుంచి రూ.15000 వరకు అమీర్‌పేటలో అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ అర్హతలు, అభిరుచులకు తగిన కోర్సులను ఎంపిక చేసుకోవాలి.   
 
 విదేశీ విద్యార్థులు- మెచ్చిన కోర్సులు
 అమీర్‌పేట్‌లో అందుబాటులో ఉండే కొన్ని ప్రత్యేక కోర్సులు నేర్చుకోవడానికి విదేశీ విద్యార్థులు కూడా క్యూ కడుతుంటారు. కెన్యా, లైబీరియా, మాల్దీవులు, మెక్సికో, నేపాల్, నైజీరియా, ఫిలిప్పీన్స్, దక్షిణాఫ్రికా, దక్షిణ సుడాన్, థాయిలాండ్, ఉగాండా, జాంబియా తదితర దేశాల నుంచి ఇక్కడికి కోర్సులనభ్యసించడానికి వస్తుంటారు.  
 
 ఇన్‌స్టిట్యూట్, కోర్సు ఎంపికలో జాగ్రత్తలు:

 -    మార్కెట్ ట్రెండ్‌కనుగుణంగా డిమాండ్ ఉన్న కోర్సును ఎంచుకోవాలి.
 -    కోర్సు పూర్తయ్యాక ఎలాంటి అవకాశాలు ఉంటాయో తెలుసుకోవాలి. ఆయా సంస్థల్లో పనిచేయడానికి ఆసక్తి ఉంటేనే కోర్సుల్లో చేరాలి.
 -    కోర్సు కాలపరిమితిని దృష్టిలో ఉంచుకోవాలి. సదరు కోర్సును తక్కువ కాలవ్యవధుల్లో ఆఫర్ చేసే ఇన్‌స్టిట్యూట్‌లో చేరేముందు, ఆ పరిమిత కాలంలో పూర్తి నైపుణ్యాలు సాధించగలరో లేదో విశ్లేషించుకోవాలి.
 -    ఇన్‌స్టిట్యూట్‌లో ల్యాబ్స్, ఇతర సౌకర్యాలనూ దృష్టిలో ఉంచుకోవాలి.
 -    చేరాలనుకుంటున్న ఇన్‌స్టిట్యూట్ పాటించే ప్రమాణాలు, ఫ్యాకల్టీ అనుభవం తదితర అంశాలను స్నేహితులు, సీనియర్ల ద్వారా తెలుసుకోవాలి.
 
 క్వాలిటీ కోచింగ్
గత మూడేళ్లుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం స్తబ్దుగా ఉండడంతో కొన్ని కోర్సులకు ఆదరణ తగ్గింది. అయితే ఐటీ రంగం మళ్లీ ఊపందుకోనున్న నేపథ్యంలో ఐటీ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. తక్కువ కాస్ట్‌తో క్వాలిటీ కోచింగ్ అందించడం అమీర్‌పేట ప్రత్యేకత.  
 - కె. శివ కుమార్,
 జీఎం, ఎడ్యుకేషన్ అకాడెమీ, జూమ్ టెక్నాలజీస్

 
మెయిన్ ఫ్రేమ్స్‌తో లైఫ్ టర్నయింది
 నేను 2009లో ఎంసీఏ పూర్తి చేశాను. రెసిషన్ సమయం. కొలువు సాధించలేనేమోనని ఆందోళన చెందేవాడిని. అమీర్‌పేటలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో ఐబీఎం మెయిన్‌ఫ్రేమ్స్ కోర్సులో చేరా.  నెల తిరగకముందే హెచ్‌సీఎల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం సాధించా. వృత్తిలో భాగంలో ఆన్‌సైట్ ద్వారా యూకేలో ఏడాదిపాటు పనిచేశా. ప్రస్తుతం బెంగళూరులో పనిచేస్తున్నాను. అమీర్‌పేటలో లభించే డిమాండ్ ఉన్న కోర్సుల్లో చేరితే సులువుగా ఉద్యోగం పొందొచ్చు.
 - వి. సురేశ్ రెడ్డి.
 కుంట్లగూడెం, నల్గొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement