రైల్రోకో కేసు కొట్టివేత
రైల్వే కోర్టుకు దత్తాత్రేయ, కోదండరాం, కేటీఆర్, రాష్ట్ర మంత్రులు
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేపట్టిన రైల్‌రోకో కేసుకు సంబం ధించి కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రులు, జేఏసీ చైర్మన్ బుధవారం బోరుుగూడలోని రైల్వేకోర్టుకు హాజరయ్యారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు నారుుని, పద్మారావు, కేటీఆర్, జేఏసీ చైర్మన్ కోదండరాం, బీజేపీ నేత జి.కిషన్‌రెడ్డి తదితరులు రైల్వే రెండో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. మౌలాలి రైల్వేస్టేషన్‌లో జరిగిన రైల్‌రోకో ఆందోళనలో పాల్గొన్నారని 2011లో రైల్వే పోలీసులు వీరిపై కేసులు నమోదు చేశారు. సుమారు 2 గంటలపాటు మంత్రులు, జేఏసీ చైర్మన్ కోర్టు ఆవరణలో గడిపారు.
తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజలపక్షాన ఉద్యమిస్తున్న కోదండరాం తెలంగాణ మంత్రులతో పిచ్చాపాటిగా, చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుతూ కనిపించడం గమనార్హం. ఈ నెల 24న తన కుమార్తె విజయలక్ష్మి వివాహనికి ఆహ్వానిస్తూ కేటీఆర్ తదితరులకు దత్తాత్రేయ శుభలేఖలు అందజేశారు. కోర్టు కేసుపై స్పందించాలని మంత్రులను విలేకరులు కోరగా అందరి తరఫున కోదండరాం మాట్లాడతారని చెప్పి కార్లలో వెళ్లిపోయారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక కేసులు నమోదయ్యాయని, పలు కేసులు ఇంకా ఆయా కోర్టుల్లో నడుస్తున్నాయని వివరించారు. రైల్‌రోకోకు సంబంధించి ఓ కేసును రైల్వే మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోట్టి వేశారు. మళ్లీ ఎప్పుడైనా రైల్‌రోకోలు చేసి ప్రయాణికులను ఇబ్బంది పెడితే జైలుకు పంపిస్తామని జడ్జి వ్యాఖ్యానించినట్లు తెలిసింది.